ఎన్నికల వేళ రాయలసీమలో కొత్త ట్విస్ట్.. పోటీకి సిద్ధమవుతున్న స్టీరింగ్ కమిటీ!

by Disha Web Desk 2 |
ఎన్నికల వేళ రాయలసీమలో కొత్త ట్విస్ట్.. పోటీకి సిద్ధమవుతున్న స్టీరింగ్ కమిటీ!
X

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాయలసీమ స్టీరింగ్ కమిటీ సన్నద్ధమౌతున్నదా! చలో ఢిల్లీ కార్యక్రమం తర్వాత స్తబ్ధుగా ఉన్న కమిటీ ఊహించని విధంగా ట్విస్టు ఇచ్చేందుకు పావులు కదుపుతున్నదా! మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి సారథ్యంలో ఈ కమిటీ ముందుకెళుతున్నదా? బైరెడ్డి టీడీపీలో చేరితే పరిస్థితి ఏంటి? ఆయన నాయకత్వంలోనే కమిటీ పని చేస్తుందా.. అన్న ప్రశ్నలు రాయలసీమ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒకవైపు బైరెడ్డి టీడీపీలో చేరితే ఎంపీ టికెట్ ఖాయమనే వార్తలు విన్పిస్తుండగా మరోవైపు బైరెడ్డి సారథ్యంలో స్టీరింగ్ కమిటీ రాయలసీమలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు కసరత్తు చేస్తున్నదనే వార్తలు జోరందుకున్నాయి.

దిశ, కర్నూలు ప్రతినిధి: రాయలసీమలోని కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో 52 అసెంబ్లీ నియోజకవర్గాలు, 8 పార్లమెంట్ స్థానాలున్నాయి. అధికార, ప్రతి పక్షాలకు దీటుగా ఈ స్థానాల్లో పోటీ చేసేందుకు రాయలసీమ స్టీరింగ్ కమిటీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నదనే వార్తలు విన్పిస్తున్నాయి. సీమ అభివృద్ధి, నీళ్లు, నిధులు, నియామకాలే అజెండాగా స్టీరింగ్ కమిటీ అడుగులు వేయనుంది. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి నాయకత్వంలో ప్రత్యేక రాయలసీమ నినాదాన్ని నాయకులు నలుదిశలా బలంగా విన్పించారు. ఉమ్మడి ఏపీ రాజకీయాలను శాసించి.. తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న బైరెడ్డి ఉద్యమ బాట పట్టి పలు కార్యక్రమాలతో సీమ వాసులను చైతన్యం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఉద్యమాలకు ఊపిరి పోశారు. దాదాపు 10 వేల మందితో ఢిల్లీలో ధర్నా చేపట్టి సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత టీడీపీలో చేరతారనే వార్తలు విన్పించాయి.

ఎన్నో సందేహాలు..

బైరెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు టీడీపీ అధిష్టానం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు అరెస్టుతో చేరిక ఆలస్యమైంది. ప్రస్తుతం చంద్రబాబు బెయిలుపై విడుదలై వివిధ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ బలమైన నేతలను రంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పిడుగులాంటి వార్త బహిర్గతం కావడంతో అటు అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు ఇటు బైరెడ్డి అనుచరులు గందరగోళంలో పడ్డారు. బైరెడ్డి నాయకత్వంలో స్టీరింగ్ కమిటీ పనిచేస్తే ఆయనను టీడీపీ అధిష్టానం పార్టీలోకి ఆహ్వానిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమౌతుండగా.. బైరెడ్డి లేకుండానే స్టీరింగ్ కమిటీ నాయకులు పోటీ చేయనున్నారా? బైరెడ్డి నాయకత్వంలో కమిటీ పోటీకి దిగనుందా? అనే విషయాలపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత రానుంది.

అన్ని స్థానాల్లో పోటీకి సై..

రాయలసీమ జిల్లాల్లోని 52 నియోజకవర్గాలు, 8 పార్లమెంట్ స్థానాల్లో రాయలసీమ స్టీరింగ్ కమిటీ అధికార, ప్రతిపక్షాలకు దీటుగా పోటీ చేయనుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు రానున్న ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించేందుకు స్టీరింగ్ కమిటీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రాయలసీమలోని మంత్రాలయంలో నవీన్, పీలేరులో శ్రీకాంత్, నంద్యాలలో అభిరుచి మధు, కమలాపురంలో రామ్మోహన్ రెడ్డి పేర్లు విన్పిస్తున్నాయి. వీరితో పాటు తిరుపతి, మదనపల్లి, ప్రాద్దుటూరు, తాడిపత్రి, పుట్టపర్తి, అనంతపురం, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, డోన్, నందికొట్కూరు, శ్రీశైలం, నంద్యాల, పాణ్యం, బనగానపల్లె అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలో దించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం, చిత్తూరు పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రచారం ప్రారంభం..

ఇప్పటికే నందికొట్కూరు, పాణ్యం, కర్నూలు, మంత్రాలయం, ఆదోని, తిరుపతి, పీలేరు, కోడుమూరు, ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో అభ్యర్థులు ప్రచారం మొదలుపెట్టారు. రాయలసీమ అభివృద్దే ప్రధాన ధ్యేయంగా అభ్యర్థులు ప్రచారం చేస్తూ అసెంబ్లీ, పార్లమెంట్ వేదికల్లో రాయలసీమకు నీళ్లు, నిధులు, నియామకాల కోసం గళం విప్పే స్టీరింగ్ కమిటీ అభ్యర్థులను ఎన్నుకోవాలని సీమ ప్రజలను చైతన్యం చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

పోటీ వార్తల వెనుక వ్యూహం ఇదేనా?

వైసీపీని దీటుగా ఎదుర్కొని గద్దె దించేందుకు టీడీపీ-జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. రాష్ర్ట వ్యాప్తంగా జనసేనకు కొన్ని సీట్లు కేటాయించాల్సి ఉండగా అధిక స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. అలాగే రాయలసీమ జిల్లాల్లో రాయలసీమ స్టీరింగ్ కమిటీ పోటీ చేయనుందనే ప్రచారం జోరందుకోవడంతో వీరు కూడా ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుని సీట్లు ఆశించే అవకాశం ఉందా.. అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. బైరెడ్డి త్వరలో టీడీపీలో చేరతారని ఆయన అనుచరులు చెబుతుండగా స్టీరింగ్ కమిటీ పోటీ విషయం తెరపైకి రావడం నేతలను ఇరకాటంలోకి నెట్టినట్లయింది. ఈ కమిటీలో వివిధ పార్టీలకు చెందిన నాయకులున్నారు. ఆ పార్టీలో సీటు రాకుంటే స్టీరింగ్ కమిటీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కమిటీ నాయకులు పక్కా వ్యూహంతో ఉన్నారా ? లేక ట్విస్టు ఇచ్చేందుకు ఇలా చేస్తున్నారా ? అనుమానాలు లేకపోలేదు. వీటన్నిటికీ మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని కమిటీ ముఖ్య నాయకులు చెబుతున్నారు.

Next Story

Most Viewed