ఏపీ ప్రజలకు అలర్ట్..నేటి నుంచి దంచి కొట్టనున్న ఎండలు

by Disha Web Desk 18 |
ఏపీ ప్రజలకు అలర్ట్..నేటి నుంచి దంచి కొట్టనున్న ఎండలు
X

దిశ ప్రతినిధి,విజయవాడ:మార్చి ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి.మొదటి వారంలోనే వేడి విపరీతంగా పెరిగింది.తెలుగు రాష్ట్రాల్లో రోజువారీ ఉష్ణోగ్రతలు దాదాపు 5 డిగ్రీల వరకు పెరిగాయి. శివరాత్రి నాడు చలి తగ్గుతుందని చెబుతున్నప్పటికీ భూమిపై పెరుగుతున్న కాలుష్యం కారణంగా గ్లోబల్ వార్మింగ్ జరుగుతోంది. దీంతో ఎండాకాలం ప్రారంభం కాకముందే ఎండలు మొదలయ్యాయి.ఉదయం, సాయంత్రం వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ 10 గంటల లోపే ఎండలు మండిపోతున్నాయి.ఏప్రిల్, మే నెలలకు ముందే సూర్యభగవానుడు ప్రజల పై నిప్పులు కురిపిస్తున్నాడు.దీంతో మార్చి నెలలో ఇలా ఉంటే ఎండాకాలం మొత్తం ఎలా ఉంటుందోనని వాతావరణ శాఖ, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చి నెల వచ్చిందో లేదో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి.

ఆంధ్రప్రదేశ్ లో సగటు ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఎండల కారణంగా వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు ప్రకటిస్తోంది. తాజాగా వాతావరణ కేంద్రం మరోసారి కీలక హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయని స్పష్టం చేశారు.నేటి నుంచి రానున్న 5 రోజుల పాటు ఎండలు (ఉష్ణోగ్రత) గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణం వైపు నుంచి రాష్ట్రంలోకి తక్కువ స్థాయిలో గాలులు వీస్తున్నాయని తెలిపింది.

ఈ నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు.రాత్రిపూట కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రత పెరుగుతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మధ్యాహ్నం బయటకు వెళ్ళవద్దు. ఉదయం 12 గంటల లోపు తిరిగి వచ్చి 4 తర్వాత ఏదైనా పని చూసుకోండి.అంతేకాకుండా ఎండలో నడిచేవారు తప్పనిసరిగా నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది.

Next Story