పరమతాల ఉచ్చులో పడొద్దు... ఆదివాసీలకు స్వాత్మానందేంద్రస్వామి హితవు

by Disha Web Desk 16 |
పరమతాల ఉచ్చులో పడొద్దు... ఆదివాసీలకు స్వాత్మానందేంద్రస్వామి హితవు
X

దిశ, అల్లూరి జిల్లా: మత ప్రబోధకులు చూపించే కపట ప్రేమను ఆదివాసీలంతా గమనించాలని, పరమతాల ఉచ్చులో పడొద్దని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి అన్నారు. అన్యమతాల ప్రలోభాలకు లొంగొద్దని, కన్నతల్లి లాంటి స్వధర్మాన్ని ఆచరించాలని సూచించారు. అల్లూరి సీతారామరాజు ఏజెన్సీలో ఆయన పర్యటించారు. తొలుత పాడేరులోని మోదకొండమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. అక్కడి నుండి హుకుంపేట మండలం తడిగిరి పంచాయతీ ఉక్కుర్భ గ్రామానికి ఆయన వెళ్ళారు. అక్కడ గిరిజనులు నిర్మించుకున్న భీమలింగేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు. ఆలయ నిర్వహణ పట్ల గిరిజనులు చూపుతున్న శ్రద్ధాసక్తులను చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఎంత ఖర్చయినా వెనుకాడకుండా ఆలయానికి కరెంటు సదుపాయం కల్పించాలని అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గుణకు సూచించారు.


ఈ సందర్భంగా స్వాత్మానందేంద్ర స్వామి ఆదివాసీలను ఉద్దేశించి మాట్లాడారు. గిరిజన ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకబడి ఉండొచ్చు గానీ, విజ్ఞతను చూపడంలోను, ఆదరాభిమానాలను చాటడంలోను గిరిజనులు ముందుంటారని ప్రశంసించారు. ఆదివాసీలు అదృష్టవంతులని, ఎక్కడో అయోధ్యలో ఉండే రామచంద్ర ప్రభువు గిరిజనులతో కలిసి జీవించడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. పది మందికి సాయపడాలని హిందూ ధర్మం బోధిస్తోందని అన్నారు. గిరిజనులంతా నిత్యం భగవన్నామ స్మరణతో గడపాలని, ఆలయాలను దర్శించాలని సూచించారు. విశాఖ శారదాపీఠం చొరవతో తిరుమల తిరుపతి దేవస్థానం అల్లూరి ఏజెన్సీలో చాలా ఆలయాలను నిర్మించిందని స్వాత్మానందేంద్ర స్వామి గుర్తు చేశారు.


Next Story

Most Viewed