ఎన్నికలు సమీపిస్తోన్న వేళ జనసేనకు ఈసీ ఝలక్.. పవన్ స్వయంకృతాపరాధమేనా..?

by Disha Web Desk |
ఎన్నికలు సమీపిస్తోన్న వేళ జనసేనకు ఈసీ ఝలక్.. పవన్ స్వయంకృతాపరాధమేనా..?
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో మరో ఏడాది కాలంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకవేళ వైసీపీపై వ్యతిరేకత పెరిగితే ముందస్తు ఎన్నికలు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చర్చ జరుగుతుంది. ఇక ఎన్నికల్లో అటు వైసీపీ ఇటు టీడీపీ మరోవైపు జనసేన, ఇంకోవైపు బీజేపీలు రెడీ అంటున్నాయి. అన్ని పార్టీలు రాజకీయంగా కదనరంగంలోకి దూకినా జనసేన పార్టీ పూర్తిస్థాయిలో ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం కాలేదని తెలుస్తోంది. ఆ పార్టీ అధినేత అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారు. ఇలాంటి తరుణంలో జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గట్టి షాక్ ఇచ్చింది. తమ పార్టీ సింబల్‌గా గాజు గ్లాస్‌ను జనసేన పార్టీ ప్రచారం చేసుకుంటుంది. అయితే గాజు గ్లాసు గుర్తును ఈసీ ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. ఏపీలో ఎన్నికలకు రెడీ అవుతున్న వేళ ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకోవడం జనసేన పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఇన్నాళ్లు పార్టీ గుర్తుగా ప్రచారం చేసుకున్న గాజు గ్లాసు సింబల్ వచ్చే ఎన్నికల్లో జనసేనకు వస్తుందో లేదో అన్న ఆందోళన ఆ పార్టీలో నెలకొంది. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పవన్ కల్యాణ్ ఎన్నికలకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన టీడీపీతో కూడా పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది.

ఫ్రీ సింబల్ జాబితాలో గాజు గ్లాసు

దేశ వ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందిన వాటిలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలున్నట్లు ప్రకటనలో తెలిపింది. ఈ రెండు పార్టీలకు సంబంధించి ప్రస్తుతం కేటాయించిన గుర్తులను ఆ రాష్ట్రాల్లో రిజర్వు చేస్తున్నట్లు తెలిపింది. అదే సందర్భంలో పార్టీలకు అతీతంగా కేంద్ర ఎన్నికల సంఘం 193 ఫ్రీ సింబల్స్‌ను విడుదల చేసింది. ఇందులో భాగంగా జనసేనకు కేటాయించిన గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చుతూ ఉత్తర్వులు ఇచ్చింది. అంటే సంబంధిత గుర్తును రిటర్నింగ్ అధికారులు నిబంధనల ప్రకారం నియోజకవర్గంలో పోటీ చేసే వారెవరికైనా కేటాయించవచ్చు.

కారణమిదేనా?

ఇకపోతే జనసేన పార్టీ సింబల్‌ను కోల్పోవడానికి గల కారణాలను ఈసీ స్పష్టం చేసింది. పలు ఎన్నికల్లో జనసేన పోటీ చేయకపోవడం వల్లే గుర్తును కోల్పోవాల్సి వచ్చిందని ప్రకటించింది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం రాజకీయ పార్టీ తన గుర్తును నిలుపుకోవాలంటే, ఖచ్చితంగా ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పొందాల్సి ఉంటుంది. అలాంటిది కొన్ని ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు అని ఈసీ తెలిపింది. అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ చాలా తక్కువ చోట్ల మాత్రమే జనసేన పోటీ చేసింది. ఈ పరిణామాలే జనసేన తన గుర్తును కోల్పోవాల్సి వచ్చింది.

ఏపీ తెలంగాణలో అదే పరిస్థితి

జనసేన గుర్తు అయిన గాజు గ్లాస్‌ను గతంలోనే ఫ్రీ సింబల్ జాబితాలో ఈసీ ప్రకటించింది. బద్వేలు ఉప ఎన్నికల్లో అది స్పష్టమైంది. నవతరం పార్టీ అభ్యర్థికి ఈసీ గాజు గ్లాస్ గుర్తును కేటాయించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లోనూ గాజు గ్లాస్ గుర్తును స్వతంత్ర అభ్యర్థికి కేటాయించిన సంగతి తెలిసిందే. మరోవైపు తెలంగాణలోనూ జనసేన పార్టీ తన గుర్తును కోల్పోయింది. ఆ పార్టీకి కామన్ సింబల్ కేటాయించడం కుదరదని తెలంగాణ ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తును కేటాయించలేదు. అంతకు ముందు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కనీసం పదిశాతం సీట్లలో కూడా జనసేన పోటీ చేయలేదు. దీంతో నిబంధనల ప్రకారం గాజు గ్లాసు గుర్తును కేటాయించలేమని ఎస్ఈసీ వెల్లడించిన సంగతి తెలిసిందే. బీజేపీతో పొత్తు పెట్టుకున్నందున పోటీ చేయలేకపోయామని.. ఈసారి అన్ని చోట్లా పోటీ చేస్తామని ఉమ్మడి గుర్తు కేటాయించాలని జనసేన రిక్వస్ట్ చేసినప్పటికీ ఎస్ఈసీ సంతృప్తి చెందలేదు. కామన్ సింంబల్‌‌గా గాజు గ్లాస్ గుర్తు కేటాయించేందుకు అంగీకరించలేదు. దీంతో ఆ గుర్తు స్వతంత్రులకు కేటాయించిన సంగతి తెలిసిందే.

గాజు గ్లాసు గుర్తు పోతే జనసేనకు నష్టమే

గత సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేనకు ఈసీ గాజు గ్లాస్ గుర్తు కేటాయించగా.. ఆ పార్టీ శ్రేణులు సింబల్ ను జనాల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లారు. జనసేనాని పవన్ కల్యాణ్ సైతం తాను నటించే సినిమాల్లో ఏదో ఒక సందర్భంలో గాజు గ్లాస్‌ను ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇలా అనేక రూపాల్లో గాజు గ్లాస్ అంటే జనసేన పార్టీ సింబల్‌గా ప్రజల్లో గుర్తింపు తీసుకువచ్చేలా జనసైనికులు కష్టపడ్డారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసీ ఆ గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడంతో జనసేనకు షాక్ తగినట్లయింది. వచ్చే ఎన్నికల్లో ఈసీ జనసేనకు మళ్ళీ గాజు గ్లాస్ గుర్తు కామన్ సింబల్‌గా ఇస్తే ఒకే లేకపోతే భారీగా నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదు.

Also Read..

Chandrababu: రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉంది


Next Story

Most Viewed