వీఆర్ఏ.. బన్ గయా సెక్యూరిటీ గార్డ్!

by  |
వీఆర్ఏ.. బన్ గయా సెక్యూరిటీ గార్డ్!
X

దిశ, ఆదిలాబాద్: సారంగాపూర్ మండలంలో గ్రామ రెవెన్యూ సహాయకుడు (వీఆర్ఏ)గా పనిచేస్తున్న ఈ ఫొటోలోని వ్యక్తి పేరు నారాయణ. అవును! వీఆర్ఏ అంటున్నారు. మరి ఈయనేంటి సెక్యూరిటీ గార్డ్ యూనిఫాం వేసుకున్నాడని అనుకుంటున్నారా! నిజమే.. వీఆర్ఏ నారాయణ ఇకపై సెక్యూరిటీ గార్డ్‌గానే దర్శనమిస్తాడు. కారణమేమిటంటే, రెవెన్యూపరమైన సమస్య పరిష్కారం కాకపోవడంతో ఓ వ్యక్తి తహసీల్దార్ విజయారెడ్డిని హైదరాబాద్‌లో పెట్రోల్ పోసి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే భవిష్యత్‌లో రెవెన్యూ కార్యాలయాలపై, తహసీల్దార్లపై అలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే తహసీల్ కార్యాలయాల వద్ద సెక్యూరిటీ ఉండాలని భావించారు కాబోలు! ప్రభుత్వం కూడా విజయారెడ్డి హత్య తర్వాత రెవెన్యూ కార్యాలయాలకు సెక్యూరిటీ ఇస్తామని అప్పట్లో ప్రకటించింది. ఆ హామీ అమలులో భాగంగానే తహసీల్ కార్యాలయాల ఎదుట సెక్యూరిటీ గార్డులు కాపలా కాస్తున్నారు. నిర్మల్ జిల్లాలో కొద్ది రోజులుగా ఈ కొత్త భద్రతావిధానం అమలవుతోంది. కార్యాలయంలోకి వచ్చేవారిని అన్నీ పరిశీలించిన తర్వాతనే సెక్యూరిటీ గార్డ్‌లు లోనికి అనుమతిస్తున్నారు. కానీ, ఈ సెక్యూరిటీ గార్డులు ఎలాంటి శిక్షణ పొందినవారు మాత్రం కాదు. వీఆర్ఏలనే సెక్యూరిటీ గార్డ్‌లుగానూ పనిచేయిస్తున్నారు. కాగా కొన్నేండ్లుగా గ్రామాల్లో రెవెన్యూ పరమైన పనులకే పరిమితమైన వీఆర్ఏలు ప్రస్తుతం యూనిఫాం ధరించి సెక్యూరిటీ గార్డ్‌ పనులు చేయడం ఇబ్బందిగా భావిస్తున్నారు. కార్యాలయాల వద్ద భద్రత పెంచుతామని చెప్పిన ప్రభుత్వం వీఆర్ఏలకే యూనిఫాంలిచ్చి భద్రతా సిబ్బంది అని చెప్పడంపై అధికారుల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



Next Story

Most Viewed