పంచాయతీలను నిర్వీర్యం చేసిన రాష్ట్ర ప్రభుత్వం

by Disha Web Desk 10 |
పంచాయతీలను నిర్వీర్యం చేసిన రాష్ట్ర ప్రభుత్వం
X

దిశ, ఏపీ బ్యూరో : ప్రకాశం జిల్లా దర్శి మండలం రామచంద్రాపురం సర్పంచ్ బాదం ధనలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చేసిన పనులకు బిల్లులు రాక, అప్పులు ఇచ్చినోళ్లు ఇంటి చుట్టూ తిరుగుతూ నానా మాటలు అంటుంటే ఆమె తట్టుకోలేకపోయారు. సుమారు రూ.10 లక్షల దాకా ప్రభుత్వం నుంచి బిల్లులు రావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికార పార్టీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, జడ్పీ చైర్​ పర్సన్​​ బూచేపల్లి వెంకాయమ్మ స్పందిస్తూ ఆమె మానసిక స్థితి సరిగా లేనందు వల్లే బలవన్మరణానికి పాల్పడిందని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఒక్కటే కారణం కాదని చెప్పారు. ఇటీవల గుంటూరు జిల్లాకు చెందిన ఓ సర్పంచ్ నెత్తిమీద సగం వెంట్రుకలతో క్షవరం చేయించుకొని పంచాయతీల పట్ల ప్రభుత్వ తీరుకు నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,390 పంచాయతీలు ఉండగా, దాదాపు 90 శాతం సర్పంచులు అధికార వైసీపీకి చెందిన వారే కావడం గమనార్హం.

పాపం.. సర్పంచులు..

ప్రస్తుత వేసవి కాలంలో నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న గ్రామాలు ఎన్నో ఉన్నాయి. నీటి సరఫరాకు ప్రభుత్వం పంచాయతీలకు నిధులు ఇవ్వాలి. కనీసం కేంద్రం నుంచి వచ్చిన ఆర్థిక సంఘం నిధులను అయినా అందుబాటులో ఉంచాలి. ఏ గ్రామ పంచాయతీ ఖాతా చూసినా వట్టిపోయినట్లు కనిపిస్తోంది. సాధారణ నిధులను సైతం సర్కారు దారి మళ్లించింది. స్థానిక ప్రజల ముందు నాయకుడిగా తలెత్తుకోలేక కొందరు సర్పంచులు చేతి నుంచి ఖర్చు పెడుతున్నారు. ఇలా ఈపాటికే అప్పులు తెచ్చి పనులు చేసిన సర్పంచులకు బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. దీంతో పంచాయతీ పాలకవర్గాలు సర్కారుపై తీవ్ర ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నాయి.

నాలుగేళ్లుగా చెల్లింపులు లేవు..

గతంలో దర్శి ఎమ్మెల్యే మద్ది శెట్టి వేణుగోపాల్​ పార్టీ ప్లీనరీ సమావేశంలో ఇదే అంశాన్ని లేవనెత్తారు. పార్టీ క్షేత్ర స్థాయి నాయకులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో వాళ్లు గడప దాటి బయటకు రాలేకపోతున్నట్లు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారు. ఇలాగైతే పార్టీ కార్యక్రమాలను ఎలా నిర్వహించాలని బాహాటంగానే నిలదీశారు. శ్రీకాకుళం జిల్లాలో ఓ ఎంపీపీ అయితే తన ఇంట్లో బంగారం తాకట్టు పెట్టి పనులు చేశానని వాపోయాడు. సొంత పార్టీ నాయకులకే బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా చెప్పుకుంటూపోతే గడచిన నాలుగేళ్లలో సచివాలయాలు, ఆర్బీకేలు నిర్మించిన వాళ్లకు ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదని తెలుస్తోంది.

సర్పంచుల ఆగ్రహం చవిచూడక తప్పదు..

రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలకు చెల్లించాల్సిన పెండింగ్​ బిల్లులు సుమారు రూ.20 వేల కోట్లు ఉంటుంది. సర్పంచుల అగచాట్లను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తోంది. గ్రామ పంచాయతీ పాలక వర్గాలను నిర్వీర్యం చేస్తోంది. ప్రజల అవసరాల తీర్చేందుకు ప్రభుత్వం ప్రతి సచివాలయానికీ రూ.20 లక్షలు వెచ్చించింది. ఇంకా కలెక్టర్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే అధికారాన్ని ఇచ్చింది. మరి అప్పులు తెచ్చి సర్పంచులు చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ? ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దం. ప్రస్తుతం ఉన్న సర్పంచులంతా అధికార పార్టీ వాళ్లే. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ ఒక్క సర్పంచ్ పార్టీకి సహకరించకుండా తమ నిరసనకు అద్దం పట్టారు. అయినా అధికార పార్టీలో చలనం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే సర్పంచుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది.

Next Story

Most Viewed