వారికి చుక్కలు చూపిస్తున్న అచ్చెన్న

by  |
వారికి చుక్కలు చూపిస్తున్న అచ్చెన్న
X

దిశ, వెబ్ డెస్క్: దివంగత నేత ఎర్రంనాయుడు మరణం తర్వాత శ్రీకాకుళం జిల్లా టీడీపీని భుజాలపై మోస్తున్న నేత కింజరాపు అచ్చెన్నాయుడు. అన్న లేని లోటు తెలియకుండా కుటుంబాన్ని, ఇటు క్యాడర్ ను కాపాడుకుంటూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ మహా విజయ ప్రవాహంలో కొట్టుకుపోకుండా… టెక్కలిలో టీడీపీ జెండాను ఎగరవేశారు. అప్పటి నుండి వైసీపీ ఎన్ని ఒత్తిళ్లకు గురిచేసినా అదురుబెదురూ లేకుండా అధికార ప్రభుత్వంపై, స్థానిక వైసీపీ నేతలపై తిరగబడుతూనే ఉన్నారు. ఈఎస్సై కేసులో జైలుకి వెళ్లొచ్చాక సైలెంట్ అవుతారనుకుంటే… టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలను అచ్చెన్నకు అప్పగించారు. దీంతో ఆయన మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాకుళంలో వైసీపీ నాయకులకు, అధికారులకు ప్రోటోకాల్ పేరుతో చుక్కలు చూయిస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో 2019 ఎన్నికల్లో టెక్కలి నుండి అచ్చెన్నాయుడు, ఇచ్చాపురం నుండి బెందాళం అశోక్ టీడీపీ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఆధిపత్యం కోసం వైసీపీ, టీడీపీ నేతల మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తూనే ఉంది. మేము ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీ నేతల పెత్తనమేంటని అచ్చెన్న, అశోక్ ఆందోళనలు చేశారు. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని అశోక్ రోడ్డెక్కి మరీ రచ్చ చేశారు. అయినా, మార్పు లేకపోవడంతో ఆయన సైలెంట్ అయిపోయారు. కానీ అచ్చెన్న మాత్రం పోరాడుతూనే ఉన్నారు. చిన్న లింకు దొరికినా అధికార పక్షం నేతలను చీల్చి చెండాడుతూనే ఉన్నారు. అసెంబ్లీలో సర్కార్ పై చిందులు తొక్కుతూనే ఉన్నారు. ఆ ధాటిని తట్టుకోలేకే వర్షాకాల సమావేశాలకు అచ్చెన్న అటెండ్ అవకుండా… ఈఎస్సై కేసులో తప్పుడు అభియోగాలు మోపి ఆయనను జైలుకి పంపారని టీడీపీ వర్గాలు దుమ్మెత్తిపోశాయి.

హార్ట్ ఆపరేషన్ అయిన వ్యక్తిని కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కరోనా అంటించి ఆయనను లేకుండా చేయాలనే కుట్రకు వైసీపీ తెరలేపిందని పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు తమ్ముళ్లు. ఏది ఏమైనా జైలు పీరియడ్ లో టెక్కలి టైగర్ డల్ గానే కనిపించారు. ఆయన ఢీలా పడితే పార్టీకి కోలుకోలేని దెబ్బ తగులుతుందనో లేక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎర్రన్న ఫ్యాన్స్ పార్టీ నుండి సైడ్ అవుతారనో తెలియదు కానీ.. అచ్చెన్నకు పెద్ద పీట వేశారు చంద్రబాబు. మామూలుగానే పార్టీలో దూకుడుగా ఉండే అచ్చెన్న… పార్టీ ఏపీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినప్పటి నుండి మరింత దూకుడు పెంచారు.

టెక్కలి వైసీపీ ఇంచార్జ్ పదవి కోసం ముగ్గురు నేతల మధ్య వర్గపోరు నెలకొంది. చివరకు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ పదవి దువ్వాడ శ్రీనివాస్ ను అనుసరించింది. ఆయన ఎంట్రీతో అధికార, ప్రతిపక్షాల మధ్య ఆధిపత్యపోరు మరింత ఎక్కువైంది. స్థానిక అధికారులు కూడా ఆయన కనుసన్నల్లోనే నడుస్తున్నారని, ప్రోటోకాల్ పాటించడంలేదని టెక్కలి తెలుగు తమ్ముళ్లు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఇక ఇదే విషయంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు అచ్చెన్న. కాగా ఈ సమీక్షకు హాజరైన అధికారులకు వైసీపీ ఇంఛార్జ్ దువ్వాడ క్లాస్ తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అచ్చెన్న అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించి జిల్లా రాజకీయాల్లో మరింత అగ్గి రాజేశారు. అంతటితో ఆగలేదాయన. టెక్కలిలో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని అసెంబ్లీ ప్రోటోకాల్ కార్యదర్శికి లేఖ కూడా రాశారు.

టెక్కలిలో నిర్వహించిన రైతు భరోసా, సచివాలయాలు శంకుస్థాపన కార్యక్రమాలకు తనను ఆహ్వానించలేదని సదరు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలంటూ అసెంబ్లీ డిప్యూటీ కార్యదర్శి, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ఆయన టెక్కలి నాలుగు మండలాల ఎంపిడిఓలను ఆదేశించారు. వివరణ ఇస్తే ఎలాంటి తంటా వస్తుందో, ఇవ్వకపోతే ఏమవుతుందో అని ఆ అధికారులు తలలు పట్టుకున్నారట. అధికారులకే కాదు స్థానిక వైసీపీ నేతలకు కూడా అచ్చెన్న మేకై కూర్చున్నారు. అచ్చెన్న స్పీడుకు ఎలాగైనా బ్రేకులు వేయాల్సిందేనని, లేదంటే అచ్చెన్న వలన పార్టీకి నష్టం వాటిల్లుతుందని అధిష్టానం నుండి హెచ్చరికలు వస్తున్నాయట. అచ్చెన్న మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, వైసీపీ నేతలు ఒక్క అడుగు ముందుకు వేస్తె ఈయన రెండు అడుగులు ముందుకు వేస్తూ దూసుకెళ్లడంతో… ఆయనను కంట్రోల్ చేయడం టెక్కలి వైసీపీ నేతలకు తలనొప్పిగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Next Story

Most Viewed