ఇరకాటంలో టీడీపీ కూటమి.. ఎదురు దాడికి కాసుక్కూర్చున్న వైసీపీ!

by Disha Web Desk 2 |
ఇరకాటంలో టీడీపీ కూటమి.. ఎదురు దాడికి కాసుక్కూర్చున్న వైసీపీ!
X

మహా శివరాత్రి పండగ పూట వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. 2014–19లో ఈ పార్టీలన్నీ కలిసి అధికారంలో ఉన్నాయి. రాష్ట్ర విభజన హామీలు సాధించాయా అంటూ ప్రశ్నించారు. సీఎం కుర్చీలో ముగ్గురూ కాళ్లు పెట్టి చతికిలపడడం ఖాయమన్నారు. ఆయన ట్వీట్​ను బట్టి ఎన్నికల ప్రచారంలో టీడీపీ, జనసేన, బీజేపీ మీద ఎదురు దాడికి సిద్దమవుతున్నట్లు గోచరిస్తోంది. ఐదేళ్లలో సీఎం జగన్​సాధించలేని విభజన హామీల వైఫల్యాన్ని చంద్రబాబుపైకి నెట్టే వ్యూహానికి పదును పెడుతున్నట్లుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైసీపీ దాడితో టీడీపీ కూటమి ఇరకాటంలో పడొచ్చని చెబుతున్నారు.

దిశ, ఏపీ బ్యూరో: పదేళ్ల కిందట జనసేన మద్దతుతో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. నాడు ఎన్డీయే సర్కారులో భాగస్వామిగా ఉన్న టీడీపీ రాష్ట్ర విభజన హామీలను సాధించడంలో విఫలమైంది. కేంద్రంలోని బీజేపీ సర్కారును గట్టిగా నిలదీయలేకపోయింది. ప్రత్యేక ప్యాకేజీకి టీడీపీ అంగీకరించింది. ప్యాకేజీని పాచిపోయిన లడ్డుగా జనసేనాని అభివర్ణించారు. 2019 ఎన్నికలకు ముందు బీజేపీకి టీడీపీ కటీఫ్​ చెప్పేసింది. విభజన హామీలు నెరవేరుస్తామని దగా చేసినందునే బీజేపీకి దూరంగా జరిగినట్లు అనేక దఫాలు చంద్రబాబు పేర్కొన్నారు.

వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకేనా..

నాడు హామీలేవీ సాధించకున్నా ఇప్పుడు మళ్లీ మూడు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకొని జనాన్ని మరోసారి మోసం చేస్తారా అన్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్​సంకేతాలిస్తోంది. దీన్నిబట్టి విభజన హామీలకు సంబంధించి ఐదేళ్లలో వైసీపీ సర్కారు వైఫల్యాన్ని ఇప్పుడు మూడు పార్టీల కూటమిపైకి తోసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని మూడు పార్టీల కలగూర గంపకన్నా స్థిరమైన వైసీపీ ప్రభుత్వానికి మళ్లీ అవకాశమివ్వాలని కోరుతున్నారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతానన్న సీఎం జగన్ ఆచరణలో విఫలమయ్యారు. ఆయన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు గతంలో హామీలు నెరవేర్చని కూటమిపై ఎదురు దాడి చేసేందుకు సమాయత్తమవుతున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

వైసీపీ పెద్దలు జవాబు చెబుతారా?

ఎన్నికల ప్రచారంలో ఇదే వ్యూహాన్ని వైసీపీ అనుసరిస్తే ప్రజలు ఏ మేరకు ఆమోదిస్తారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. వాస్తవానికి నాడు కేంద్రంలో భాగస్వామిగా ఉండి టీడీపీ రాష్ట్ర ప్రయోజనాలు సాధించడంలో విఫలమైంది. తర్వాత కాషాయ పార్టీకి దూరంగా జరిగింది. ఇప్పుడు ఎందుకోసం పొత్తు పెట్టుకుంటున్నారో ప్రజలకు చెప్పగలరా ! ఐదేళ్ల కాలంలో కేంద్ర సర్కారుకు అన్ని విధాలా సహకరించిన వైసీపీ విభజన హామీలు ఎందుకు సాధించలేకపోయిందో ఆ పార్టీ నేతలు జనానికి వివరించగలరా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీటిపై ఆయా పార్టీలు ఏం సమాధానం చెబుతాయనేది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.



Next Story

Most Viewed