యువగళం మరింత ఉత్తేజం.. టీడీపీ నేతల్లో పెరిగిన జోష్

by Disha Web Desk 12 |
యువగళం మరింత ఉత్తేజం.. టీడీపీ నేతల్లో పెరిగిన జోష్
X

దిశ, కర్నూలు ప్రతినిధి : జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో పర్యటించేలా పాదయాత్ర నిర్వహణ కమిటీ రాబిన్ శర్మ టీమ్ సభ్యులు అన్ని నియోజకవర్గ ఇంచార్జిలతో కలిసి కసరత్తు చేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గంలో రెండు మూడు రోజుల ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. లోకేష్ బస, బహిరంగ సభలు ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే విషయాలను చర్చిస్తున్నారు. ఇప్పటికే నిర్వహణ కమిటీ సభ్యులు డోన్, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గంలో పాదయాత్ర జరిగే గ్రామాలు, రాత్రి బస చేసే ప్రదేశాలు, సభ నిర్వహణపై క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. నేడు వీటికి సంబంధించిన రూట్ మ్యాప్ ను రెండు జిల్లాల అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రకటించే అవకాశం ఉంది.

శ్రేణుల్లో మరింత ఉత్సాహం

అనంతపురం జిల్లాలోని రాయలచెరువు మీదుగా ఈ నెల 13న నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండలంలోని డీ రంగాపురం వద్ద లోకేష్ అడుగుపెట్టనున్నారు. అక్కడి నుండి నల్లమేకలపలీ, జక్కసాని కుంట్ల, పీఆర్ పల్లి, గుడిపాడు, మాందొడ్డి, హెచార్ పల్లి మీదుగా ప్యాపిలి చేరుకుంటారు. అనంతరం కలచట్ల, ఎస్ రంగాపురం మీదుగా తుగ్గలి మండలం శభాషపురం వద్ద పత్తికొండ నియోజకవర్గంలో అడుగు పెడతారు. రామ లింగాయపల్లి క్రాస్, రాంపల్లి, ఆర్ఎస్ పెండేకల్లు, మారెళ్ళ, నల్లగుంట్ల మీదుగా ఎన్నో కొట్టాల వద్ద ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలంలోకి చేరుకుంటారు. అక్కడి నుంచి గుండ్లకొండ, గుడిమిరాళ్ల, బైరవాన్ కుంట, పలదొడ్డి, కె.వెంకటాపురం, గద్దె రాళ్ల మీదుగా మండలం కేంద్రం దేవనకొండకు చేరుకుంటారు.

అక్కడి నుంచి ఆలారుదిన్నె బ్రిడ్జి, పుప్పాల దొడ్డి, కైరుప్పల, కారుమంచి, ములుగుందం మీదుగా ఆదోని నియోజకవర్గంలోని పెద్ద పెండేకల్లు కి వస్తారు. ఆ నియోజకవర్గంలో ఆరేకల్లు, ఎస్.నాగులాపురం, కపటి మీదుగా పెద్దకడబూరు మండలం రంగాపురం వద్ద మంత్రాలయం నియోజకవర్గంలో అడుగు పెడతారు. మంత్రాలయం నియోజకవర్గంలో పెద్దకడబూరు మండలం తర్వాత నందవరం మండలం బాపురం వద్ద ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అడుగు పెడతారు.

హాలహారా ధర్మాపురం, ముగతి క్రాస్ నుంచి ఎమ్మిగనూరు పట్టణం చేరుకుంటారు. అక్కడి నుంచి గోనెగండ్ల మండలం మీదుగా కోడుమూరు నియోజకవర్గంలోకి చేరుకొని గూడూరు, కర్నూలు రూరల్, కల్లూరు మండలాల్లో పాదయాత్ర సాగిస్తారు. అనంతరం కర్నూలు నగరంలో లోకేష్ పాదయాత్ర సాగిస్తారు. అక్కడితో కర్నూలు జిల్లాలో పాదయాత్ర ముగుస్తుంది.

నంద్యాల జిల్లాలో..

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో నందికొట్కూరు, జూపాడుబంగ్లా, పాములపాడు మీదుగా ఆత్మకూరు నియోజకవర్గానికి చేరుకుంటారు. అక్కడి నుంచి వెలుగోడు, బండి ఆత్మకూరు మీదుగా నంద్యాల చేరుకునే అవకాశం ఉంది. అలా కాకుండా నందికొట్కూరు, గడివేముల మీదుగా బండి ఆత్మకూరు చేరుకొని అక్కడి నుంచి నంద్యాల చేరుకునే అవకాశం ఉంది.

రెండు మార్గాల్లో ఒక దానిని పాదయాత్ర కమిటీ ఓకే చేసే అవకాశం ఉంది. అయితే శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే ఆత్మకూరు పట్టణం మీదుగా పాదయాత్ర సాగించాలని పట్టు బట్టినట్లు సమాచారం. ఆత్మకూరు మీదుగా పాదయాత్రను ఖరారు చేస్తే నందికొట్కూరు నుంచి జూపాడుబంగ్లా, పాములపాడు మీదుగా శ్రీశైలం నియోజకర్గ కేంద్రమైన ఆత్మకూరు చేరుకుంటారు.

అక్కడి నుంచి వెలుగోడు మీదుగా బండి ఆత్మకూరు మీదుగా నంద్యాల చేరుకుంటారు. నంద్యాల పట్టణం నుండి గోస్పాడు మండలం నుంచి బనగానపల్లె నియోజకవర్గంలో అడుగు పెడతారు. బనగానపల్లె, కోవెలకుంట్ల మండలాల మీదుగా దొర్నిపాడు మండలం మీదుగా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చేరుకుంటారు. ఆళ్లగడ్డ, చాగలమర్రి మండలాల మీదుగా కడప జిల్లాలో అడుగుపెడతారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 35 రోజులు లోకేష్ పాదయాత్ర ఉండే అవకాశం ఉంది. వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేడు ప్రకటించనున్నారు.

Next Story

Most Viewed