అమెరికాలో ఏపీ వ్యక్తుల కిరాతకం.. విద్యార్థిని బంధించి చిత్రహింసలు

by Disha Web Desk 21 |
అమెరికాలో ఏపీ వ్యక్తుల కిరాతకం.. విద్యార్థిని బంధించి చిత్రహింసలు
X

దిశ , డైనమిక్ బ్యూరో : చదువుకుంటున్న 20 ఏళ్ల విద్యార్థిని ముగ్గురు వ్యక్తులు బంధించారు. ఇంటిలో బంధించి చిత్రహింసలకు గురి చేశారు. పీవీసీ పైపులు, ఇనుపరాడ్లు, విద్యుత్ వైర్లతో చావబాదేవారు. విద్యార్థి ఆ దెబ్బలు తాళలేక ఏడుస్తుంటే చూస్తూ రాక్షసానందం పొందారు.ఇంటి పనులు చేయించుకోవడమే కాదు ఏకంగా మసాజ్ కూడా చేయించుకునేవారు. రోజుకు మూడు గంటలకు మాత్రమే నిద్రపోయేందుకు సమయం ఇచ్చి మిగిలిన సమయమంతా ఇంటిపని ఒంటిపని, వంటపని చేయించుకునేవారు. ఏడు నెలల్లో ఆ విద్యార్థి 30 కేజీల బరువు తగ్గాడంటే ఎంతలా వేధించారో అర్థం చేసుకోవచ్చు. మెుత్తానికి ఈ ఘటన బయటపడటంతో నిందితులపై పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. మిస్సోరి రాష్ట్రంలోని సెయింట్ లూయిస్ పరిధిలో జరిగిన ఈ కిరాతకానికి పాల్పడింది ఏపీకి చెందిన వ్యక్తులు కావడం చర్చనీయాంశంగా మారింది.

బాలుడిని రక్షించిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సత్తారు వెంకటేశ్ రెడ్డి, నిఖిల్, శ్రవణ్‌లు మిస్సోరి రాష్ట్రంలోని సెయింట్ లూయిస్‌లో నివశిస్తున్నారు. ఈ ముగ్గురు కలిసి 20 ఏళ్ల విద్యార్థినిని కిడ్నాప్ చేసి తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. అయితే బాధిత యువకుడు రెస్టారెంట్‌కు వచ్చాడు. యువకుడిని వేరే వ్యక్తి పరిశీలించాడు. ఏమైందని నిలదీశారు. ఆ వ్యక్తి బాధిత యువకుడిని కలిసి ఏదైనా సమస్య ఉంటే తనకు ఫోన్ చేయమని ఫోన్ నెంబర్ ఇచ్చాడు. దీంతో ఆ బాధిత యువకుడు అతడికి వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించాడు. తనను ముగ్గురు యువకులు బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నారని.. వారి బారి నుంచి తనను రక్షించాలని కోరాడు. ఆ యువకుడి మెసేజ్‌తో తల్లడిల్లిన ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇంటికి వెళ్లి బాలుడిని రక్షించి నిందితులు సత్తారు వెంకటేశ్‌రెడ్డి, నిఖిల్, శ్రవణ్‌లను అరెస్ట్ చేశారు. నిందితులపై మానవ అక్రమ రవాణా, హింసించడం తదితర సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.

ఆస్పత్రిలో బాధిత విద్యార్థి

ఇకపోతే తనపై ముగ్గురు వ్యక్తులు చిత్ర హింసలకు గురి చేశారని యువకుడు పోలీసులకు తెలిపారు.తనను ప్రతిరోజు పీవీసీ పైపులు, ఇనుప రాడ్లు, విద్యుత్ వైర్లతో చితక్కొట్టేవారని బాధితుడు పోలీసులకు తెలిపాడు. తాను గాయాలతో బాధపడుతుంటే రాక్షసానందం పొందేవారని వెల్లడించారు. ముగ్గురు పెట్టే టార్చర్‌ వల్ల నుదుటి నుంచి అరికాళ్ల వరకు గాయాలు అయ్యాయని.. పక్కటెముకలు సైతం విరిగాయని వాపోయాడు. ఇంట్లో పని మొత్తం తనతో చేయించుకోవడం...మసాజ్ చేయించుకోవడం చేసేవారని..రోజుకు కేవలం 3 గంటలు మాత్రమే పడుకునేందుకు పర్మిషన్ ఇచ్చేవారని తెలిపారు. ఈ చిత్రహింసల వల్ల 7 నెలల్లో తాను ఏకంగా 30 కిలోల బరువు తగ్గినట్లు వాపోయాడు. ప్రస్తుతం బాధిత విద్యార్థిని పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వీళ్ల వద్దకు బాధితుడు ఎందుకు వచ్చాడు? బాధితుడిని వీళ్లు హింసించడానికి గల కారణాలు ఏమిటనే విషయంపై పోలీసులు విచారిస్తున్నారు.

Next Story