AP News: రాష్ట్రానికి కొత్త సీఎస్.. రేపే బాధ్యతల స్వీకరణ!

by Disha Web Desk 2 |
AP News: రాష్ట్రానికి కొత్త సీఎస్.. రేపే బాధ్యతల స్వీకరణ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి డా.కేఎస్ జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలన(పొలిటికల్) ముఖ్యకార్యదర్శి ఆర్.ముత్యాలరాజు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత సీఎస్ డా.సమీర్ శర్మ పదవీకాలం ఈనెల 30తో ముగియనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో డా.కేఎస్ జవహర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన జవహర్ రెడ్డి ప్రస్తుతం సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పనిచేస్తు్న్నారు. డా. సమీర్ శర్మ పదవీ విరమణ నేపథ్యంలో ప్రభుత్వం నూతన సీఎస్‌ ఎంపిక సమయంపై పెద్ద కసరత్తే చేసింది. సీనియారిటీ జాబితాలో నీరబ్ కుమార్ ప్రసాద్, పూనం మాలకొండయ్య, కరికాల్ వలెవన్‌తో పాటు, గిరిధర్ అరమనే, డా.కేఎస్ జవహర్ రెడ్డి, వై శ్రీలక్ష్మి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. అయితే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చివరకు కేఎస్ జవహర్ రెడ్డివైపే మెుగ్గు చూపారు. ఇకపోతే రేపు సీఎస్‌గా కేఎస్ జవహర్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇకపోతే సీఎస్‌గా జవహర్ రెడ్డి జూన్ 2024 వరకు కొనసాగనున్నారు.

సీఎంవోలోకి పూనం మాలకొండయ్య

సీఎస్‌గా డా.కేఎస్ జవహర్ రెడ్డిని నియమిస్తూనే పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రేసులో ఉన్న పూనం మాల కొండయ్యను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమెను ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ)లోకి తీసుకుంది. సీఎం స్పెషల్‌ సీఎస్‌గా నియమించింది. అలాగే వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా మధుసూదన రెడ్డిని నియమించింది. వ్యవసాయశాఖ కమిషనర్‌గా రాహుల్ పాండే నియమితులయ్యారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న బుడితి రాజశేఖర్‌ను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. తాజాగా ప్రవీణ్ ప్రకాశ్‌కు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించింది.వీటితోపాటు రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రద్యుమ్నను ప్రభుత్వం నియమించింది.

కీలక బాధ్యతలు

సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన డా.కేఎస్ జవహర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కీలక బాధ్యతలు చేపట్టారు. తొలుత వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా బదిలీ అయ్యారు. టీటీడీ ఈవోగా పనిచేస్తూనే సీఎంవోలోకి బదిలీ అయ్యారు. కొన్ని నెలలపాటు రెండు బాధ్యతలను సైతం చేపట్టారు. ఇకపోతే కేఎస్ జవహర్ రెడ్డి జూన్ 2024 వరకు సీఎస్‌గా కొనసాగనున్నారు. అంటే కేఎస్ జవహర్ రెడ్డి సీఎస్‌గా ఉండగానే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.


Next Story

Most Viewed