లండన్‌కు పాకిన జాతివివక్ష ఆందోళనలు

by  |
లండన్‌కు పాకిన జాతివివక్ష ఆందోళనలు
X

వాషింగ్టన్/లండన్: జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై అమెరికాలో చెలరేగిన నిరసన జ్వాలలు లండన్ వరకూ పాకాయి. ఇప్పటికే అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలియజేస్తున్నారు. తాజాగా బ్రిటన్ రాజధాని లండన్‌లో కూడా జాతి వివక్షకు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. సెంట్రల్ లండన్‌లో వేలాది మంది ప్రజలు జాతి వివక్షకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చారు. ‘బ్లాక్ లివ్స్ మ్యాటర్’ అనే ప్లకార్డులు చేతబట్టి వీధుల్లో నిరసనలు చేపట్టారు. గురువారం ఉదయం సమయంలో ప్రారంభమైన ఈ నిరసనలు మరింత తీవ్రం అవుతుండటంతో మెట్రొపాలిటన్ పోలీసులు ఆందోళనకారులను అదుపు చేయడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులు 13 మంది ఆందోళనకారులను అరెస్టు చేశారు. అంతే కాకుండా వేలాది మంది నిరసనకారులు మాస్కులు, ప్లకార్డులు ధరించి వెస్ట్‌మినిస్టర్ వైపు నడక సాగించారు. వీరందరినీ ఒక చోట పోలీసులు ఆపడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇక అదే సమయంలో ఆందోళనల్లో పాల్గొన్న బ్రిటిష్ నటుడు జాన్ బొయేగా తన ప్రసంగంతో ఉర్రూతలూగించాడు. స్టార్ వార్స్ సిరీస్‌లో నటించిన ఈ నటుడి ప్రసంగానికి ఆందోళనకారులు కరతాళ ధ్వనులు చేశారు. బ్లాక్ లైవ్స్ అన్నది ఇప్పటికే కాదు ఎప్పటికీ పెద్ద విషయమే అని అన్నారు. మేం ఎంత విజయవంతం అయినా.. మా విజయాలను జాతి వివక్షతో కించపరుస్తారని ఆవేదన చెందాడు. నేను ఈ ఆందోళనల్లో పాల్గొన్న తర్వాత సినిమా ఆఫర్లు వస్తాయో రావో తెలియదు. కానీ నా మాట మీద నేను నిలబడి ఉన్నానని చెప్పాడు. కాగా, జాతివివక్ష వ్యతిరేక ఆందోళనలపై బ్రిటన్ ప్రధాని బోరీస్ జాన్సన్ స్పందించారు. తాను కూడా జార్జ్ మరణంపై చాలా బాధపడుతున్నానని అన్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆందోళనకారులు తమ నిరసనలు విరమించాలని కోరారు.



Next Story

Most Viewed