భారత్‌లో కొత్తగా వెయ్యి రిటైల్ కేంద్రాలు : ఆసుస్!

by  |
భారత్‌లో కొత్తగా వెయ్యి రిటైల్ కేంద్రాలు : ఆసుస్!
X

దిశ, వెబ్‌డెస్క్: తైవాన్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్, ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఆసుస్ 2021కి సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఆఫ్‌లైన్ రిటైల్‌లో తన ఉనికిని విస్తరించేందుకు కృషి చేస్తోంది. వినియోగదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాదిలో సుమారు 1,000 రిటైల్ పాయింట్లను ప్రారంభించాలని భావిస్తోంది. ప్రస్తుతం ఆసుస్ ఉత్పత్తులు ఆఫ్‌లైన్ ఛానెల్‌తో పాటు మొత్తం 6,000 రిటైల్ కేంద్రాల్లో అందుబాటులో ఉంది. ‘లాక్‌డౌన్ తర్వాత దేశీయంగా డిమాండ్ పుంజుకుంటోంది. ఇదివరకు నెలకు దాదాపు 2.5 లక్షల యూనిట్ల విక్రయాలు ఉండగా, ఇటీవల రెట్టింపు స్థాయిలో విక్రయాలు నమోదయ్యాయి.

ప్రజలు ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ క్లాసెస్ నేపథ్యంలో అమ్మకాలు పెరిగాయని, రానున్న రోజుల్లో ఈ ధోరణి ఇలాగే కొనసాగుతుందని భావిస్తున్నాం’ అని ఆసుస్ ఇండియా బిజినెస్ కన్జ్యూమర్ అండ్ గేమింగ్ హెడ్ ఆర్నాల్డ్ సు చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్‌లో కంపెనీ 39 శాతం వృద్ధిని సాధించిందని, గత నెలలతో పాటు, ముఖ్యంగా అక్టోబర్‌లో పండుగ సీజన్ సమయంలో వినియోగదారులు పీసీ(పర్సనల్ కంప్యూటర్) విభాగంలో గేమింగ్ కోసం కొనుగోళ్లు చేశారని ఆర్నాల్డ్ వివరించారు. ఈ బలమైన వృద్ధిని ఇలాగే కొనసాగించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నాం. గత కొన్ని నెలలుగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూ మెరుగైన పనితీరును చూస్తున్నామని వెల్లడించారు.

Next Story

Most Viewed