వేగంగా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి : నోమురా!

by  |
వేగంగా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి : నోమురా!
X

దిశ, వెబ్‌డెస్క్: 2021 క్యాలెండర్ ఏడాదిలో ఆసియాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థగా భారత్ మారనుందని రీసెర్చ్‌ సంస్థ నోమురా అభిప్రాయపడింది. 2021లో భారత జీడీపీ 9.9 శాతం సానుకూల వృద్ధిని సాధిస్తుందని, ఇది చైనా 9 శాతం, సింగపూర్ 7.5 శాతం కంటే అధికమని నోమురా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం నుంచి భారత ఆర్థికవ్యవస్థ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందని, దేశీయంగా పరిస్థితులు అన్ని చక్కబడతాయని, సానుకూల వాతావరణం ఉంటుందని తెలిపింది.

గతంలో 2018 సమయంలో ఇలాంటి పరిస్థితే ఉండేదని, తర్వాత దేశీయంగా ఎలాంటి మార్పులు వచ్చాయో తెలిసిందేనని పేర్కొంది. 2021 తొలి త్రైమాసికంలో జీడీపీ 1.2 శాతం ప్రతికూలంగా ఉండొచ్చని, రెండో త్రైమాసికంలో 32 శాతానికి ఎగసిపడుతుందని అంచనా వేసింది. మూడవ త్రైమాసికంలో కొంత నెమ్మదించి 10.2 శాతం, చివరి త్రైమాసికంలో 4.6 శాతంగా ఉంటుందని తెలిపింది. మొత్తంగా 2021లో సగటు వృద్ధి 9.9 శాతంగా నమోదు కావచ్చని వివరించింది. 2020 ఏడాదికి గానూ 7.1 శాతంగా అంచనా వేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఊహించిన దానికంటే వేగంగా వృద్ధి నమోదైందని, ప్రస్తుత సంవత్సరానికి 9.4 శాతం సానుకూలంగా ఉంటుందని అంచనా వేసింది. ఇది సెప్టెంబర్‌లో అంచనా వేసిన 10.5 సానుకూలం నుంచి 1 శాతం వరకు తగ్గించింది. అదేవిధంగా 2021 ఏడాది మొదటి సగంలో ద్రవ్యోల్బణం 5.5 శాతంగా ఉండొచ్చని, రెండో సగంలో 4.1 శాతానికి తగ్గిపోవచ్చని అంచనా వేసింది. కొవిడ్-19 వ్యాక్సిన్ చుట్టూ ఉన్న అనిశ్చితి దృష్ట్యా 2021 మొదటి సగంలో ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించడం మేలని నోమురా అభిప్రాయపడింది.



Next Story

Most Viewed