Cm Jagan తో Adani భేటీ.. ఏ అంశాలపై చర్చించారనేది గుంభనం!

by Disha Web Desk 9 |
Cm Jagan  తో Adani భేటీ.. ఏ అంశాలపై చర్చించారనేది గుంభనం!
X

దిశ, ఏపీ బ్యూరో: సీఎం జగన్‌తో ప్రముఖ వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. గురువారం అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి వచ్చారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఆదానీ నేరుగా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. జగన్ తో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. సీఎం ఇంట్లోనే జగన్‌తో కలిసి అదానీ డిన్నర్‌లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో అదానీతో సీఎం డిన్నర్ రాజకీయ వర్గాల్లో చర్చనీయంశమైంది.

కేంద్రం మౌనం వెనుక ఆంతర్యమేమిటి ?

రాష్ట్రంలో ఈపాటికే అదానీకి కోట్ల విలువ చేసే ప్రాజెక్టులు కట్టబెట్టారు. పంప్డ్​ హైడ్రో స్టోరేజీ పవర్​ ప్రాజెక్టు, విశాఖలో డేటా సెంటర్​ను కేటాయించింది. ఇదంతా ప్రధాని మోడీతో అనుబంధం వల్లే సాధ్యమైంది. అదానీ కంపెనీల్లోకి రూ.20 వేల కోట్ల పెట్టుబడులు ఎలా వచ్చాయని కాంగ్రెస్​ యువనేత రాహుల్​ గాంధీ దుమ్మెత్తి పోస్తున్నారు. చట్టసభల్లో, బయటా నిలదీస్తున్నారు. దీనిపై విచారణకు జాయింట్​ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్​ చేస్తున్నా ఎన్డీయే సర్కారు పట్టించుకోలేదు. ఇందులో లోపాలున్నాయని సెబీ విచారణ అనంతరం నివేదిక ఇచ్చినా కేంద్ర సర్కారు మౌనం వహించింది.

ఎవరితో ఎవరు పొత్తు ?

ఓవైపు బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు కుదురుతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇలాంటి సమయంలో అత్యవసరంగా అదానీ సీఎం జగన్​తో భేటీ కావడం పలు చర్చలకు తావిస్తోంది. ఈపాటికే ఖారారైన ప్రాజెక్టుల గురించా.. లేక ఇంకేమైనా కొత్త ప్రాజెక్టులను ఇవ్వబోతున్నారా అనేది సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. కేంద్ర పెద్దలు టీడీపీతో పొత్తుకు సిద్దమైతే తమతో సంబంధాలు, ఇతర ఆర్థిక అంశాలపై ప్రస్తావించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి : సీఎం జగన్‌తో గౌతమ్ అదానీ భేటీ వెనుక మర్మమేంటి? : సీపీఐ రామకృష్ణ


Next Story