ముంచుకోస్తున్న నీటి ఎద్దడి.. తాగునీటి కోసం ఆ జిల్లా వాసుల ఇక్కట్లు

by Disha Web Desk 18 |
ముంచుకోస్తున్న నీటి ఎద్దడి.. తాగునీటి కోసం ఆ జిల్లా వాసుల ఇక్కట్లు
X

దిశ,మాచర్ల: ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉంటున్నారంటూ ప్రతి సభలోనూ సీఎం జగన్‌ ఊదరగొడుతుంటారు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం కనీసం ప్రజల దాహార్తిని తీర్చలేకపోతుంది.ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని జగన్‌ ప్రవేశపెట్టిన వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు ఆరంభ శూరత్వంగానే మిగిలిపోయింది.వైసీపీ ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో తాగునీటి ప్రాజెక్టులు అటకెక్కాయి. దీంతో పల్నాడులో చాలా గ్రామాల ప్రజలు దాహార్తితో బాధపడుతున్నారు. వేసవి ప్రారంభం ముందే తాగునీటికి పల్లెలు అల్లాడిపోతున్నాయి. మంచినీటి పథకాలు లేక కొన్నిచోట్ల.. ఉన్నవి మూలనపడి మరికొన్నిచోట్ల ఇలా దాహార్తితో జనం అలమటిస్తున్నారు.నెత్తిన బిందెలు పట్టుకుని మహిళలు బావులు, చెలమలకు నడిచివెళ్లాల్సిన దుస్థితి దాపురించింది. కూలినాలి చేసుకునే బడుగు జీవులు సైతం ఆర్వో ప్లాంట్లకు వెళ్లి మంచినీళ్లు కొనుక్కోవాల్సి వస్తోంది. తాగు నీరందించే బోర్లు, రక్షిత పథకాలు ఏళ్ల తరబడి పనిచేయకపోయినా మరమ్మతు ఊసెత్తని పాలకుల నిర్లక్ష్యం సాక్షిగా.. పల్లె ప్రజలు తాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు.

తాగునీటి కష్టాలు..

వేసవి ఆరంభానికి ముందే తాగునీటి కటకట తీవ్రమవుతోంది. గుక్కెడు మంచి నీరు కోసం జనం నానాపాట్లు పడుతున్నారు. పల్లె, పట్టణం తేడా లేకుండా నీటి సమస్య జటిలమవుతుంది. వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటడంతో ఇంతకాలం గొంతు తడిపిన చేతిపంపులు కూడా వట్టి పోతున్నాయి. బావుల్లో నీరు ఆవిరై పోయింది.మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో నీటి ఎద్దడిని ఎలా ఎదుర్కోవాలని ఆందోళన వ్యక్తమవుతోంది. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం వాటర్‌గ్రిడ్ పథకంపై దృష్టి పెట్టినప్పటికీ ప్రస్తుతం దాహం తీరేదెలాగన్నదే ప్రశ్నార్థకంగా మారింది. ఏటా వేసవిలో పల్నాడులోని అనేక ప్రాంతాల్లో తాగునీటి ఇక్కట్లు ఎదుర్కొంటాయి.ఏడాది పొడవునా ట్యాంకర్లతో నీటిని అందించాల్సిందే. లేదంటే మేము మంచినీటి కోసం మినరల్ వాటర్ మీద ఆధారపడాల్సి వస్తుంది.ఒకటి రెండు రోజులు ట్యాంక్ ఆలస్యమైనా మేము నీటి కోసం ఎదురు చూడాల్సిందే. కాలువలు, చెరువులన్నీ ఎండిపోయాయి. ఇప్పుడే ఇలా ఉంటే మార్చి తర్వాత బిందెడు నీళ్లు కావాలంటే ఎన్ని ప్రయాసలు పడాలో అర్థం కావడం లేదని జనం ఆవేదన చెందుతున్నారు.

పొంచి ఉన్న ..తాగునీటి సమస్య...

తాగునీటి సమస్య పొంచి ఉంది. ప్రధానంగా నాగార్జున సాగర్‌, పులిచింతల జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోవడం, గత కొన్ని నెలలుగా వర్షాలు లేకపోవడం, భూగర్భ జలాల నిల్వలు తగ్గిపోవడంతో నీటి ఎద్దడి తప్పేలా లేదు. గత వారం రోజుల నుంచి ఎండల తీవ్రత పెరుగుతోంది. నాగార్జున సాగర్‌లో కూడా నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయి. సాగర్‌లో గరిష్ట నీటి నిల్వ 312 టిఎంసీలు కూడా ప్రస్తుతం 144 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. ఈనెలాఖరు కల్లా సాగర్‌ జలాశయంలో నీటి నిల్వలు డెడ్‌ స్టోరేజీకి చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేగాక ఉమ్మడి జిల్లాలో 1.70 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. మిర్చికి ఇంకా కనీసం ఒక తడికి నీరు అవసరం ఉంది. ప్రస్తుతం సాగర్‌ నుంచి నీరు విడుదల చేసే పరిస్థితి లేదని అధికారులు తెలిపారు. ప్రతి ఏటా మే నెలలో నీటి ఎద్దడి వస్తుంది. కానీ ఈ ఏడాది మార్చి చివరికే ఈ సమస్య రావచ్చు అంటున్నారు.

నీటి కష్టాల నుంచి గట్టెక్కించే వరికపూడిశెల...

పల్నాడుని నీటి కష్టాల నుంచి గట్టెక్కించే వరికపూడిశెల ప్రాజెక్టు కోసం దశాబ్దాలుగా ఎదురు చూపులతోనే గడపాల్సి వస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులు మూడు సార్లు శంకుస్థాపనలు చేశారు. అయినా పునాదిరాళ్లు దశ దాటిన దాఖలాలు లేవు. ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. తొలి దశలో వెల్దుర్తి, ఉప్పలపాడు, గొట్టిపాళ్ల, సిరిగిరిపాడు, బొదిలవీడు, గంగలకుంట, కండ్లకుంట గ్రామాల పరిధిలో 24,900 ఎకరాలకు సాగునీరు, 20 వేల మంది జనాభాకు తాగునీరు అందించాలన్నది లక్ష్యమని ప్రభుత్వం అంటోంది.


Next Story