AP Governor: ఆర్థిక సూపర్ పవర్‌గా భారత్

by Disha Web Desk 16 |
AP Governor: ఆర్థిక సూపర్ పవర్‌గా భారత్
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారతదేశం ప్రపంచానికి ఆహార భాండాగారమని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్ అభివర్ణించారు. ఆర్థిక సూపర్ పవర్‌గా భారతదేశం ఎదుగుతోందని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న జనాభాకు అనుగుణంగా వారి మనుగడను కొనసాగించడానికి వ్యవసాయం, హార్టికల్చర్ పంటలు ఎన్నో సవాళ్లు విసురుతున్నాయని చెప్పారు. భవిష్యత్‌లో పోషకాహార భద్రత మరింత ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకోనుందని గవర్నర్ అన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వెంకట రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం 5వ స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్, విశ్వవిద్యాలయ కులపతి జస్టిస్ అబ్ధుల్ నజీర్ అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్ మాట్లాడుతూ ఉద్యానవన ఉత్పత్తి ఇప్పటికే దేశంలోని వ్యవసాయోత్పత్తిని అధిగమించిందని, ఇది స్థూల జాతీయోత్పత్తిలో 6 శాతంగా ఉండడం శుభపరిణామమన్నారు. ఉద్యానవన రంగం 14 శాతం ఉపాధి అవకాశాలని సృష్టిస్తోందని..అందులో 42 శాతం మహిళలే కావడం గొప్ప విషయమని కొనియాడారు. ఆహారం, పోషకాహార భద్రత సవాళ్లు మన జాతీయ భద్రతలో అంతర్భాగంగా ఇమిడి ఉన్నాయని చెప్పారు.ఎన్నో తరాలుగా మన దేశం జాతీయ ఆహార భాండాగారాన్ని ఆచరణాత్మక మార్గంలో సమృద్ధిగా నిర్వహించిందని, ఇది మాన్‌సూన్‌ల మార్పులపై భారతీయ వ్యవసాయంపై ఆధారపడకుండా వాటికి అతీతంగా కావడం భారతదేశ ప్రత్యేకత అని గవర్నర్ వ్యాఖ్యానించారు. గత కొన్ని దశాబ్ధాలుగా ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతమైన ఉద్యానవన వృద్ధిని సాధించామని, ఉద్యానవనాన్ని రాష్ట్రంలో సూర్యోదయ రంగంగా గుర్తించినట్లు చెప్పారు. 17.84 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో 312.34 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో దేశంలోనే రెండో స్థానంలో ఉందని వెల్లడించారు.

ఉద్యానవన ఉత్పత్తిలో ఇన్‌పుట్ వినియోగ సామర్థ్యాన్ని పెంచడానికి రోబోటెక్ టెక్నాలజీలు, డ్రోన్ ల రూపకల్పన, ఉపయోగం వంటి సరిహద్దు సాంకేతికతలతో విశ్వవిద్యాలయం కూడా ముందుకు సాగడం హర్షనీయం అన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు, బంగారు పతకాలను అందించిన గవర్నర్ కాన్వొకేషన్‌లో డిగ్రీలు పొందిన విద్యార్థులందరినీ అభినందించారు. ఉద్యానవన రంగాన్ని కెరియర్‌గా ఎంచుకున్నందుకు వారిని ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న నీతి అయోగ్ సభ్యుడు, ప్రఖ్యాత వ్యవసాయ ఆర్థికవేత్త ప్రొఫెసర్ డా.రమేష్ చంద్ తొలుత స్నాతకోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ విద్యాలయం ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed