అశోక్‌కు షాక్.. సొంత ట్రస్ట్ నుంచి ఔట్

by  |
అశోక్‌కు షాక్.. సొంత ట్రస్ట్ నుంచి ఔట్
X

టీడీపీ సీనియర్ నేత అశోక్‌ గజపతిరాజుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాకిచ్చింది. సింహాచలం దేవస్థానం చైర్మన్ పదవి నుంచి తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం రహస్య ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం సంస్థానాధీశులకు చెందిన మహారాజా అలక్‌ నారాయణ్‌ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌(మాన్సాస్‌) ట్రస్టు అధ్యక్ష పదవి నుంచి కూడా అశోక్‌ను అకస్మాత్తుగా తప్పించింది.

సింహాచలం దేవస్థానం ఛైర్మన్ పదవితో పాటు మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్‌గా అశోక్ గజపతి రాజు సోదరుడు, మాజీ మంత్రి పూసపాటి ఆనంద గజపతిరాజు కుమార్తె సంచైత గజపతిరాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు అందగానే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి సహాయంతో మాన్సాస్ కార్యాలయంలో సంచైత గజపతిరాజు ప్రమాణ స్వీకారం చేశారు.

కాగా, మాన్సాస్‌ ట్రస్టు పరిధిలో సింహాచలం ఆలయం సహా 108 దేవాలయాలు ఉన్నాయి. లక్షల కోట్ల విలువైన 14,800 ఎకరాల భూములు, విద్యాసంస్థలు, భవనాలు ఈ ట్రస్ట్ పరిధిలో ఉన్నాయి. ప్రతిష్ఠాత్మక కోరకొండ సైనిక్ స్కూల్‌తో పాటు మహారాష్ట్రలోని సైనిక్ స్కూల్ కూడా ఈ కుటుంబానికి చెందిన భూముల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యాసంస్థలు కావడం విశేషం.

అశోక్‌గజపతిరాజుకు వారసత్వంగా సంక్రమించిన జోడు పదవుల నుంచి ఆయనను తప్పించడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలోని విలువైన ఆస్తులను పరాధీనం చేసే కుట్రతోనే ఆయనను ప్రభుత్వం పదవుల నుంచి తొలగించిందని ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ఆమె నియమాకం చెల్లదని, మాన్సాస్ ట్రస్ట్ డీడ్ ప్రకారం రాజవంశంలో పెద్దవాడైన పురుష వారసుడే ట్రస్ట్ చైర్మన్‌గా ఉండాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై న్యాయపరంగా ముందుకు వెళ్తామని అశోక్ అనుచరులు చెబుతున్నారు.

రాజకీయ కక్ష సాధింపులకు హద్దు ఉంటుందని, తరాలుగా ప్రభుత్వాలు మార్చని అంశాల్లో తలదూర్చడం సరైన పద్దతి కాదని ప్రభుత్వ నిర్ణయంపై పలువురు ఉత్తరాంధ్ర నేతలు అభ్యంతరం చెబుతున్నారు. రాజకుటుంబం ప్రజా శ్రేయస్సు కోసం పని చేసిందని వారు గుర్తుచేస్తున్నారు. రాజకుటుంబం ఔదార్యం వల్లే విజయనగరం విద్యల నగరంగా విలసిల్లిందని, దక్షిణాది బనారస్‌గా పేరొందిందని వారు హితవు పలుకుతున్నారు.

tags : p, ashok gajapathi raju, sanchaita gajapathi raju, ysrcp, tdp

Next Story

Most Viewed