స‌మ‌న్వ‌యంతో శ్రీ‌వారి రెండు బ్ర‌హ్మోత్స‌వాలు విజ‌య‌వంతం: టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి

by Disha Web Desk 21 |
స‌మ‌న్వ‌యంతో శ్రీ‌వారి రెండు బ్ర‌హ్మోత్స‌వాలు విజ‌య‌వంతం: టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో : శ్రీ‌వారి సాల‌క‌ట్ల‌, న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో భ‌క్తులు మ‌ధురానుభూతితో వాహ‌న‌సేవ‌ల ద‌ర్శ‌నం చేసుకున్నార‌ని, త‌ద్వారా భ‌క్తుల క‌ళ్ల‌లో వెలుగులు, మ‌న‌సు నిండా ఆనందంతో నిండిపోయింద‌ని టీటీడీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి పేర్కొన్నారు. శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల్లో చివ‌రి రోజైన సోమవారం చ‌క్ర‌స్నానం అనంత‌రం అన్న‌మ‌య్య భ‌వ‌నంలో చైర్మ‌న్ మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా భూమన మాట్లాడుతూ..గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా పాల‌క‌మండ‌లి, అధికారులు, సిబ్బంది, మీడియా ప్ర‌తినిధుల‌ గొప్ప స‌మ‌న్వ‌యంతో స్నేహ‌పూర్వ‌క వాతావ‌ర‌ణంలో బ్ర‌హ్మోత్స‌వాలు దిగ్విజ‌యంగా జ‌రిగాయ‌న్నారు. ఈ సంవ‌త్స‌రం అధిక మాసం కార‌ణంగా రెండు బ్ర‌హ్మోత్స‌వాలు నిర్వ‌హించామన్నారు. సీఎం వైఎస్ జగన్ సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల ధ్వ‌జారోహ‌ణం నాడు స్వామివారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారని చెప్పుకొచ్చారు. అలాగే యాత్రికులు, తిరుప‌తి ప్ర‌జ‌ల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డే శ్రీ‌నివాస సేతు, విద్యార్థుల ఉప‌యోగార్థం ఎస్వీ ఆర్ట్స్ క‌ళాశాల‌లో నిర్మించిన అద‌న‌పు హాస్ట‌ల్ భ‌వ‌నాల‌ను ప్రారంభించారన్నారు. అదేవిధంగా, టీటీడీ ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఇంటిస్థ‌లాల‌ను పంపిణీ చేసి వారి సొంత ఇంటి క‌లను సాకారం చేసిన ముఖ్య‌మంత్రికి ఈ సంద‌ర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మ‌రో 250 ఎక‌రాలు స‌మీక‌రించి ఉద్యోగులంద‌రికీ ఇంటిస్థ‌లాలు ఇవ్వాల‌ని ఈవోను, క‌లెక్ట‌రును ముఖ్య‌మంత్రి ఆదేశించ‌డం ఉద్యోగుల‌కు గొప్ప బ‌హుమానం అని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

సంతృప్తికరంగా స్వామివారి సేవలు

ల‌క్ష‌లాది మంది సామాన్య భ‌క్తుల‌కు బ్ర‌హ్మోత్స‌వాల్లో సంతృప్తిక‌రంగా స్వామివారి వాహ‌న‌సేవల ద‌ర్శ‌నం చేయించాం అని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా సామాన్య భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా వ‌స‌తి, అన్న‌ప్ర‌సాదం, త‌ల‌నీలాల స‌మ‌ర్ప‌ణ‌, ల‌డ్డూప్ర‌సాదాలు అందించినట్లు స్పష్టం చేశారు. వాహ‌న‌సేవ‌ల ముందు మునుపెన్న‌డూ లేనివిధంగా క‌ళాప్ర‌ద‌ర్శ‌న‌లు గొప్ప ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయన్నారు. దేశ‌వ్యాప్తంగా 15 రాష్ట్రాల నుండి అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన క‌ళారూపాలు, జాన‌ప‌ద నృత్యాలను ప్ర‌ద‌ర్శించిన‌ క‌ళాకారులు భ‌క్తుల అభినంద‌న‌లు అందుకున్నారన్నారు. పెరుగుతున్న సాంకేతిక‌త‌ను వినియోగించుకుని ఈ బ్ర‌హ్మోత్స‌వాల్లో ఏర్పాటుచేసిన పుష్పాలంక‌ర‌ణ‌లు, విద్యుద్దీపాలంక‌ర‌ణ‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నట్లు చెప్పుకొచ్చారు. క‌ల్యాణ‌వేదిక వ‌ద్ద అనంత‌ప‌ద్మ‌నాభ‌స్వామివారి సెట్టింగుతోపాటు వివిధ విభాగాల ద్వారా ఏర్పాటుచేసిన ఎగ్జిబిష‌న్లు భ‌క్తుల ప్ర‌శంస‌లు అందుకున్నాయన్నారు. తిరుమ‌ల నాద‌నీరాజ‌నం, ఆస్థాన‌మండ‌పం వేదికల‌ మీద ప్ర‌ముఖ క‌ళాకారులు ఆల‌పించిన అన్న‌మ‌య్య, పురంద‌ర‌దాస‌ సంకీర్త‌న‌లు, ధార్మికోప‌న్యాసాలు భ‌క్త‌జ‌నాన్ని ఆధ్యాత్మికానందంలో ఓల‌లాడించాయని చెప్పుకొచ్చారు. అలాగే తిరుప‌తిలోని మ‌హ‌తి ఆడిటోరియం, అన్న‌మాచార్య క‌ళామందిరం, రామ‌చంద్ర పుష్క‌రిణిలో ఏర్పాటుచేసిన సంగీత‌, నృత్య కార్య‌క్ర‌మాలు తిరుప‌తివాసుల‌ను ఆక‌ట్టుకున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. వాహ‌న‌సేవ‌ల ముందు తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు భాష‌ల్లో ముద్రించిన ఆధ్యాత్మిక పుస్త‌కాల‌ను ఆవిష్క‌రించినట్లు పేర్కొన్నారు.

అత్యధిక మంది భక్తులకు దర్శనం

ఎస్వీబీసీలోని నాలుగు భాష‌ల ఛాన‌ళ్ల‌లో వాహ‌న‌సేవ‌ల‌తోపాటు ఇత‌ర ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌తిరోజూ సుమారు 9 గంట‌ల పాటు ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసినట్లు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు బ్ర‌హ్మోత్స‌వాల ప్ర‌సారాల‌ను తిల‌కించారు. త‌ద్వారా ఛాన‌ల్ అత్య‌ధిక రేటింగ్‌ను అందుకుందన్నారు. అత్యధిక మంది భ‌క్తులకు ద‌ర్శ‌నం కల్పించేందుకు వీలుగా ఆగ‌మ పండితుల అనుమ‌తితో తొలిసారిగా గ‌రుడ‌సేవ‌ను సాయంత్రం 6.30 గంట‌ల‌కే ప్రారంభించినట్లు వెల్లడించారు. గ‌రుడ‌సేవ నాడు గ్యాల‌రీల్లోకి రాలేని భ‌క్తుల సౌల‌భ్యం కొర‌కు సుప‌థం, వ‌సంత‌మండ‌పం, మేద‌ర‌మిట్ట‌, అన్న‌దానం కాంప్లెక్స్ ప్రాంతాల్లో ప్ర‌త్యేక క్యూలైన్లు ఏర్పాటుచేసి భ‌క్తుల‌కు స్వామివారి ద‌ర్శ‌నం క‌ల్పించామని భూమన అన్నారు. గ‌రుడ‌సేవ‌రోజు ట్రాఫిక్ ఇబ్బందులు త‌లెత్త‌కుండా తిరుమ‌ల‌లోని ప‌లు ప్రాంతాల్లో వాహ‌నాల పార్కింగ్ ప్ర‌దేశాల‌ను ప్ర‌త్యేకంగా ఏర్పాటుచేశామన్నారు. ఆరోజున వ‌చ్చిన ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌కు ప‌లుర‌కాల అన్న‌ప్ర‌సాదాలు, తాగునీరు, మ‌జ్జిగ‌, పాలు, టీ, కాఫీ పంపిణీ చేశామని చెప్పుకొచ్చారు. మ‌రుగుదొడ్ల స‌మ‌స్య లేకుండా ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకున్నట్లు వివరించారు. బ్ర‌హ్మోత్స‌వాల‌ను విజ‌యవంతం చేయ‌డంలో పాలుపంచుకున్న మా అధికారులు, సిబ్బంది, క‌ళాకారులు, శ్రీ‌వారి సేవ‌కులు, ఎన్‌సిసి విద్యార్థుల‌కు భూమన కరుణాకర్ రెడ్డి అభినందనలు తెలిపారు. అలాగే, బ్ర‌హ్మోత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు అన్నివిధాలా స‌హ‌క‌రించిన జిల్లా యంత్రాంగం, పోలీసు, ఆర్‌టీసీ, ఇత‌ర ప్ర‌భుత్వ విభాగాల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ మీడియా స‌మావేశంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు వెంకటసుబ్బ‌రాజు, యానాద‌య్య‌, దేశ్‌పాండే, వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి, తిప్పేస్వామి, వెంకటసతీష్ కుమార్, అశ్వర్థ నాయక్, నాగసత్యం, జెఈవోలు స‌దా భార్గ‌వి, వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో న‌ర‌సింహ కిషోర్,సీఈ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Next Story