Ycp: ఉదయగిరి నియోజకవర్గం ఇంచార్జిగా వంటేరు?

by Disha Web Desk 16 |
Ycp: ఉదయగిరి నియోజకవర్గం ఇంచార్జిగా వంటేరు?
X

దిశ, నెల్లూరు సిటీ: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక అధికార పార్టీలో చిచ్చురేపింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు నలుగురు ఓటు వేయడంతో ఆ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలో సునాయాసంగా గట్టెక్కింది.అధికార పార్టీలో ఆ నలుగురు ఎవరంటూ చర్చల మీద చర్చలు జరిగి చివరకు నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసినట్లు వైసీపీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై వైసీపీ అధిష్టానం సస్పెన్షన్ వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నెల్లూరు రూరల్, వెంకటగిరి నియోజకవర్గాల బాధ్యతలను ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిలకు అప్పగిస్తూ కొంత కాలం క్రితమే నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా ఉదయగిరి ఎమ్మెల్యే‌పై సస్పెన్షన్ వేటు వేయడంతో ఆ నియోజకవర్గానికి ఇంఛార్జిగా ఎవరిని నియమిస్తారని చర్చలు సాగుతుండగా కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది.

సజ్జలతో చర్చలు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార పార్టీలో రాజేసిన చిచ్చు ఇంకా చల్లారలేదు. ఉదయగిరి ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు వేయడంతో ఆ నియోజకవర్గానికి ఇన్చార్జిగా కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి పేరు పరిశీలనకు వచ్చినట్లు తెలిసింది. గత కొంతకాలంగా ఉదయగిరి నియోజకవర్గంలో వంటేరు వేణుగోపాల్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తూ వస్తున్నారు. కొంత కాలం క్రితమే వంటేరు వేణుగోపాల్ రెడ్డి‌కి వైసీపీ అధిష్టానం వచ్చే ఎన్నికల్లో ఉదయగిరి సీటు ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. వంటేరు వేణుగోపాల్ రెడ్డికి ఎంపీ అయోధ్యరామిరెడ్డి, మరో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తున్నట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలోనే శుక్రవారం నాడు వంటేరు వేణుగోపాల్ రెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో సుధీర్ఘంగా మంతనాలు జరిపినట్లు తెలిసింది. సజ్జల రామకృష్ణారెడ్డితో జరిగిన చర్చల ఫలితంగా ఉదయగిరి నియోజకవర్గం ఇంచార్జిగా వంటేరు వేణుగోపాల్ రెడ్డి పేరును రెండు, మూడు రోజుల్లో వైసీపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.



Next Story

Most Viewed