Kadapa: హత్య కేసులో ప్రొద్దుటూరు కోర్టు సంచలన తీర్పు

by Disha Web Desk 16 |
Kadapa: హత్య కేసులో ప్రొద్దుటూరు కోర్టు సంచలన తీర్పు
X

దిశ,కడప: మైదుకూరులో తొమ్మిదేళ్ల క్రితం జరిగిన హత్యకేసులో ముగ్గురు ముద్దాయిలకు ప్రొద్దుటూరు సెకండ్ ఏడీజే కోర్టు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. మైదుకూరు విజయనగరం వీధిలో నివాసమున్న పూజారి సత్యప్ప అలియాస్ సత్యం.. పెద్ద వెంకటేశ్వర్లు ఇంటికి ఎదురుగా ఖాళీ స్థలంలో హోటల్, కూల్ డ్రింక్స్ బంకు నడిపేవారు. అయితే తన అంగడికి వచ్చే కస్టమర్స్‌తో హోటల్‌లో టిఫిన్ బాగాలేదని చెప్పుతున్నాడని, స్థల యజమానికి చెప్పి ఖాళీ చేయిస్తానని అంటూ బెదిరిస్తున్నాడని పెద్ద వెంకటేశ్వర్లుపై సత్యప్ప కక్ష పెంచుకున్నాడు. తన మేనల్లుడు కడపల రమేష్, స్నేహితుడు కంఫా రామయ్య సహాయంతో పెద్ద వెంకటేశ్వర్లు గొంతుకు తాడు బిగించి చంపి, రోడ్డు ప్రమాదంగా నమ్మించాలని మృతదేహాన్ని రోడ్ పక్కగా వేశారు.

ఈ కేసు అప్పటి ఇన్స్పెక్టర్ బి.వి. శివారెడ్డి దర్యాప్తు చేశారు. సాక్ష్యాధారాలతో ముద్దాయికి శిక్ష పడేలా కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.రాంప్రసాద్ రెడ్డి వాదించారు. ముగ్గురు ముద్దాయిలకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ. లక్ష జరిమానా విధిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో ముగ్గురు ముద్దాయిలను పోలీసులు జైలుకు తరలించారు.


Next Story