రాహుల్ గాంధీపై ప్రధాని మోడీ కక్ష సాధింపు: పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు

by Disha Web Desk 7 |
రాహుల్ గాంధీపై ప్రధాని మోడీ కక్ష సాధింపు: పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు
X

దిశ, డైనమిక్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాన్య ప్రజానీకంపై పన్నుల భారం వేయడాన్ని నిరసిస్తూ పోస్టుకార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా విజయవాడలోని ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన ఈ పోస్టుకార్డు ఉద్యమాన్ని ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి, ఏఐసీసీ కార్యదర్శులు సీడీ మెయ్యప్పన్, ఎం క్రిస్టోఫర్ తిలక్, పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, సుంకరపద్మశ్రీలు ప్రారంభించారు.

ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై విపరీతమైన పన్నుల భారం మోపుతుందని ఆరోపించారు. పేదల నడ్డి విరుస్తూ దేశ సంపదను అదానీ కంపెనీలకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. మరోవైపు రాహుల్ గాంధీ విషయంలో ప్రధాని మోడీ కక్ష సాధింపు ‌చర్యలను దేశ ప్రజలంతా తప్పు పడుతుందని చెప్పుకొచ్చారు. అదానీ, మోడీల బంధం నిజం‌ కాదా అని ప్రశ్నించారు. ప్రపంచ ధనికుల్లో రెండో స్థానంలోకి అదానీ ఎలా వచ్చారని నిలదీశారు.

నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలకు అదానీ సౌకర్యాలు సమకూరుస్తున్నారని అందుకే దేశవిదేశాల్లో కూడా కాంట్రాక్టులు అదానీకే కట్టబెడుతున్నారని ఆరోపించారు. వారి అక్రమాలను ప్రశ్నించే ‌వారిపై వ్యవస్థలతో దాడి‌చేయిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ, ఈడీ, న్యాయ స్థానాలను అడ్డం పెట్టుకుని ఇబ్బంది పెడుతున్నారని.. ఎప్పుడో మాట్లాడిన మాటలను సాకుగా చూపి శిక్ష వేయించారని ధ్వజమెత్తారు. అనర్హత వెనుక రాజకీయ కుట్ర ఉందన్న విషయం అందరికీ అర్ధమైందని స్పష్టం చేశారు. ఈ పోస్టు కార్డు ఉద్యమం ద్వారా దేశ ప్రజలందరినీ ఏకం‌ చేస్తామని... నెల రోజుల పాటు వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు.



Next Story

Most Viewed