అన్నం పెట్టి మరీ మాట్లాడితే కెలికి కయ్యమా?

by  |
అన్నం పెట్టి మరీ మాట్లాడితే కెలికి కయ్యమా?
X

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపై, కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరాధారమైన ఆరోపణలతో ఏపీ ప్రభుత్వం, తప్పుడు విధానాలతో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. త్వరలోనే వాస్తవాలను బహిర్గతం చేసి రెండు ప్రభుత్వాలకూ తగిన బుద్ధి చెప్తామని స్పష్టం చేశారు. తెలంగాణ తనకు లభించిన హక్కులు, వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తోందని, విమర్శలు చేస్తున్నవారి నోరు మూయిస్తామని స్పష్టం చేశారు. ప్రగతిభవన్‌లో సాగునీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమైన కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో వ్యవహరించే తీరుపై చర్చించారు.

అన్నం పెట్టి మరీ మాట్లాడితే కెలికి కయ్యం పెట్టుకుంటుందా ?

“నా అంతట నేనే ఆంధప్రదేశ్ ప్రభుత్వ పెద్దలను పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడాను. రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకుందామని స్నేహహస్తం అందించాం. బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని స్పష్టమైన వైఖరిని వెల్లడించాం. సహజ సరిహద్దు రాష్ట్రాలు కాబట్టి స్నేహ పూర్వకంగా మెదిలి, అంతిమంగా రైతులకు సాగునీరు అందించే లక్ష్యం సాధించాలని ప్రతిపాదించాం. వృథాగా సముద్రం పాలవుతున్న నీటిని రైతుల పొలాలకు మళ్లించే కార్యాచరణ అమలు చేద్దామని చెప్పాం. అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటున్నది. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అర్థంలేని వాదనలతో, నిరాధారమైన ఆరోపణలతో ఫిర్యాదు చేస్తున్నది. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం నోరు మూయించేలా, వారి అర్థరహిత వాదనలను తిప్పికొట్టేలా సమాధానం చెపుతాం. తెలంగాణ ప్రాజెక్టుల గురించి మరోసారి నోరెత్తి మాట్లాడలేని పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కల్పిస్తాం” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

సంపూర్ణ సమాచారాన్ని బహిర్గతం చేస్తాం

తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్థంపర్థం లేని, నిరాధారమైన, అనవసర రాద్ధాంతం చేస్తున్నదని, కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుడు విధానం అవలంభిస్తున్నదని సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో పూర్తి వాస్తవాలు, సంపూర్ణ సమాచారం ముందు పెట్టి సమర్థవంతంగా వాదనలను వినిపించనున్నట్లు తెలిపారు. ఇటు ఆంధప్రదేశ్ ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి గట్టి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదులు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎపీ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

కేంద్రం తప్పుడు విధానాలు

తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా తప్పిదమేనని, తెలంగాణ రాష్ట్రానికున్న నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని కేసీఆర్ ఈ సమావేశంలో స్పష్టం చేశారు. నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికే నీటి కేటాయింపులు జరిగి, అనుమతులు పొంది, ఖర్చు కూడా జరిగిన ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఏమాత్రం సరికాదన్నారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసే విషయంలో కూడా కేంద్రం అనవసరంగా అభ్యంతర పెడుతున్నదని, వాస్తవానికి నాగార్జునసాగర్ ప్రాజెక్టు నింపిన తర్వాతనే మిగిలిన ప్రాజెక్టులు నింపాలని స్పష్టం చేశారు. అసలు శ్రీశైలం నీటిపారుదల ప్రాజెక్టే కాదని, అది కేవలం జలవిద్యుత్ ప్రాజెక్టు మాత్రమేనని నొక్కిచెప్పారు. ఈ వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేయడం సమంజసం కాదన్నారు. ఒక రాష్ట్రంగా తెలంగాణకు కూడా హక్కులుంటాయని, తనకున్న హక్కు ప్రకారమే ప్రాజెక్టులను నిర్మిస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం వ్యవహరించడం తగదని హితవు పలికారు. అన్ని వాస్తవాలను వెల్లడించి కేంద్ర వైఖరిని యావత్ దేశానికి తెలిసేలా చేస్తామన్నారు.

అవన్నీ పాత ప్రాజెక్టులే

గోదావరి, కృష్ణా బేసిన్లలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న హక్కుల ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, తెలంగాణ ఏర్పడే నాటికే ఇప్పుడు నిర్మిస్తున్న ప్రాజెక్టులు మంజూరయ్యాయని కేసీఆర్ అన్నారు. వాటికి నీటి కేటాయింపులు కూడా జరిగాయని, కేంద్ర జలసంఘం సహా ఇతర సంస్థల నుంచి అవసరమైన అనుమతులు కూడా వచ్చాయన్నారు. దాదాపు రూ. 23వేల కోట్ల మేర నిధుల ఖర్చు జరిగిందని, 31,500 ఎకరాల భూ సేకరణ కూడా పూర్తయిందని, ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు వీటిని కొత్త ప్రాజెక్టులు అనడం అర్థరహితం మాత్రమే కాక అవివేకమన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంజూరైనప్పటికీ వాటిని పూర్తి చేయలేదని, పైగా తక్కువ నీటితో ఎక్కువ ఆయకట్టును ప్రతిపాదించడం వల్ల సాగునీటి అవసరాలు సంపూర్ణంగా తీరలేదన్నారు. చాలా ప్రాజెక్టుల డిజైన్‌లు తెలంగాణ అవసరాలకు తగినట్లుగా లేవని, కాబట్టే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికున్న హక్కులు, అవసరాలు, నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులకు రీడిజైన్ చేసి నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టులను తప్పుపట్టడంలో అర్థం లేదన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీటి కేటాయింపులు జరిపి, ప్రతిపాదించిన ప్రాజెక్టులు కట్టడంలేదనే అసంతృప్తితోనే, నీటిపారుదల రంగంలో జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగానే తెలంగాణ ఉద్యమం వచ్చిందని గుర్తుచేశారు.

రీడిజైన్‌తో పాటు పేర్ల మార్పు

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగానూ, కంతనపల్లి ప్రాజెక్టును రీడిజైన్ చేసి సమ్మక్క సాగర్‌గానూ, రాజీవ్‌సాగర్ -ఇందిరాసాగర్ ప్రాజెక్టులను రీడిజైన్ చేసి సీతారామ ప్రాజెక్టుగానూ, దుమ్ముగూడెం ప్రాజెక్టును రీడిజైన్ చేసి సీతమ్మసాగర్‌గానూ నిర్మిస్తున్నట్లు కేసీఆర్ ఈ సమావేశంలో వెల్లడించారు. పెన్‌గంగ ప్రాజెక్టుకు 1975లోనే ఒప్పందం కుదిరి, ట్రిబ్యునల్ అవార్డు కూడా పూర్తయిందన్నారు. ఈ ప్రాజెక్టులు ఎప్పుడు మంజూరయ్యాయి? ఏయే అనుమతులు సాధించారు? తెలంగాణ వచ్చేనాటికే ఎంత ఖర్చు జరిగింది? ఎంత భూమి సేకరణ పూర్తయ్యింది? విడుదల చేసిన జీవోలేంటి? తదితర వాస్తవాలను అపెక్స్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా బహిరంగపరిచి ఫిర్యాదులు చేసినవారికి, సందేహాలు వెలిబుచ్చినవారికి తిరుగులేని సమాధానం చెప్పాలని సాగునీటిపారుదల శాఖ అధికారులను కేసీఆర్ ఆదేశించారు.

అపెక్స్ కౌన్సిల్‌లో అన్నీ తేలుస్తాం

గతంలో జరిగిన మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అభ్యంతరం వ్యక్తం చేసిందని, తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రలో చేపట్టిన ముచ్చుమర్రిని ప్రస్తావించిందని కేసీఆర్ గుర్తుచేశారు. దీంతో ఈ రెండింటిని కొనసాగించాలనే నిర్ణయం ఆ సమావేశంలోనే జరిగిందని, మళ్లీ ఇప్పుడు ఆ అంశాన్ని లేవనెత్తడం సరికాదన్నారు. పాలమూరు–రంగారెడ్డి విషయంలో కూడా వాస్తవాలను మరోసారి వివరిస్తామని సిఎం వెల్లడించారు. మంచినీటి అవసరాల కోసం వాడే నీటిలో 20శాతాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ట్రిబ్యునల్ చెప్పిందని, ఆ ప్రకారమే తెలంగాణ రాష్ట్రం మంచినీటి కోసం వాడే 110 టిఎంసిలలో 22 టిఎంసిలను మాత్రమే లెక్కకు తీసుకోవాలి అని సిఎం తెలిపారు.

సాగునీటిరంగంలో తెలంగాణకు తీరని అన్యాయం

సాగునీటి రంగంలో తెలంగాణకు మొదటి నుంచీ అన్యాయం జరిగిందని, ఏలేశ్వరం దగ్గర కట్టాల్సిన నాగార్జునసాగర్ ప్రాజెక్టును 17 కిలోమీటర్ల దిగువన కట్టడం వల్ల అన్యాయం జరిగిందన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కారణంగా ఎగువ కృష్ణ, తుంగభద్ర, బీమా ప్రాజెక్టులు పోయాయన్నారు. నీటి వాటాల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదంటూ సాక్షాత్తూ బచావత్ ట్రిబ్యునలే పేర్కొన్నదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తన నీటి వాటాను అడిగే సందర్భంలో తెలంగాణను పరిగణలోకి తీసుకోలేదని స్వయంగా ట్రిబ్యునల్ గ్రహించి తెలంగాణకు ప్రత్యేకంగా నీటిని కేటాయించిందని గుర్తుచేశారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన జూరాలతో పాటు నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయల్‌సాగర్ లాంటి ప్రాజెక్టులను తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తి చేసుకోగలిగామన్నారు. ఆర్డీఎస్ తూములను ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు బాంబులు పెట్టి పేల్చితే గ్రావిటీ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా తెలంగాణకు రావాల్సిన నీళ్లు రాలేదన్నారు. ఆర్డీఎస్ ఆయకట్టును స్థిరీకరించడానికి ఎంతో వ్యయంచేసి తుమ్మిళ్ల లిఫ్టు నిర్మించుకోవాల్సి వచ్చిందని, ఇలా చెప్పుకుంటూపోతే సాగునీటిరంగంలో తెలంగాణకు అంతులేని అన్యాయం జరిగిందన్నారు.

రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణకు దక్కిన నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని, వాస్తవానికి ఇంకా తెలంగాణకు నీటి అవసరం ఉందన్నారు. గోదావరి మిగులు జలాల్లో మరో వెయ్యి టిఎంసిలు దక్కాల్సి ఉందని, గోదావరికి తెలంగాణలోనే క్యాచ్‌మెంటు ఏరియా ఎక్కువగా ఉందని, నది ప్రవహించేది కూడా తెలంగాణలోనే ఎక్కువన్నారు. తెలంగాణకు నీటి అవసరాలు కూడా ఉన్నాయని, సముద్రంలో కలిసే రెండు వేల టిఎంసిలలో తెలంగాణకు కనీసం వెయ్యి టిఎంసిలు కేటాయించాలని కేంద్రానికి స్పష్టం చేశారు.



Next Story

Most Viewed