తీరు మారని జనసేనాని.. పొత్తులపై నో క్లారిటీ!

by Disha Web Desk 4 |
తీరు మారని జనసేనాని.. పొత్తులపై నో క్లారిటీ!
X

పార్ట్ టైమ్ పొలిటీషియన్ అంటూ ప్రత్యర్థులు హేళన చేస్తుంటే జనసేనాని ఆగ్రహంతో ఊగిపోతుంటారు. వాస్తవంగా చూస్తే జనసేన ఆవిర్భావం నుంచి మాత్రమే కాదు, ప్రజారాజ్యం ఏర్పడినప్పటి నుంచి కూడా ఆయన పార్ట్ టైమ్ రాజకీయవేత్తగానే వ్యవహరిస్తున్నారు. సినిమా షూటింగుల మధ్య ఖాళీ దొరికినపుడు సభలు, సమావేశాలు పెట్టడం, ఉద్వేగభరిత ప్రసంగాలు చేయడం, ఆ తర్వాత కొన్ని నెలలు సైలెంటుగా ఉండిపోవడం - ఇదే పవన్ కల్యాణ్ ధోరణి.

రెండు రోజుల కిందట బందరులో నిర్వహించిన జనసేన పదవ ఆవిర్భావ సభలో సైతం ఆయన రొటీన్‌గానే మాట్లాడారు. వైసీపీని ఎదుర్కొనే వ్యూహాల గురించి, పొత్తుల గురించి పవన్ మాటమాత్రంగానైనా ప్రస్తావించకపోవడం గమనార్హం. ఏడాదిలోగా ఎన్నికలు జరగనున్న తరుణంలో పొత్తులపై ఇంకా క్లారిటీ లేకపోవడం ఆశ్చర్యకరం.

దిశ, ఏపీ బ్యూరో: ‘నేనొకటి జరగాలని కోరుకుంటున్నా. అది జరిగి తీరుతుంది. రానున్న ప్రభుత్వంలో జనసేన బలమైన సంతకం ఉంటుంది. నన్ను నమ్మండి..’ అంటూ జనసేనాని పార్టీ పదో వార్షికోత్సవ సభలో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు అటు పార్టీలో.. ఇటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికల దాకా సొంత బలం పెంచుకునే దిశగా ముందుకు సాగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన పొత్తులపై క్లారిటీ ఇవ్వలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఎక్కడి గొంగళి అక్కడే...

పదేళ్ల క్రితం ప్రారంభమైన జనసేన పార్టీ ప్రస్థానం ఇంకా క్షేత్ర స్థాయిలో బలమైన పునాదులు వేసుకునే దగ్గరే ఆగింది. పార్టీ శ్రేణులను నిరంతరం ప్రజలతో మమేకం చేసే కార్యాచరణను నాయకత్వం ఇవ్వలేకపోయింది. వివిధ సమస్యలపై అప్పుడుప్పుడు పవన్​ఇచ్చే పిలుపులతో కార్యకర్తలు స్పందిస్తున్నారు. మళ్లీ ఆయన సినిమా షూటింగ్​లకు వెళ్తే కేడర్ నిస్తేజంగా ఉండిపోతోంది. కొన్నిచోట్ల స్థానిక సమస్యలపై జన సైనికులు పోరాడుతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం ప్రజల్లో ఉండే కార్యాచరణ ఉండడం లేదు. కనీసం విపక్షాలతో కలిసి ఉమ్మడి పోరులో భాగస్వామ్యం అయినా జనంలో జన సైనికుల పట్టు పెరిగేది. అలా చేయకుండా ఎన్నికలదాకా అప్పుడప్పుడు పవన్ ​సభలు పెట్టడం ద్వారా పార్టీ ఎలా బలోపేతమవుతుందో ఆ పార్టీ నేతలకే తెలియాలి.

నాయకత్వ లోపం ప్రస్ఫుటం...

పవన్​అభిమానులు ఇప్పటిదాకా సినీ గ్లామర్‌కే పరిమితమవుతున్నారు. వాస్తవానికి ఓటు దగ్గరకు వచ్చే సరికి అభిమానులపై అనేక ఒత్తిడులుంటాయి. రెండొందల ఖర్చుతో సినిమా చూసి అభిమానం చాటుకోవడం తేలిక. దీనికి ఎవరి నుంచి ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఓ గ్రామం లేదా తాము నివసించే ప్రాంతాల్లో నాయకులను కాదని ఓటు వేయలేరు. దైనందిన జీవితంలో అనేక అవసరాలుంటాయి.

తప్పనిసరి పరిస్థితుల్లో అధికార పార్టీ వైపు మొగ్గు చూపాల్సి ఉంటుంది. లేదా ప్రధాన ప్రతిపక్షం అండదండలు కావాల్సి వస్తుంది. గట్టి భరోసా ఇవ్వగలిగిన పార్టీ నేతల ఒత్తిడి నుంచి తప్పించుకోలేరు. గ్రామ లేదా పట్టణ స్థాయిలో పవన్​అభిమానులకు అండగా మేమున్నామంటూ ధైర్యాన్నిచ్చే స్థాయికి పార్టీ నాయకత్వం ఎదగలేదు. ఈ లోపాలను సరిదిద్దడానికి పవన్​నిరంతరం ప్రజల్లో ఉండాలి. లేదా ఆ స్థాయిలో పార్టీ నిర్ణయాలను తీసుకోగలిగిన నాయకులు దృష్టి సారించాలి.

మనసంతా సినిమాలపైనే...

వచ్చే ఎన్నికల దాకా పవన్ ​సినిమాలు వదిలేసి పూర్తి కాలం వెచ్చించలేరు. సినిమాల ద్వారా వచ్చే ఆదాయంతో పార్టీని నెట్టుకొస్తున్నారు. ఇలా ఎన్నాళ్లు నడుపుతారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. వివిధ వర్గాల నుంచి అందే విరాళాలతోనే ఏ రాజకీయ పార్టీ అయినా మనగలుగుతుంది. అలా పార్టీకి ఆర్థిక వనరులు సమకూర్చుకుంటే తప్ప జనసేనాని పూర్తి సమయం పార్టీ కోసం కేటాయించలేరు. సినిమాలు వదిలేస్తే ఆ గ్లామర్​తగ్గుతుంది. దాన్ని వదులుకోవడానికి పవన్​ సిద్దంగా లేరు. ఇలా ఈ రెండు వైరుధ్యాలున్నాయి. ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని ఆయన ఎంచుకోలేక పోతున్నారు.

పార్టీ ఇంకా ఎదగకపోవడానికి ఇదో కారణమవుతోంది. ఇప్పుడున్న స్థితిలో ఎన్నికలకు వెళ్తే కనీసం పదో వంతు సీట్లు కూడా దక్కవని అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయి. గత ఎన్నికల నాటికన్నా జనసేన బలం కొంచెం పెరిగినా అది ఎమ్మెల్యేలుగా గెలిపించేంత లేదనే అంచనాలున్నాయి. వీటన్నింటినీ సరిచేసుకుంటేనే పవన్ ​అనుకున్నది జరగడానికి అవకాశముంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మరి జనసేనాని నిర్ణయాలు ఆ దిశలో ఉంటాయా అని పార్టీ శ్రేణులు మల్లగుల్లాలు పడుతున్నాయి.


Next Story

Most Viewed