దర్శిపై తనయుల గురి.. క్యూలో ప్రణీత్, విక్రాంత్, రాఘవరెడ్డి

by Disha Web Desk 16 |
దర్శిపై తనయుల గురి.. క్యూలో ప్రణీత్, విక్రాంత్, రాఘవరెడ్డి
X

దిశ, దక్షిణ కోస్తా: ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో పలు రాజకీయ ఊహాగానాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుత సిట్టింగ్​ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌కు​మళ్లీ టిక్కెట్​ఇస్తారా?.. ఆయన వైసీపీలోనే కొనసాగుతారా..? పార్టీ మారతారా అనే ప్రశ్నలు నియోజకవర్గ ప్రజల్నే కాదు. జిల్లా రాజకీయ వర్గాల్లోనూ పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. ఒకవేళ మద్దిశెట్టి తప్పుకుంటే ఇక్కడ నుంచి బరిలో దిగేందుకు పార్టీ సీనియర్​నేతల తనయుళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కుటుంబానిదే హవా. వాళ్లను కాదని మరొకరు నెగ్గుకు రావడం కష్టం. ఈదఫా సుబ్బారెడ్డి కుమారుడు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి కూడా సై అంటున్నారు. దీంతో వైసీపీ నిర్ణయం ఇక్కడ ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా చర్చనీయాంశమైంది.

వైసీపీలో జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న మాజీమంత్రి బాలినేని తనయుడు ప్రణీత్​రెడ్డిని ఆరంగేట్రం చేయించాలని వాళ్ల కుటుంబం కృత నిశ్చయంతో ఉంది. ఒంగోలు నుంచి బాలినేని పోటీ చేస్తే మరో నియోజకవర్గం నుంచి ప్రణీత్‌ను రంగంలోకి దించాలని భావిస్తున్నారు. అలాగే ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు రాఘవరెడ్డిని ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. దర్శి, గిద్దలూరు, మార్కాపురంలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి సీటు కోసం అడగాలనుకుంటున్నారు. మాగుంట తనయుడ్ని ఎన్నికల బరిలో ఉంటాడని స్వయంగా శ్రీనివాసుల రెడ్డి గతంలో ప్రకటించారు. మరోవైపు టీటీడీ చైర్మన్​ వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్​రెడ్డి కూడా దర్శిపై ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఈసారికి వారసులు వద్దని సీఎం జగన్​చాలా స్పష్టంగా ప్రకటించారు. అయినా రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్​ నేతల వారసులు మాత్రం ఎక్కడా తగ్గేదే లేదన్నట్లు దూసుకుపోతున్నారు.

ఎస్సీలు, రెడ్ల ఓట్లే అధికం..

దర్శిపై సీనియర్​నేతల తనయుల ఆసక్తికి ప్రధాన కారణం రెడ్ల ఓట్లు అధికంగా ఉండడమే. సుమారు 40 నుంచి 45 వేలుంటాయి. ఎస్సీ ఎస్టీ ఓటర్లు 40 వేల దాకా ఉండొచ్చు. సుమారు 30 వేల ఓట్లతో తర్వాత స్థానంలో కమ్మ సామాజిక వర్గం ఉంటుంది. మరో 25 వేల కాపుల ఓట్లు ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములను శాసిస్తుంటాయి. సుమారు 20 వేలకు పైగా యాదవుల ఓట్లున్నాయి. 2004లో ఇక్కడ నుంచి బూచేపల్లి సుబ్బారెడ్డికి నాడు కాంగ్రెస్‌లో సీటు దక్కకున్నా స్వతంత్ర అభ్యర్థిగా నిలిచి సత్తా చాటారు. గెల్చిన తర్వాత పార్టీలో చేరారు. తర్వాత 2009లో ఆయన తనయుడు బూచేపల్లి శివప్రసాదరెడ్డి గెలిచి వారసత్వాన్ని కొనసాగించారు.

బూచేపల్లి పోటీకి సిద్ధమంటే ఎలా !

2014 ఎన్నికల్లో ప్రతీ విషయానికీ రెడ్ల ఆధిపత్యం ఎక్కువైందనే ప్రచారంతో టీడీపీ అభ్యర్థి శిద్దా రాఘవరావు విజయం సాధించారు. 2019లో మళ్లీ వైసీపీ నుంచి బూచేపల్లి శివప్రసాదరెడ్డి పోటీ చేయాల్సింది. నాడు తండ్రి సుబ్బారెడ్డి అనారోగ్యం, ఇతర కుటుంబ సమస్యల వల్ల ఆయన మొగ్గు చూపలేదు. దీంతో ఆయన మద్దతునిచ్చి మద్దిశెట్టి వేణుగోపాల్‌ను గెలిపించారు. 2024 మాత్రం తిరిగి శివప్రసాదరెడ్డి పోటీ చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇక్కడ బయట నుంచి వచ్చిన నేతలకు బూచేపల్లి కుటుంబం మద్దతునిస్తేనే గెలుపు సాధ్యమవుతుందనేది స్పష్టం. ఇంకోవైపు వివిధ సామాజిక వర్గాలకు సీట్ల పంపకంలో భాగంగా టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావును పోటీకి దించే అవకాశం కూడా లేకపోలేదు. మరి పార్టీ సీనియర్​నేతల కుమారుల ఆశలు ఫలిస్తాయా లేదా అనేది జిల్లా వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.


Next Story

Most Viewed