సంగమేశ్వరం ఎత్తిపోతల షురూ.. ఇక నడిగడ్డకు గడ్డుకాలమే?

by  |
Sangameshwaram Project works
X

దిశ, తెలంగాణ బ్యూరో: నడిగడ్డను ఎండబెట్టే కాల్వపనులు మొదలయ్యాయి. ఉద్యమనేతగా కేసీఆర్​పాదయాత్ర చేసిన ప్రాంతం నుంచే అక్రమంగా నీటి తరలింపునకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేవలం 40వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే పేరుతో ఐదులక్షల ఎకరాలకు నీటిని ఎత్తిపోసే పనులను షురూ చేసింది. తెలంగాణ వైపు నుంచి ఎవరూ రాకుండా పనులు జరిగే చోట ప్రైవేట్ సైన్యాన్ని మోహరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణాజలాల తరలించేందుకు వీలుగా సంగమేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా తేలిగ్గా తీసిపారేస్తోంది. సీఎం కేసీఆర్​కూడా ఇటీవల ఏపీ వైఖరిని తప్పుబట్టిన విషయం తెలిసిందే. అక్రమ ప్రాజెక్టులను ఆపకుంటే అలంపూర్​వద్దే అడ్డుకట్టవేస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అయినా పనులు ఆపడం లేదు. అంతేకాదు ఏపీ ఇరిగేషన్​అధికారులు కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డులకు సైతం తెగేసి చెప్పారు. ఎన్ని లేఖలు రాసినా.. ఎంత ఫిర్యాదు చేసినా ప్రాజెక్టు పనులు ఆపబోమని స్పష్టంచేశారు. ఇటీవల కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో ఏపీఈఎన్సీ ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టింది.

ట్రిబ్యునల్​కేటాయింపులు చూపి

కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్ట (రాజోలిబండ డైవర్షన్ స్కీం) కుడి వైపున ఏపీ సర్కారు రూ.1,985.423 కోట్లతో కాల్వపనులు ప్రారంభించింది. దీంతో పాటు నాలుగు లిఫ్టులను ప్రతిపాదించిన ఏపీ ప్రభుత్వం నిర్మాణ పనులకు దిగింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు కొత్త ప్రాజెక్టుకు కేటాయింపులు ఉన్నాయని, నాలుగు టీఎంసీల నీటిని 160 కి.మీ గ్రావిటీకాల్వ ద్వారా 40వేల ఎకరాల ఆయకట్టుకు తరలించే అవకాశం ఉందని వాదిస్తోంది. కానీ ట్రిబ్యునల్​ఆదేశాలు ఇంకా అమల్లోకి రాలేదన్న విషయాన్ని గుర్తించడం లేదు. కానీ వాస్తవంగా ఏపీ ఈ కుడికాల్వ నుంచి దాదాపు ఐదులక్షల ఎకరాలకు సాగునీరు అందించే లిఫ్టు నిర్మాణ పనులకు ఏర్పాటు చేస్తోంది. కుడికాల్వపై కోస్గి వద్ద 0.5 టీఎంసీలు, పెద్దకందూరు వద్ద 0.5 టీఎంసీలు, కోటేకల్ వద్ద 1.5టీఎంసీలు, చిన్నమర్రివీడు వద్ద 0.25 టీఎంసీల నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేసింది. సీడబ్ల్యూసీ, అపెక్స్​కౌన్సిల్, కర్ణాటక, తెలంగాణ, కృష్ణావాటర్​మేనేజ్​మెంట్​బోర్డుతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి చిన్న అనుమతి లేఖ కూడా లేకుండా కాల్వ నిర్మాణం చేపడుతున్నది. వాస్తవంగా తుంగభద్రపై ఆర్టీఎస్​కుడికాల్వ తవ్వకానికి నదిలో నీటిలభ్యత ఆధారంగా మిగులు జలాల నుంచి నాలుగు టీఎంసీలను తీసుకోవాల్సి ఉంది. కానీ తుంగభద్రలో మిగులు జలాలు ఇప్పటివరకు ఉండడం లేదు. ట్రిబ్యునల్​కేటాయింపులు అనుకుంటే.. తుంగభద్రలో మిగులు జలాలు లేకుంటే ఆల్మట్టి నుంచి నారాయణపూర్​జలాశయానికి వరద జలాలను తరలించి, అక్కడి నుంచి నాలుగు టీఎంసీలను ప్రత్యేక కాల్వ ద్వారా ఆర్టీఎస్​కు తీసుకెళ్లాల్సి ఉందని పేర్కొన్నారు.

ఆర్డీఎస్​కుడికాల్వతో ప్రమాదమే..

జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్​సెగ్మెంట్​తో పాటు దాదాపు 150 గ్రామాలకు ఆర్డీఎస్​నీళ్లే దిక్కు. 87,500 ఎకరాలకు సాగునీరు పారాల్సి ఉండగా, ప్రస్తుతం 25వేల ఎకరాలకు మించి అందడం లేదు. తుమ్మిళ్ల, గార్లపాడు, మద్దూర్, బుడమోర్సు ఎత్తిపోతల పథకాలతో పాటు సుంకేసులపై కూడా ఈ ఆర్డీఎస్​కుడికాల్వతో ప్రమాదం పొంచి ఉంటుంది. తెలంగాణలోని 150 గ్రామాలకు తాగునీటికి కూడా ఇబ్బందులు రానున్నాయని గతంలోనే నివేదికల్లో స్పష్టం చేశారు. అంతేకాకుండా రాజోలి మిషన్ భగీరథ కూడా ఎండిపోతోంది. ఈ నదీ పరివాహక ఆయకట్టు నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టు మొత్తం బీడువారే అవకాశం ఉంది. వాస్తవంగా ఆర్డీఎస్​నుంచి తెలంగాణకు 15.90 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి. కానీ కనీసం ఐదున్నర టీఎంసీలకు మించి వాడుకోవడం లేదు. ఆర్డీఎస్ ఆనకట్టను ఆరు ఇంచులు పెంచే పనులకే ఏపీ ప్రభుత్వం మెలికపెట్టింది. ఈ పనుల కోసం తెలంగాణ ప్రయత్నాలు చేస్తే ఫ్యాక్షన్​రాజకీయాలు చూపించింది. సిమెంట్​ను నీళ్లలో వేశారు. ఇనుమును ఎత్తుకెళ్లారు. ఇంతటితో ఆగకుండా ఆర్డీఎస్ నుంచి నీటిని తరలించుకుపోయే పనులను గత మూడు రోజుల క్రితం నుంచే మొదలుపెట్టింది. సామగ్రిని కూడా తీసుకొచ్చింది. అక్కడికి వెళ్లకుండా తెలంగాణ ప్రాంతంవాసులను నిలువరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సరైన చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత రైతులు, స్థానికులు కోరుతున్నారు.

Next Story

Most Viewed