పనికిమాలిన పోలీసు అధికారి సునీల్ కుమార్: వర్ల రామయ్య

by Disha Web |
పనికిమాలిన పోలీసు అధికారి సునీల్ కుమార్:  వర్ల రామయ్య
X

దిశ, ఏపీ బ్యూరో : ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పనికిమాలిని పోలీస్ అధికారి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఖాకీ డ్రైస్‌పై ఏమాత్రం గౌరవం ఉన్నా ఉద్యోగంలో నుంచి తప్పుకోవాలని సవాల్ చేశారు. స్టాఫోర్డ్ నివేదిక ఫేక్ అంటూ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. మాధవ్ అశ్లీల చిత్రంపై సమగ్ర విచారణ జరిపితే ఈ కేసును నీరుగార్చడానికి ప్రయత్నించిన సునీల్ కుమార్, ఫకీరప్పతో సహా సంబంధం ఉన్న పోలీసు అధికారులంతా జైలుకు వెళతారని హెచ్చరించారు. ఫిర్యాదు లేకపోవడం వల్ల మాధవ్ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని దర్యాప్తు కొనసాగించలేమని చెబుతున్నారు.

ఈ వ్యాఖ్యలు ప్రజలను తప్పుదారి పట్టించడానికి మాత్రమే అని చెప్పుకొచ్చారు. అటువంటపుడు ఎటువంటి ఎఫ్ఐఆర్ నెంబర్ లేకుండా ఫారిన్ ఏజన్సీతో ఎలా సంప్రదింపులు జరిపారు? వాస్తవానికి మాధవ్ అశ్లీల వీడియో వ్యవహారంలో పోలీసుల విచారణకు ఎటువంటి ఫిర్యాదు అవసరం లేదు. ఇటువంటి వీడియోలు బయటకు వచ్చినపుడు ఐపిసి సెక్షన్ 290 (పబ్లిక్ న్యూసెన్స్), 294 (ఎగ్జిబిషన్ ఆఫ్ అబ్ సీన్ యాక్ట్), 506 (క్రిమినల్ ఇంటిమినేషన్), 590 (ఎక్స్ పోజింగ్ అబ్ సీన్ ఆబ్జెక్ట్స్, అబ్ సీన్ వర్డ్స్ యాక్ట్ టు ఉమెన్), ఐటి సెక్షన్ కింద ప్రకారం సుమోటోగా కేసు నమోదుచేసి విచారణ జరపడం పోలీసు విధుల్లో భాగం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య చెప్పుకొచ్చారు.

సీఎం జగన్ కళ్లల్లో ఆనందం చూసేందుకేనా?

ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వ్యవహారం నాలుగుగోడల మధ్య జరిగినా లా ప్రకారం శిక్షార్హమే. ఫిర్యాదు చేయకపోతే ఏమీ చేయలేమని పోలీసులంతా దొంగమాటలు చెబుతున్నారు అని మండిపడ్డారు. పట్టాభిరామ్ రిపోర్టు తెచ్చారు కాబట్టి ఆ రిపోర్టు ఒరిజినల్ కాదని చెప్పించి సీఎం కళ్లలో ఆనందం చూడాలని సునీల్ కుమార్ తాపత్రయపడుతున్నారు. సునీల్ మీడియాకు ఇచ్చిన ఈ-మెయిల్ కాపీలో కూడా స్టాఫోర్డ్ ఎక్కడా ఆ నివేదిక అబద్దమని చెప్పలేదు. సునీల్ కుమార్ తన ప్రెస్‌మీట్‌లో థర్డ్ పర్సన్ రికార్డు చేశాడని చెబుతున్నారు.

అదే నిజమైతే సెకండ్ పర్సన్ అనుమతి లేకుండా రికార్డు చేయడం సాధ్యమేనా? ఫస్ట్ పర్సన్ వల్ల ఇబ్బందులు పడటం వల్లే సెకండ్ పర్సన్ అయిన ఆ మహిళ థర్డ్ పర్సన్‌తో వీడియో తీయించి విడుదల చేయించింది. జడ్జిలను తిట్టిన వారిని ఏడాదిన్నర విదేశాలనుంచి తీసుకురాలేని అసమర్థ అధికారి సునీల్ కుమార్‌కు ఇటువంటి వాటిపై అత్యుత్సాహం ఎందుకు? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ పోలీసులుగా మీ విధులను మీరు సక్రమంగా నిర్వర్తించండి... పనికిమాలిన ప్రభుత్వాన్ని కాపాడటానికి సిగ్గు విడిచి ప్రవర్తించవద్దు. వైసీపీలో మహిళా మంత్రులంతా కూడా దీనిపై సమాధానం చెప్పాలి.

పనికిమాలిన నికృష్టుడు, భ్రష్టుడైన ఎంపీ మాధవ్‌ను పోలీసులు కాపాడుతున్నారు. తనకు పుట్టిన కన్నకూతురును చంపిన వ్యక్తి గోరంట్ల మాధవ్. ఇలా మాట్లాడినందుకు రేపో,మాపో నాపై కూడా కేసు పెట్టినా ఆశ్చర్యం లేదు. అయితే సునీల్ కుమార్ భవిష్యత్తులో ఇబ్బందిపడటం ఖాయం. ఏమాత్రం ఆయనకు ఖాకీడ్రెస్ పై గౌరవం ఉన్నా వత్తిళ్లకు తలొగ్గకుండా ఆ పని తాను చేయలేనని సీఎంకి చెప్పి విఆర్ఎస్ తీసుకోవాలి. ఈ కేసులో సమగ్ర విచారణ జరిపితే సునీల్ కుమార్, ఫకీరప్పతో సహా వెనకేసుకొచ్చిన పోలీసు అధికారులంతా జైలుకెళ్లక తప్పదు అని వర్ల రామయ్య ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story