కాల్పుల విరమణ చర్చల వేళ మరో ప్రతిజ్ఞ చేసిన ఇజ్రాయెల్ ప్రధాని

by Disha Web Desk 17 |
కాల్పుల విరమణ చర్చల వేళ మరో ప్రతిజ్ఞ చేసిన ఇజ్రాయెల్ ప్రధాని
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణకు సంబంధించిన చర్చలు జరపడానికి ప్రపంచ దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్న విషయం తెలిసిందే.మరికొద్ది రోజుల్లో ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చడానికి సమావేశం ఉంటుందని అనుకుంటున్న తరుణంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మంగళవారం కీలక ప్రకటన చేశారు. లక్షలాది మంది పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్న దక్షిణ గాజా నగరమైన రఫాలో చొరబాటును ప్రారంభించనున్నట్లు ప్రతిజ్ఞ చేశారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ సంధి చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి ఇజ్రాయెల్‌కు చేరుకోవడానికి కొన్ని గంటల ముందు నెతన్యాహు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

బ్లింకెన్ ఎలాగైనా ఈ యుద్ధాన్ని ఆపాలని పట్టుదలతో ఉన్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్-హమాస్ మధ్య అత్యంత తీవ్రమైన చర్చలలో ఒకటిగా ఇది నిలుస్తుంది. ఈ ఒప్పందంలో బందీలను విడిపించడం, రఫాలో ఇజ్రాయెల్ దాడిని ఆపడం, అక్కడి పౌరులకు ఎలాంటి హాని తల పెట్టకపోవడం వంటి ప్రతిపాదనలు ఉండనున్నాయి. అయితే ఇజ్రాయెల్ ప్రధాని మాట్లాడుతూ, బందీల కోసం సంధి ఒప్పందం కుదిరిందా లేదా అనే దానితో సంబంధం లేకుండా హమాస్ బెటాలియన్లను నాశనం చేయడానికి ఇజ్రాయెల్ రఫాలోకి ప్రవేశిస్తుందని చెప్పారు.

ఈ వ్యాఖ్యలపై కొంత మంది నెతన్యాహు తన క్యాబినెట్ సభ్యులను శాంతింపజేయడానికి ఈ మాటలు అన్నట్లుగా పేర్కొంటున్నారు. నెతన్యాహు తన క్యాబినెట్ నుండి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. సంధికి అంగీకరిస్తే ప్రభుత్వం నుంచి అతనికి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. రఫాపై దాడి చేయాలని సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆంటోనీ బ్లింకెన్ నేతృత్వంలో సంధి చర్చలు విజయవంతమైతే ఇరుపక్షాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గిపోనున్నాయి.

Next Story

Most Viewed