రేపటితో అసెంబ్లీ సమావేశాలు క్లోజ్​..?

by  |
రేపటితో అసెంబ్లీ సమావేశాలు క్లోజ్​..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలను మంగళవారంతో ముగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. షెడ్యూల్ ప్రకారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 26 వరకు జరుగాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ముందుగా అనుకొన్న షెడ్యూల్ కంటే ముందే సభను ముగించాలని యోచిస్తున్నారు. దీనిలో భాగంగా కరోనా కేసుల వివరాలను అత్యవసరంగా తెప్పించుకున్నారు. నేటి సమావేశంలో సీఎం కేసీఆర్​ ముందుగా స్పీకర్​ అనుమతితో జీరో అవర్​ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించి, ఆ తర్వాత స్కూళ్లపై నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. తరవాత టీ బ్రేక్​ తీసుకుని దీనిపై బీఏసీ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సమావేశాల్లో బడ్జెట్‌ ఆమోదం మినహా.. ఇతర ముఖ్యమైన బిల్లులు లేవు. దీంతో బడ్జెట్‌పై చర్యను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి సమావేశాలను ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి బీఏసీ సమావేశం తర్వాత నేడే అధికారిక ప్రకటన చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ నెల 15 నుంచి మొదలైన తెలంగాణ బడ్జెట్​ అసెంబ్లీ సమావేశాల్లో 18న బడ్జెట్​ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత శనివారం ఒక్కరోజు మధ్యాహ్నం వరకు చర్చ సాగించి వాయిదా వేశారు. తిరిగి సోమవారం ఉదయం నుంచి సమావేశాలు మొదలయ్యాయి. అయితే కరోనా కేసుల పెరుగుదలను చూపిస్తూ ఈ సమావేశాలను రేపటితో ముగించేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం.

అసెంబ్లీకి కరోనా కేసుల వివరాలు

రాష్ట్రంలో కరోనా మహమ్మారి పెరుగుతుందని, రోజుకు రోజుకు రాష్ట్రంలో పాజిటివ్​ కేసులు భారీగా పెరిగిపోతున్నాయని వైద్యారోగ్య శాఖ అసెంబ్లీకి నివేదిక అందించింది. సీఎం, ఉన్నతాధికారుల ఆదేశాలతో సోమవారం ఉదయం 11 గంటలకు వైద్యారోగ్య శాఖ అధికారులు కరోనా కేసుల వివరాలను అసెంబ్లీకి పంపించారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఆదివారం ఒక్కరోజే 37,079 మందికి కరోనా పరీక్షలు చేయగా.. పరీక్షల్లో కొత్తగా 337 కరోనా కేసులు నమోదయ్యాయని, 337 కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 91 కేసులు ఉన్నట్లు నివేదికల్లో పేర్కొన్నారు. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,03,455కు చేరిందని, ఆదివారం కరోనా వైరస్‎తో ఇద్దరు మృతి చెందగా.. మొత్తం రాష్ట్రంలో 1,671 మంది కరోనాతో మృతి చెందినట్లు వెల్లడించారు.

కాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కు కరోనా పాజిటివ్​ రావడంతో త్వరగా నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. సతీష్ శనివారం మండలి సమావేశానికి హాజరుకావడంతో పాటుగా మంత్రి హరీష్​రావును చాలాసేపు ముచ్చటించారు. దీంతో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని, అసెంబ్లీ సమావేశాలను మంగళవారంతో ముగించాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed