చంద్రబాబు ను సీఎం చేయడమే మా లక్ష్యం-పరిటాల సునీత

by Disha Web Desk 18 |
చంద్రబాబు ను సీఎం చేయడమే మా లక్ష్యం-పరిటాల సునీత
X

దిశ,రాప్తాడు:మా కుటుంబానికి ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఎదురైనా..మా ప్రయాణం టీడీపీతో నేనని, చంద్రబాబును సీఎం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని మాజీ మంత్రి పరిటాల సునీత స్పష్టం చేశారు.రాప్తాడు లో జరిగిన ప్రజాగళం సభలో ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మేలు చేశారని గుర్తు చేశారు.ముఖ్యంగా పేరూరు ప్రాజెక్టుకు రూ.804 కోట్లు విడుదల చేశారు.అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టేశారు.కనీసం రైతులకు పరిహారం కూడా ఇవ్వలేదు.టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా రైతులకు న్యాయం చేస్తామన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి రాప్తాడు వేదికగా లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని, అలా చేయకపోతే మీసం తీయించుకుంటానని సవాల్ చేశారని,ఇప్పుడు ప్రకాష్ రెడ్డి దానికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.ఈ ప్రభుత్వంలో ఒక రాప్తాడు నియోజకవర్గంలో మూడు వేలకు పైగా కేసులు పెట్టారని. అయినా పార్టీ శ్రేణులు ఎక్కడ వెనక్కి తగ్గకుండా పని చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరుల అవినీతి వలన అభివృద్ధి ఆమడ దూరం పోయిందని విమర్శించారు.

జాకీ పరిశ్రమ ఏర్పాటుకు రూ.15 కోట్లు డిమాండ్ చేయడంతో తెలంగాణకు తరలిపోయిందన్నారు. రాక్రీడ్ సంస్థ ద్వారా ఇళ్లు నిర్మిస్తామని..సుమారు రూ.200 కోట్ల వరకు అక్రమాలకు పాల్పడి పేదలకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. 2019 ఎన్నికలకు ముందు ప్రకాష్ రెడ్డి తన పరిస్థితి బాగాలేదని ఈసారి ఎన్నికల్లో గెలవకపోతే నా ఫోటోకు దండ వేయాలంటూ సానుభూతి మాటలు మాట్లాడారని ఆ ఎన్నికల్లో వైసీపీ నాయకులు కష్టపడి గెలిపిస్తే వారిని దారుణంగా మోసం చేశాడన్నారు. కనీసం వారిని ఇంట్లో అడుగు పెట్టనిచ్చిన పరిస్థితి కూడా లేదన్నారు. వందల కోట్లు సంపాదించుకొని కార్యకర్తలను విస్మరించిన వ్యక్తి ప్రకాష్ రెడ్డి అని ప్రస్తుతం వైసీపీ వారు ఆయనకు వ్యతిరేకంగా మారారన్నారు.

అదేవిధంగా నియోజకవర్గ సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. తాము ప్రచారానికి వెళ్లిన సమయంలో అనేక సమస్యలు తమ దృష్టికి తీసుకొచ్చారు.వాటిని పరిష్కరించే బాధ్యత కూడా మన పై ఉందన్నారు.పేరూరు, సోమల వాండ్ల పల్లి ప్రాజెక్టు పనులు పూర్తి చేయడంతో పాటు, రైతులకు నేటి ధర ప్రకారం పరిహారం ఇవ్వాలని, గంగులకుంట చెరువుకు నీరు అందించడం, జాకీ పరిశ్రమ స్థానంలో ఇతర పరిశ్రమలు నెలకొల్పి స్థానికులకు ఉపాధి కల్పించే బాధ్యత మీ భుజస్కందాలపై వేస్తున్నామన్నారు. అనంతపురం రూరల్ కాలనీలకు తాగునీరు, నడిమి వంక కాల్వ ప్రొటెక్షన్ వాల్ వంటి సమస్యలు పరిష్కరించాలని కోరారు. రాప్తాడు సభలో హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బి.కె పార్థసారథి, ధర్మవరం ఇన్చార్జి పరిటాల శ్రీరామ్, అనంతపురం జిల్లా అధ్యక్షుడు కాల్వ శ్రీనివాసులు, పెనుగొండ అభ్యర్థి సవితమ్మ, జనసేన పవన్ కుమార్, బీవీ వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed