Mla Kotamreddy మరో కీలక నిర్ణయం... సీఎం జగన్‌పై కార్యచరణ ప్రకటన

by Disha Web Desk 16 |
Mla Kotamreddy మరో కీలక నిర్ణయం... సీఎం జగన్‌పై కార్యచరణ ప్రకటన
X

దిశ,డైనమిక్ బ్యూరో : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల్లో తన రూటే సెపరేటు అని నిరూపించుకున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పటికే అనేక కార్యక్రమాలతో ప్రజలతో మమేకమయ్యారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముందే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రతీ గడప గడపకు వెళ్లిన సంగతి తెలిసిందే. జగనన్న మాట..గడప గడపకు కోటంరెడ్డి బాట అనే కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లారు. అలాగే కార్యకర్తల ఆరోగ్యం కోసం ఇటీవలే ఆరోగ్య రక్ష అనే పథకాన్ని సైతం ప్రారంభించారు. అయితే ఇటీవల వైసీపీపై తిరుగుబాటు ఎగురవేశారు. దీంతో ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజల్లోకి మళ్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ప్రజా ఆశీస్సుల యాత్ర పేరుతో నిత్యం ప్రజల్లో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ యాత్రకు ముహూర్తం సైతం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ప్రజల్లోనే

అధికార పార్టీకి దూరమైన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బలపడటమే లక్ష్యంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ నుంచి ప్రజా ఆశీస్సుల యాత్రను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశమైన కోటంరెడ్డి ఈ యాత్రకు సంబంధించి పలు కీలక నిర్ణయాలను ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇకపోతే నెల్లూరు రూరల్‌ నియోజకవర్గానికి సంబంధించి వివిధ ప్రజా సమస్యలపై ఈనెల 25న ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నారు. అనంతరం మార్చిలో శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి జాతర కార్యక్రమం ముగిసిన వెంటనే ఈ సుదీర్ఘ యాత్రకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని 25వ డివిజన్ బుజబుజ నెల్లూరు నుంచి ఈ యాత్రను ప్రారంభించనున్నారు ప్రతి ఇంటికి వెళ్లి వారి బాగోగులు తెలుసుకోవడంతో పాటు వారి ఆశీస్సులను అందుకోవటమే లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగనుంది. దీర్ఘకాలిక ప్రణాళికను దృష్టిలో ఉంచుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరింత బలపడటమే లక్ష్యంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అడుగులు పడుతున్నాయి. సుదీర్ఘంగా 141 రోజులు పాటు ఈ యాత్ర కొనసాగేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed