జగ్గంపేట.. ఎవరి కోట

by Dishanational2 |
జగ్గంపేట.. ఎవరి కోట
X

దిశ, జగ్గంపేట: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మెట్ట ప్రాంతంగానూ, రాజకీయ ఉద్ధండుల కోటగానూ పేరుగాంచిన జగ్గంపేట నియోజకవర్గంలో రాజకీయం ఊపందుకుంది. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది గడువు ఉండగానే ప్రధాన రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రతి రోజూ పర్యటన పేరుతో ప్రజలతో మమేకమయ్యేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో జగ్గంపేట రాజకీయం ఉక్కసారిగా వేడెక్కింది.

ఆది నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన రెండు కుటుంబాల నడుమ జగ్గంపేటలో రాజకీయ పోరు కొనసాగుతోంది. తాజాగా మారుతున్న కాలాన్ని బట్టి పెరుగుతున్న రాజకీయ పార్టీల తాకిడితో మెట్ట ప్రాంతంలో పోటీ చేసేందుకు కొత్త ముఖాలు సైతం రంగంలోకి దిగుతున్నారు. మెట్ట ప్రాంతంగా పిలవబడే జగ్గంపేటలో ఆది నుంచి పంతం, తోట, జ్యోతుల కుటుంబాల నడుమ రాజకీయ పోరు కొనసాగుతోంది. ఈ మూడు కుటుంబాలకు ఉభయ గోదావరి జిల్లాలోని అన్ని పార్టీల నాయకులతో కుటుంబ బాంధవ్యాలు పెనవేసుకుని ఉన్నాయి. దీంతో రాజకీయంగా ప్రధాన పార్టీలు ఆయా కుటుంబాలను కాదని గత ఐదు దశాబ్దాలుగా మరొకరికి ప్రాతినిధ్యం కల్పించిన దాఖలాలు లేవు. తాజాగా కొత్త పార్టీలు ఎన్నికల బరిలోకి దిగడంతో ఆయా కుటుంబాలకు దగ్గర బంధువులే ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు.

నిత్యం ప్రజల్లో టీడీపీ

ఇక్కడ ప్రస్తుత శాసనసభ్యుడిగా వైసీపీ నుంచి జ్యోతుల చంటిబాబు ఎన్నికయ్యారు. ఈయన రాజకీయ సీనియర్ రాజకీయ నేత జ్యోతుల నెహ్రూపై పోటీ చేసి గెలుపొందారు. మూడు దశాబ్దాలపాటు రాజకీయాల్లో ఆరితేరిన జ్యోతుల నెహ్రూ జగ్గంపేట సెగ్మెంట్లో ప్రతిపక్ష పార్టీ నేతగా రాజకీయ చదరంగంలో పావులు కదుపుతున్నారు. ఇబ్బడి ముబ్బడి సంక్షేమ పథకాలతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జగనన్న పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్లించే విధంగా జ్యోతుల నెహ్రూ జగ్గంపేటలో ఏదో ఒక కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇలా తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహాలు అమలు చేస్తున్నారు.

సంక్షేమ పథకాలపైనే వైసీపీ గురి

గడప గడపకు మన ప్రభుత్వం పేరిట స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వివరిస్తున్నారు. జగనన్న పాలనకు మరో మారు పట్టం కట్టాలని జ్యోతుల చంటిబాబు ప్రచారం చేస్తున్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, ఇవే మళ్లీ వైసీపీని గెలిపిస్తాయని ఎమ్మెల్యే విశ్వసిస్తున్నారు.

ఆశలు పెట్టుకున్న జనసేన

ప్రధాన తెలుగుదేశం, వైసీపీలతోపాటు సమాంతరంగా జనసేన పార్టీ పావులు కదుపుతోంది. జగ్గంపేట ఇన్చార్జి పాఠంశెట్టి సూర్యచంద్ర ఏడాది కాలంగా భార్యతో కలిసి ప్రతి రోజూ గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఒక దఫా మొక్కల పంపిణీ అంటూ, మరో దఫా పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసు పంపిణీ అంటూ నిత్యం ప్రజల్లోనే ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. జగ్గంపేటలో జనసేన పోటీ ఖాయమని, పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయాలని కోరుతున్నారు.

ఎవరికి వారే ధీమా..

అధికార పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుని కాదని, వేరే వారికి టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని, అదే జరిగితే జ్యోతుల కుటుంబాలు ఏకమై జగ్గంపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జనసేన పొత్తులో భాగంగా జగ్గంపేట సీటు టీడీపీకి కేటాయిస్తే ఏడాదిగా ప్రజల్లో తిరుగుతున్న సూర్యచంద్ర పార్టీని వదిలి.. ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశముందని, ఇది తెలుగుదేశం పార్టీకి నష్టం చేకూరుస్తుందని అంటున్నారు. ఎవరికి వారే ఆయా పార్టీల పట్ల మెట్టలో రాజకీయంగా ఉన్న కుటుంబ బంధుత్వాలను ప్రదర్శించి తద్వారా జగ్గంపేట రాజకీయ యవనికలో ఒక వెలుగు వెలగాలని ఆశిస్తూ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆశల పల్లకిలో ఊరేగుతున్న నేతల భవిష్యత్ నిర్దేశించే ఓటర్లు మాత్రం గుంభనంగా ఉన్నారు.



Next Story