సీఎం జగన్‌కు షాక్: విశాఖకు రాజధాని తరలింపుపై సుప్రీం కోర్టులో పిల్

by Disha Web Desk 21 |
సీఎం జగన్‌కు షాక్: విశాఖకు రాజధాని తరలింపుపై  సుప్రీం కోర్టులో పిల్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఈ ఏడాది నుంచే విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన సాగించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్‌ నాటికి విశాఖకు తరలివెళ్లనున్నట్టు ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ పర్యటనలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే తరుణంలో విశాఖ తరలింపునకు ఆలస్యంపై మండిపడ్డారు. తాను విశాఖకు తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని క్యాంపు కార్యాలయం ఏర్పాటు ఇతర భవనాల ఏర్పాటు ఆలస్యంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో వైసీపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. విశాఖపట్నంలోని రుషికొండపై ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. విజయవాడకు చెందిన లింగమనేని శివరామ ప్రసాద్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. రుషికొండలో సీఎం కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని పిటిషన్‌లో ఆరోపించారు.

రాజధానిగా విశాఖ సరికాదు

విశాఖపట్నం రాష్ట్ర రాజధానిగా ప్రకటించడంపై లింగమనేని శివరామ ప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజధానిగా విశాఖపట్నం కరెక్ట్ కాదని తన పిటిషన్‌లో అభిప్రాయపడ్డారు. రుషికొండ బంగాళాఖాతం పక్కనే ఉన్న కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) పరిధిలో ఉందని తెలిపారు. విశాఖపట్టణం పరిపాలన రాజధానిగా ప్రకటించడం సరికాదని.. ఇందుకు వాతావరణం కూడా సహకరించదని అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించిన పలు అంశాలను ఫిర్యాదులో ప్రస్తావించారు. రుషికొండపై నిర్మాణం, చట్టబద్ధతకు సంబంధించిన అంశం హైకోర్టులో విచారణలో ఉందని ఇలాంటి తరుణంలో రాజధాని తరలింపు అంటూ ప్రకటనలు చేయడం చట్ట విరుద్ధమన్నారు. 2011 నాటి సీఆర్‌జెడ్ నోటిఫికేషన్ రాజ్యాంగబద్ధత తుది విచారణ కోసం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు. సీఆర్‌జెడ్ పరిమితులు, అనుమతించదగిన కార్యకలాపాలు, ఎఫ్‌ఎస్‌ఐ సవరణల పరిధికి సంబంధించిన ప్రధాన సమస్యలపై తీర్పు వెల్లడించాల్సి ఉందని చెప్పుకొచ్చారు. ఇన్ని లీగల్ సమస్యలు ఉన్నప్పటికీ రుషికొండపై సీఎం క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించడం.. ఇందుకు జీవో కూడా జారీ చేయడంపై సవాల్ చేశారు.

తరలింపు నిలిపివేసేలా ఉత్తర్వులు ఇవ్వండి

రుషికొండపై సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలు అంశాలను తెరపైకి తీసుకువచ్చారు పిటిషననర్ లింగమనేని శివరామ ప్రసాద్. రుషికొండపై రిసార్ట్‌ నిర్మాణానికి మాత్రమే అనుమతి ఉందని..అలాంటి ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం దారుణమన్నారు. సీఎం క్యాంపు కార్యాలయం నిర్మాణానికి సంబంధించి అనుమతులు పొందామని చెప్పడం చట్ట విరుద్ధమన్నారు. అంతేకాదు హైకోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘించడమేనని అభిప్రాయపడ్డారు. రుషికొండలో సీఎం కార్యాలయాన్ని ఏర్పాటు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలువరించేలా తక్షణమే ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ లింగమనేని శివరామ ప్రసాద్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. అంతేకాదు రాజధాని తరలింపుపై స్టే ఇవ్వాలని కోరారు. రుషికొండపై నిర్మాణాలకు సంబంధించి హైకోర్టు, ఎన్‌జీటీల తీర్పు వెల్లడయ్యేంత వరకు ఎలాంటి నిర్మాణాలు జరపకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.ఇందుకు సంబంధించి ఉత్తర్వులు ఇవ్వాలని సుప్రీంకోర్టను కోరారు. ఇందుకు సంబంధించి పలు ఆధారాలను పిల్‌కు జతచేశారు. రుషికొండ నిర్మాణాలపై గతంలో సుప్రీం కోర్టు ఉత్తర్వుల కాపీని జత చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వనుందనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ అంశంపై ప్రభుత్వం సైతం ఎలా స్పందించబోతుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది.


Next Story