డిసెంబరు 12 నుంచి శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు

by Disha Web Desk 21 |
డిసెంబరు 12 నుంచి శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 12 నుండి 2024 జ‌న‌వ‌రి 5వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘సాధారణంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందుగా శ్రీవారి సన్నిధిలో దివ్యప్రబంధ అధ్యయనంగా పిలిచే ఈ అధ్యయనోత్సవం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను శ్రీవైష్ణవ జీయంగార్లు గోష్ఠిగానం చేస్తారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను 25 రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీవైష్ణవులు పారాయణం చేస్తారు. కాగా, తొలి 11 రోజులను పగల్‌పత్తు అని, మిగిలిన 10 రోజులను రాపత్తు అని వ్యవహరిస్తారు. 22వ రోజున కణ్ణినున్‌ శిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది, 24వ రోజున శ్రీవరాహస్వామివారి శాత్తుమోర, 25వ రోజున అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి’ అని టీటీడీ ప్రకటనలో స్పష్టం చేసింది.

Next Story

Most Viewed