Visakha: ఏడుగురు రైలు ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం అందజేత

by Disha Web Desk 16 |
Visakha: ఏడుగురు రైలు ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం అందజేత
X

దిశ, ఉత్తరాంధ్ర: ఒడిశా రైలు ప్రమాద బాధితులకు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు అన్ని కలెక్టరేట్లలో కంట్రోల్ రూములను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రైలు ప్రమాద సంఘటనపై విశాఖ కలెక్టరేట్‌లో మంత్రి కారుమూరు వెంకట నాగేశ్వరరావు, టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, కలెక్టర్ ఏ మల్లికార్జున, పోలీసు కమిషనర్ త్రివిక్రమ్ వర్మ, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, శాసన మండలి సభ్యులు వరుదు కళ్యాణితో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రైలు ప్రమాద బాధితులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు పూర్తి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మంత్రి గుడివాడ అమర్నాథ్, ముగ్గురు ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్ అధికారుల బృందం ఒడిశా రైలు ప్రమాద స్థలంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు. మరణించిన వారికి ప్రభుత్వం తరుపున రూ 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం జరిగిందని, తీవ్రగాయాలైన వారికి రూ. 2లక్షలు, స్వల్పగాయాలైన వారికి రూ. లక్ష ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం జరిగిందని మంత్రి తెలిపారు.

ఇక 12841 షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ఏపీకి చెందిన 484 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని, 12864 బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్‌లో 211 మంది ప్రయాణిస్తున్నారని, రెండు రైళ్లలో మొత్తం 695 మంది ప్రయాణికులు ప్రయాణించినట్లు గుర్తించామని మంత్రి బొత్స తెలిపారు. ఇందులో 553 మంది క్షేమంగా ఉన్నారని, 21 మందికి స్వల్పగాయాలయ్యాయని, ఓ వ్యక్తికి తీవ్రగాయాలైనట్లు మంత్రి తెలిపారు. 92 మంది ప్రయాణికులు ప్రయాణం రద్దు చేసుకున్నారని చెప్పారు. మరో 28 మంది ప్రయాణికుల వివరాలు అందుబాటులోకి రాలేదని అన్నారు. ఇప్పటికే 50 అంబులెన్స్‌లను కటక్, భువనేశ్వరులకు పంపించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు ఎటువంటి ఫోన్ కాల్స్ రాలేదని, ఎవరైనా తమ కుటుంబ సభ్యులు ఈ రెండు రైలుల్లో ప్రయాణించినట్లయితే వారి వివరాలను హెల్ప్ లైన్ నెంబరుకు ఫోన్ చేసి తెలియజేయాలని మంత్రి విజ్ఞప్తి చేసారు.

కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ఏపీకి చెందిన 484 మంది ఉన్నారని, వీరిలో విశాఖలో 309 మంది, రాజమండ్రిలో 31 మంది, ఏలూరులో 9 మంది, విజయవాడలో 135 మంది దిగాల్సి ఉందన్నారు. 12864 బెంగళూరు-హౌరా సూఫర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో 211 మంది ప్రయాణిస్తున్నారని , విశాఖపట్నం నుండి 33 మంది, రాజమండ్రి నుండి ముగ్గురు, ఏలూరు నుంచి ఒకరు, విజయవాడ నుండి 41, బాపట్ల, తెనాలి నుంచి 8 మంది, గుంటూరు నుండి ఇద్దరు, ఒంగోలు నుంచి 11 మంది, నెల్లూరు నుండి ముగ్గురు, తిరుపతి నుంచి 107 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిపారు.

మొత్తం ప్రయాణికుల్లో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలానికి చెందిన గురుమూర్తి అనే వ్యక్తి వృత్తి పరంగా ఫించన్ తీసుకొని తిరిగి వెళ్తూ ప్రమాదంలో మరణించినట్లుగా తెలిపారు. రాష్ట్రానికి సంబంధించి 20 మంది క్షతగాత్రులను గుర్తించి వారిలో ఇద్దరు కె.జి.హెచ్ నందు, ఇద్దరు సెవెన్ హిల్స్ హాస్పిటల్ నందు , ఒకరు ఐ.యన్.ఎస్ కళ్యాణి హాస్పటల్ నందు చికిత్స పొందుతున్నారని మంత్రి తెలిపారు. మరో 11 మంది వైద్యం చేయించుకుని ఇళ్లకు వెళ్లిపోయారని, మరో 4 ఒరిస్సా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా రైలు ప్రమాద సంఘటన నుంచి బయటపడి విశాఖపట్నం చేరుకున్న ఏడుగురు బాధితులకు ప్రభుత్వం తరుపున రవాణా ఖర్చుల నిమిత్తం యం. సత్యంకు 30 వేల రూపాయల చెక్కును మంత్రి అందజేశారు.


Next Story