Non Bailable Warrant: మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు రైల్వే కోర్టు షాక్

by Disha Web Desk 16 |
Non Bailable Warrant: మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు రైల్వే కోర్టు షాక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు షాక్ తగిలింది. మంత్రిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. విశాఖ ఆరో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కమ్ రైల్వే న్యాయస్థానం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. రైల్వేస్టేషన్‌లోకి అనుమతి లేకుండా ప్రవేశించడంతోపాటు రైల్ రోకో నిర్వహించారని ఐదేళ్ల కిందట నమోదైన కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.

2018 ఏప్రిల్ 11న ప్రతిపక్షంలో ఉండగా విశాఖలో ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్‌పై నిరసనగళం వినిపించారు. విశాఖకు రైల్వోజోన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విశాఖ రైల్వేస్టేషన్‌లోకి వెళ్లారు. విశాఖ-పలాస ప్యాసింజర్ రైలును నిలిపివేసి రైల్ రోకో నిర్వహించారు. అనుమతి లేకుండా రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించడమే కాకుండా రైల్ రోకో నిర్వహించడంపై అప్పట్లో రైల్వే శాఖ కేసులు నమోదైంది.

అయితే ఈ కేసు విచారణ‎లో భాగంగా నిందితులు ఫిబ్రవరి 27న న్యాయ స్థానంలో హాజరు కావాల్సి ఉండగా మంత్రి గుడివాడ అమర్‎నాథ్, జాన్ వెస్లీలు గైర్హాజరయ్యారు. దీంతో నాన్ బెయిల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ తదుపరి విచారణను మార్చి 7కు వాయిదా వేసింది.

Next Story