రూ.5ల అన్నపూర్ణ క్యాంటిన్లు క్లోజ్..

by  |
రూ.5ల అన్నపూర్ణ క్యాంటిన్లు క్లోజ్..
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: కరోనా లాక్ డౌన్ మొదలు కావడంతో హాస్పిటల్స్ వద్ద ఉండే రోగుల సహాయకులకు ఆహారం లేక తీవ్ర ఇబ్బందుల పడుతున్నారు. ముఖ్యంగా కొవిడ్ ప్రత్యేక హాస్పిటల్స్ గా గుర్తింపు పొందిన గాంధీ, కింగ్ కోఠి ఆసుపత్రుల వద్ద ఉన్న రూ. 5 బోజనం క్యాంటిన్లు కరోనా లాక్ డౌన్ కారణంగా మూతపడ్డాయి. దీంతో ఆసుపత్రి బయట ఉన్న రోగుల సహాయకులకు భోజనం లేకుండా పోయింది. కనీసం మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. కొవిడ్ కారణంగా బుధవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే గాంధీ, కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రులలో కరోనాతో చేరి వైద్య సేవలు పొందుతున్న వారి సహాయకులు హాస్పిటల్ బయట రోజులుగా ఎదురు చూస్తున్నారు. కాగా లాక్ డౌన్ కారణంగా హోటళ్లు, క్యాంటిన్లు, టిఫిన్ సెంటర్లు ఉదయం 10 గంటల తర్వాత మూసి వేయడంతో వారికి రోజంతా భోజనం లేకుండా పోయింది.

దాతలు ముందుకు వచ్చినా …?

కొవిడ్ ఆసుపత్రి వద్ద కొంత మంది దాతలు ముందుకు వచ్చి ఆహారం పొట్లాలు అక్కడున్న వారికి అందించారు. అయితే అవి రోగుల సహాయకులందరికీ అందకపోవడంతో భోజనం కోసం అల్లాడుతున్నారు. రెండు రోజుల క్రితం వరకు తెరచి ఉంచిన రూ. 5 భోజన క్యాంటిన్లు మూసి వేశారు. అయితే నగరంలోని కొన్ని చోట్ల రూ. 5 రూపాయల భోజనం క్యాంటిన్లలో ఆహారం అందుబాటులో ఉంచారు. సాధారణంగా ప్రతి రోజు ఉదయం 11 గంటల నుండి వీటిల్లో ఆహారం అందించడం మొదలు పెడతారు. బుధవారం కూడా హాస్పిటల్స్ వద్ద ఉన్న రోగుల సహాయకులు ఆహారం సరఫరా అవుతుందని ఎదురు చూశారు. అయితే సరఫరా కాకపోవడంతో కొంత మంది పస్తులు ఉండాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా మెహిదీపట్నం వద్ద ఉన్న ఓ అన్నపూర్ణ క్యాంటిన్ వద్ద ఉదయం 9 గంటలకే భోజనం సరఫరా చేశారు. అయితే వడ్డించే వారు మాత్రం లేకపోవడంతో రెండు గంటల వరకు కూడా అన్నం, ఇతర కూరగాయల గిన్నెలు రోడ్డు మీదనే ఉండడం గమనార్హం. ఇలా అవసరం లేని చోట్ల ఆహారం సరఫరా చేసి అవసరం ఉన్న చోట్ల చేయకపోవడం పట్ల నిరసనలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పటికైనా కొవిడ్ హాస్పిటల్స్ వద్ద ఉన్న వారికి అందుబాటులో ఉండేలా రూ. 5 అన్నపూర్ణ భోజన క్యాంటిన్లు తెరచి ఉంచాలని పలువురు రోగుల సహాయకులు కోరుతున్నారు.


Next Story