తగ్గేదేలే.. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు: సజ్జల రామకృష్ణారెడ్డి

by Web Desk |
తగ్గేదేలే.. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు: సజ్జల రామకృష్ణారెడ్డి
X

దిశ, ఏపీ బ్యూరో : ప్రభుత్వం పిలిచినా ఉద్యోగులు చర్చలకు రాకపోవడం సరికాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పుకొచ్చారు. గురువారం చర్చలకు ఆహ్వానించిన హాజరుకాలేదని.. శుక్రవారం కూడా సచివాలయంలో అందుబాటులో ఉన్నా పీఆర్‌సీ సాధన కమిటీ వాళ్ళు చర్చలకు రాలేదని చెప్పుకొచ్చారు. అయితే తమ పిలుపు మేరకు గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం నాయకులు చర్చలకు హాజరయ్యారని తెలిపారు. ఫోరం ప్రతినిధులతో మంత్రుల కమిటీ సభ్యులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు.

ఉద్యోగుల సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రుల కమిటీ దృష్టికి గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం పలు సమస్యలను తీసుకెళ్లింది. అయితే ఆ సమస్యలను నోట్ చేసుకున్నామని వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పుకొచ్చారు. చర్చలకు ఎవరు వచ్చినా మాట్లాడేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఉద్యోగులు ప్రభుత్వంలో అంతర్భాగమేనని, ఉద్యోగులు, ప్రభుత్వం వేరు కాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.

కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు

పాత జీతాలు వేయాలని ఉద్యోగులంతా రోడ్లపైకి వచ్చి పోరాటం చేస్తున్నా ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు జనవరి నెల వేతనాలు చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. జనవరి నెల జీతాలు చూసి సాలరీ పెరిగిందో లేదో తెలుస్తుందని అప్పుడు ఉద్యోగ సంఘాలు ప్రశ్నించాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలకు, ఉద్యోగ సంఘం నాయకులు పెట్టిన మూడు డిమాండ్లకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ముఖ్యమైన హెచ్ఆర్ఏ సవరణ అంశాన్ని ఉద్యోగ సంఘాలు ప్రస్తావించటం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.

Next Story

Most Viewed