చల్మెడ కాలేజీలో కొనసాగుతున్న టెస్టులు.. మరో ముగ్గురికి పాజిటివ్

by  |
చల్మెడ కాలేజీలో కొనసాగుతున్న టెస్టులు.. మరో ముగ్గురికి పాజిటివ్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : జిల్లాలో కలకలం రేపిన కరోనా పాజిటివ్ కేసులపై వైద్యులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. శనివారం వెలుగులోకి వచ్చిన తర్వాత కొంతమందికి పాజిటివ్ గా నిర్దారణ కాగా ఆదివారం చేపట్టిన పరీక్షల్లో మరి కొంతమందికి కొవిడ్ సోకినట్టుగా గుర్తించారు. మెడికల్ కాలేజ్‌లో సుమారు 200 మందికి పైగా టెస్టులు నిర్వహించారు. ఇందులో ఇప్పటివరకూ 46 మందికి పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. ఆదివారం చల్మెడ మెడికల్ కాలేజీలో మెడికోలకు కొవిడ్ సోకినట్టు విషయం బాహ్య ప్రపంచానికి తెలియడంతో జిల్లావాసులు ఆందోళన చెందారు. జిల్లా వైద్యాధికారులు హుటాహుటిన కెయిమ్స్‌కు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. మూడో రోజు కూడా టెస్టులు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది.

అంతా సీక్రసీ..

చల్మెడ మెడికల్ కాలేజీలో కొవిడ్ బాధితుల విషయంలో అంతా సీక్రసీ మెయింటెన్ చేస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందే అవకాశం ఉన్నందున జిల్లా అధికార యంత్రాంగం గోప్యంగా ఉంచాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే, ఈ కరోనా బాధితులు మరింత ఎక్కువ మందే ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఫ్యాకల్టీతో పాటు పీజీ చేస్తున్న మెడికోలకు వ్యాధి సోకినట్టుగా తెలుస్తోంది. ఈ కారణంగానే మెడికల్ కాలేజ్ యాజమాన్యం సెలవులు ప్రకటించినట్టు తెలుస్తోంది.

హోం క్వారంటైన్..

అయితే కొవిడ్ బాధితులు వెలుగులోకి రాగానే యాజమాన్యం అందరినీ హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించింది. ఈ మేరకు ఫ్యాకల్టీ, మెడికోల అడ్రస్‌లను మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌కు అనుసంధానం చేశారు. ఆయా ప్రాంతాల్లోని వైద్య ఆరోగ్య శాఖ, పారా మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. హోం క్వారంటైన్‌లో ఉన్న వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతలు వీరికి అప్పగించారు.

ప్రబలిందా.?

నవంబర్ 27న జరిగిన మెడికల్ కాలేజ్ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన సెలబ్రేషన్స్ వల్లే కొవిడ్ ప్రబలిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం వారం రోజులకు వెలుగులోకి వచ్చింది. అప్పటికే మెడికోలు, ఫ్యాకల్టీ వారికి సోకి ఉన్నట్టయితే వ్యాధి ఇప్పటికే ఇతరులకు ప్రబలిందా అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. నిత్యం చల్మెడ కాలేజీలో ఇన్, ఔట్ పేషంట్లు, వారితో పాటు వచ్చే అటెండెంట్లు రోజుకు సగటున 700 నుండి 1000 మంది వరకూ ఉంటారని ఓ అంచనా. అయితే కొవిడ్ పాజిటివ్ వచ్చిన పీజీ చేస్తున్న మెడికోలు కూడా చికిత్స అందించే అవకాశాలు లేకపోలేదు. ఈ క్రమంలో వారి నుండి పేషంట్లకు కూడా కరోనా సోకే ప్రమాదం ఉందన్న కలవరం మొదలైంది.



Next Story

Most Viewed