Cm Jagan సొంత జిల్లాలో అంత జరుగుతుందా...? మరి వాళ్లంతా ఏమయ్యారు..?

by Disha Web Desk 16 |
Cm Jagan సొంత జిల్లాలో అంత జరుగుతుందా...?  మరి వాళ్లంతా ఏమయ్యారు..?
X
  • భూదందాల జోలికెళ్ళని రెవెన్యూ
  • బద్వేలు లో మల్లీ మొదలైన కబ్జాలు పర్వం.
  • రూ, కోట్ల రూపాయల భూములు ఆక్రమణల పాలు

దిశ,కడప: అక్కడ సర్కారు భూములు కనిపిస్తే చాలు వారి కన్ను పడుతుంది. అది చెరువైనా, కుంటైనా, గుట్టైనా, కొండైనా సరే కబ్జా కావాల్సిందే. కోట్ల రూపాయల స్థలాలు నిత్యకృత్యంగా కబ్జాకు గురవుతున్నా రెవెన్యూ అధికారుల తీరు మాత్రం పట్టించుకోవడంలేదు. కొన్ని నెలల క్రితం కబ్జాదారుల గుండెల్లో వణుకు పుట్టించిన రెవెన్యూ అధికారులు ఇప్పుడు గుమ్మనంగా ఉండడం విమర్శలకు దారి తీస్తోంది. ఇటీవల వైయస్సార్ జిల్లా బద్వేలు, గోపవరం మండలాల పరిధిలో యధేచ్చగా జరుగుతున్న కబ్జాలపర్వమే ఇందుకు బలం చేకూరుస్తుంది.

అడ్డెవరు?.. ఆపేదెవరు?

భూకబ్జాల పేరు చెప్తేనే మొదటిగా గుర్తొచ్చే పట్టణంగా బద్వేలుకు పేరుంది. రెవెన్యూ డివిజన్ ఏర్పడ్డాక ఇక్కడి స్థలాలకు మరింత విలువ పెరిగింది. దీంతో కబ్జాదారులు భూ దందా సాగించేందుకు సిద్ధపడ్డారు. ఇలాంటి తరుణంలో కొన్ని నెలల క్రితం బద్వేలు రెవెన్యూ అధికారులు ఇలాంటి వారిపై కొరడా ఝళిపించారు. ఏళ్ల తరబడి సాగుతున్న కబ్జా పర్వానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసి శెబాష్ అనిపించుకున్నారు. దీంతో బద్వేలులో భూకబ్జాలకు పుల్ స్టాప్ పడుతుందనుకున్నారు. అయితే కొన్నాళ్లు గడిచింది తిరిగి యధావిధిగా కబ్జాలు ఆక్రమణలు మొదలయ్యాయి. దీంతో ప్రభుత్వ స్థలాలకు గండం ఏర్పడింది

ఆక్రమణలివి?

బద్వేలు, గోపవరం మండలాల్లో మళ్లీ మొదలెట్టిన ఆక్రమదారులు పలు ప్రభుత్వ స్థలాలను వారి గుప్పిట్లోకి తీసుకుంటున్నారు. ఏదో ఒక సాకుతో ‌భూ ఆక్రమణలకు దిగుతున్నారు. దీంతో కోట్ల రూపాయలు విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. గోపవరం మండలంలోని సర్వే నెంబర్ 954లో భూములు క్రమణలకు గురవుతున్నాయి. వీటితోపాటు 957 సర్వే నెంబర్ సిద్ధమ్మ పేరంటాల ప్రాంతంలో కొందరు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఇవే కాకుండా బద్వేలు మండలం చెన్నంపల్లి పంచాయతీ తామర మడుగు చెరువు కబ్జాకు గురవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పొలాలు ఉన్నా చెరువు కబ్జాకు గురవుతుండడంతో ఆయకట్టుదారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు నాగల చెరువు ప్రాంతంలో కూడా భూములు చాలా విలువ పలుకుతున్నాయి. దీంతో ఈ భూములపై ఆక్రమణదారుల కన్ను పడే పరిస్థితి ఉంది. దీంతో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులపై దృష్టిసారించాలని స్థానికులు కోరుతున్నారు.

కబ్జాలపై మళ్లీ దృష్టి పెడతారా?

అయితే బద్వేలు రెవెన్యూ అధికారులు గతంలో ఈ ప్రాంతంలో భూ అక్రమపై ఝళిపించి నట్లుగా మళ్లీ గెలిపిస్తారా ! లేక ఇలాగే గుమ్మనంగా ఉంటారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో భూకబ్జాలు, నకిలీ పత్రాలపై విచారణ జరిపి 24 మందిపై కేసులు నమోదు చేశారు. వీళ్ళలో కొందరిని మాత్రమే అరెస్ట్ చేయగా మరికొందరు బెయిలు తెచ్చుకొన్నారు. ఆక్రమణలపై అప్పట్లో అధికారులు గురిపెట్టినట్లు ఇప్పుడు కూడా దృష్టి పెడతే కబ్జాలకు కల్లెం పడుతుంది. లేదంటే మరోసారి ఆక్రమణల పర్వానికి అడ్డూ, అదుపూ లేకుండా పోతోందని స్థానికులు మాట్లాడుకుంటున్నారు. మరి బద్వేల్ భూకబ్జాలపై రెవెన్యూ,ఇరిగేషన్ అధికారులు ఏమేరకు చర్యలు చేపడతారో చూడాలి.



Next Story

Most Viewed