విశాఖ తూర్పు వైసీపీ అభ్యర్థి ఎంవీవీకి కొత్త కష్టాలు

by Disha Web Desk 12 |
విశాఖ తూర్పు వైసీపీ అభ్యర్థి ఎంవీవీకి కొత్త కష్టాలు
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందే విపరీతంగా డబ్బు పంచిన విశాఖ ఎంపీ, విశాఖ తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణకు నేడు కొత్త కష్టాలు వచ్చాయి. విశాఖలో పెద్ద బిల్డర్, రియల్టర్ అయిన ఆయన జనవరి నుంచి సంక్రాంతి కానుక, ఉగాది కానుక, రంజాన్ కానుకల పేరిట చీరలు, కుక్కర్లు, టీ షర్టులు వంటి పలు కానుకలు పంచారు. ఆయన పిలిచిన సభలకు ఎప్పుడు వెళ్లినా వేయి రూపాయలు ఇస్తారని బాగా పాపులర్ అయింది. తీరా ఎన్నికల సమయం వచ్చేటప్పటికి ఏమైందో ఏమో ఆయన ఖర్చు తగ్గించేస్తున్నారు. బుధవారం తాను వేయనున్న నామినేషన్ కు జనాన్ని తరలించాల్సిందిగా తన అనుచరులకు పిలుపునిచ్చిన ఆయన మనిషికి 300 రూపాయలే ఫిక్స్ చేశారు.

జగన్ బస్సు యాత్రకు రూ.300

రెండు రోజుల క్రితం విశాఖ నగరంలో నుంచి వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్రకు కూడా ఆయన రూ.300 చొప్పున చెల్లించారు. మొదట్లో బాగా నోట్ల కట్టలు విసిరిన ఆయన ఇప్పుడు పొదుపు చేస్తుండడం ఆయన సభలకు వెళ్లడం బాగా అలవాటైన వారికి ఏ మాత్రం నచ్చడం లేదు. జగన్ బస్సు యాత్ర అంటే ఓ గంట రోడ్డు పక్కన నిలబడడమే. అదీ ఎండ లేని సాయంత్రం పూట. అప్పుడు రూ.300 అంటే సరే కానీ, నామినేషన్ కి కూడా అదే రేటా అని జనం పెదవి విరుస్తున్నారు. అసలు ఎండలు మండుతున్నాయి. ఆ జనం మధ్య నడవాలి, అరవాలి. జండాలు మోయాలి. అన్నీ చేసినా మూడు వందలేనా ? కుదరదు పొమ్మంటున్నారట. ఆ రేటుకు రాలేమని, కనీసం ఐదు వందలైనా చేయాలని బేరమాడుతున్నారు. దీంతో ఏం చేయాలో తోచక అనుచరులు ఇరకాటంలో పడ్డారు.



Next Story

Most Viewed