జోరుగా ఇసుక అక్రమ రవాణా.. అధికారులతో కలిసి ఇసుకాసురుల దందా..

by  |
జోరుగా ఇసుక అక్రమ రవాణా.. అధికారులతో కలిసి ఇసుకాసురుల దందా..
X

దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక, కరకగూడెం మండలాలలో కొనసాగుతున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేది ఎవరని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. పినపాక, కరకగూడెం మండలాలలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవల్సిన జిల్లా ఉన్నతాధికారులే ఇసుకాసురులతో చేతులు కలిపి దందా చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. మండలంలో బిళ్లేంధ్రుడు ఇసుకదందాలో 50% షేర్ పెట్టుకొని, ఆంధ్రా కాంట్రాక్టర్లతో భారీగా పెట్టుబడులు పెట్టించి అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్నాడని, ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఇసుక దందాలో మైనింగ్ టిఎస్‌ఎమ్‌డిసి అధికారులకు 10% వాటా ఉందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఏజెన్సీలో అమాయకులైన గిరిజన మహిళలను అడ్డం పెట్టుకొని ఆంధ్రా కాంట్రాక్టర్లు, బడాబాబులు ఇసుక దందాకు తెరలేపుతున్నారు. ఈ అక్రమ ఇసుక రవాణాని అడ్డుకోవటానికి స్థానిక పోలీసుశాఖ ప్రత్యేకదృష్టి సాధించాలని గిరిజనులు, గిరిజనసంఘాలు కోరుతున్నాయి. ఇసుక దందాపై అదేమీటని గిరిజనులు, పత్రికా విలేకరులు ప్రశ్నిస్తే కిందిస్థాయి అధికారుల దగ్గరనుండి జిల్లా అధికారుల వరకు మామూలు ముట్ట చెబుతున్నామని కాంట్రాక్టర్లు, గుమస్తాలు చెబుతున్నారు. దీనిపై స్థానిక టిఎస్‌ఎమ్‌డిసి పీఓ ఎల్లయ్యకు ఫోన్ చేయగా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం గమనార్హం. ఇసుక దందా గురించి స్థానిక తహసీల్దార్ ను వివరణ కోరగా మైనింగ్ డిపార్ట్మెంట్ ను సంప్రదించాలని సమాధానం ఇచ్చారు. పినపాక నియోజకవర్గం పూర్తిగా ఏజెన్సీప్రాంతం కావడంతో గిరిజన చట్టాలను అడ్డుగా పెట్టుకొని వారి కడుపు కొడుతున్నారని గిరిజనులు, గిరిజన సంఘాలు ఆవేదనవ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి అనుమతులు ఇచ్చిన పట్టా భూములను పరిశీలించాలని లేకపోతే పట్టాను రద్దు చేయాలని గిరిజనులు, గిరిజన సంఘాల నాయకులు, పలువురు మేధావులు కోరుతున్నారు.

Next Story

Most Viewed