I-PAC Rayalaseema Survey: అధికార పార్టీ గెలుపుపై సంచలన విషయాలు

by Disha Web Desk 16 |
I-PAC Rayalaseema Survey: అధికార పార్టీ గెలుపుపై సంచలన విషయాలు
X

దిశ, అనంతపురం: రాయలసీమ (Rayala Seema) జిల్లాల్లో ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (I-PAC) బృందాలు సర్వే నిర్వహిస్తున్నాయి. ఆయా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల పని తీరు, వారికి ప్రజల్లో ఉన్న ఇమేజ్, కార్యకర్తలు,నాయకుల అభిప్రాయాలు, పాజిటివ్, నెగిటివ్ అభిప్రాయాలు ఎంత శాతం ఉన్నాయనే అంశాలపై ప్రాథమికంగా అంచనాకు వచ్చాయి. ఈ సర్వే రిపోర్టును సీఎం జగన్‌కు చేరవేశాయి.

వివిధ వర్గాలతో సమావేశం అవుతోన్న ఐప్యాక్ బృందాలు

మరోవైపు సీమ జిల్లాలోని మహిళలు, యువత, వృద్ధులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులను కలిసిన ఐప్యాక్ బృందాలు స్థానిక ఎమ్మెల్యేల పని తీరు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. 'స్థానిక ఎమ్మెల్యే పని తీరు ఎలా ఉంది?. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని వారు ఆయన వద్దకు వెళ్తే ఏ విధంగా స్పందిస్తున్నారు?. బాధితులు ఎవరైనా వెళ్తే ఏ విధంగా సమాధానం ఇస్తున్నారు?. స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారా లేదా?. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మీ ఇంటికి వచ్చారా లేదా?. ఆయన వచ్చినప్పుడు మీ స్పందన ఎలా ఉంది?. మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఆయన వద్ద ప్రస్తావించారా?. ఒకవేళ ప్రస్తావించి ఉంటే ఆయన దానికి ఏ రకమైన సమాధానం చెప్పారు?. అనంతరం మీ సమస్య పరిష్కారం అయ్యిందా లేదా?. ఆఖరుగా స్థానిక ఎమ్మెల్యే పని తీరుపై మీ అభిప్రాయం నిరభ్యంతరంగా చెప్పండి.' అని వారి నుంచి సమాధానాలు రాబట్టినట్లు సమాచారం. ఇలా రాయలసీమలోని నియోజకవర్గాల్లో ప్రాథమికంగా సర్వే చేసి ఆ నివేదికను ముఖ్యమంత్రికి అందజేసినట్లు తెలిసింది. దీంతో పాటు జిల్లాలో వైసీపీ పట్ల సానుభూతిగా ఉన్న మీడియా బృందాలతో సైతం సమావేశాలు నిర్వహించినట్లు తెలిసింది. ఆయా గ్రామాలు, మండలం, నియోజకవర్గం, జిల్లా వ్యాప్తంగా నెలకొన్న సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలు, ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరు, లబ్ధిదారుల అభిప్రాయాలు, ప్రభుత్వ పాలన, స్థానిక ఎమ్మెల్యేల పాలన, పాత్ర పై మీడియా బృందాల నుంచి సమాచారం సేకరించినట్లుగా తెలిసింది.

అధికార పార్టీ నాయకుల్లో మొదలైన గుబులు

ఐప్యాక్ బృందాలు సర్వే రిపోర్టు జగన్‌కు చేరిన తర్వాత ఎమ్మెల్యేల్లో గుబులు మొదలైనట్లు తెలిసింది. నియోజకవర్గాల్లో తమ పని తీరుపై ఏ మేరకు సీఎంకి నివేదిక అందిందోనన్న ఆందోళనతో వారు తికమక పడుతున్నట్లు సమాచారం. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో మరో నలుగురు ఎమ్మెల్యేల పని తీరుపై వ్యతిరేకత ఉన్నట్లుగా సమాచారం. ఇక సీఎం సొంత జిల్లా అయిన ఉమ్మడి కడప జిల్లాలో సైతం ఒకటి, రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పని తీరుపై ప్రజలు వ్యతిరేకతతో ఉన్నట్టుగా తెలిసింది. దీంతో పాటు రాయలసీమ జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాలలో పార్టీ క్యాడర్ పూర్తి అసంతృప్తితో రగిలిపోతున్నట్లు ఐప్యాక్ బృందం సర్వే నివేదికలో వెల్లడించినట్లు సమాచారం. తమ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తమకు ఏ రకంగానూ లబ్ధి చేకూరాలేదన్నది వారి వాదనగా ఉన్నట్లు సమాచారం. అయితే ఎమ్మెల్యేలు మాత్రం ఆర్థికంగా బలోపేతం అయినట్లు ఉదాహరణలతో సహా ఐ ప్యాక్ బృందం సభ్యులకు వివరించినట్లుగా తెలిసింది. క్షేత్రస్థాయిలో తమ పట్ల పార్టీ అధిష్టానం చిన్నచూపు చూస్తోందని వారు ఆరోపించినట్లుగా సమాచారం. ఇలా పార్టీ క్యాడర్ నుంచి వస్తున్న వ్యతిరేకత, ప్రజల్లో నెలకొన్న అసంతృప్తుల నేపథ్యంలో ఎమ్మెల్యేల్లో గుబులు మొదలైనట్లుగా తెలిసింది.

ఐ ప్యాక్ సలహాతోనే నియోజకవర్గ సమీక్ష సమావేశాలు

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు, పార్టీ క్యాడర్‌లో ఉన్న అసంతృప్తి, వ్యతిరేకతను గుర్తించి ఐప్యాక్ బృందం ఇచ్చిన నివేదికపై ఆధారపడి పార్టీ అధిష్టానం నియోజకవర్గ సమీక్ష సమావేశాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. ఆయా నియోజకవర్గాలలో పార్టీ ఎమ్మెల్యేల పని తీరును మరింత మెరుగుపరిచేలా, చాలా వ్యతిరేకత ఉన్న వారు వారి పని తీరును మార్చుకునేలా చేయడానికి నియోజకవర్గ సమీక్ష సమావేశాలను ఉపయోగించుకోనున్నట్లు సమాచారం. ఇలా ఆయా నియోజకవర్గ సమీక్ష సమావేశాల్లో ఎమ్మెల్యే పని తీరు, పార్టీ క్యాడర్‌లో ఉన్న అసంతృప్తి, వ్యతిరేకతలను గుర్తించి వారిని దారిలోకి తెచ్చేందుకే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిసింది. దీంతోపాటు రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రజల్లో పార్టీ పట్ల వ్యతిరేకత ప్రబలకుండా, పార్టీ క్యాడర్‌లో అసంతృప్తి, వ్యతిరేకత బయటకు పొక్కకుండా ఉండేలా చూసేందుకు పక్కా ప్రణాళికను రూపొందిస్తున్నట్లు సమాచారం. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐప్యాక్ బృందాలు సైతం ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి వాటికి తగిన పరిష్కారాలు చూపేలా దిశా నిర్దేశం చేయనున్నట్లు సమాచారం. అందుకు వీలైతే మూడు నెలలకు ఒకసారి లేదంటే ప్రతినెలా సమీక్ష సమావేశాలు నిర్వహించడం, ప్రజల్లో విస్తృతంగా తిరిగి సమాచారం సేకరించడంలాంటివి చేయనున్నట్లు తెలిసింది. ఏది ఏమైనప్పటికీ రానున్న ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపు అంత సులభంగా లేదని ప్రాథమికంగా ఐప్యాక్ నిర్వహించిన సర్వేలో స్పష్టం అయినట్లుగా సమాచారం. దీంతో అధిష్టానం క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతం కోసం అన్ని అవకాశాలను ఉపయోగించుకోనున్నట్లు తెలిసింది.

ఇవి కూడా చదవండి : Nellore రెడ్లకు అనిల్ కుమార్ చెక్ పెట్టగలరా?



Next Story

Most Viewed