లోకేశ్ ఓ పోరంబోకు.. నన్ను విమర్శించడానికి నువ్వెవడవురా?: ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు

by Disha Web Desk 21 |
లోకేశ్ ఓ పోరంబోకు.. నన్ను విమర్శించడానికి నువ్వెవడవురా?: ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నేపథ్యంలో తాటిపాక బహిరంగ సభలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు అవినీతి చిట్టాను బట్టబయలు చేశారు. రాపాక వరప్రసాద్ టికెట్ ఇచ్చి గెలిపించిన పార్టీకి వెన్నుపోటు పొడిచారని... రాజోలును అవినీతికి అడ్డాగా మార్చారని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఘాటుగా స్పందించారు. కత్తిమండ గ్రామంలో మీడియాతో మాట్లాడారు. నారా లోకేష్ ఒక పప్పు నాయుడని, పోరంబోకు అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. జనసేన పార్టీని మోసం చేసి తాను బయటకు రాలేదని స్పష్టం చేశారు. ఒకవేళ తాను తప్పు చేస్తే పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ విమర్శించాలి.. కానీ తనని విమర్శించడానికి నువ్వెవడవురా..? అంటూ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తీవ్రంగా మండిపడ్డారు. వెన్నుపోటు రాజకీయాలు నీ బాబు.. చంద్రబాబు నాయుడికి తెలిసినంతగా వేరెవ్వరికీ తెలియవని విమర్శించారు. దివంగత ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి, దొంగచాటుగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఆరోపించారు.

ఒక దళితుడు ఇల్లు కట్టుకుంటే ఇంత వివక్షా?

ఐదెకరాల్లో ప్యాలెస్‌ కట్టుకున్నానంటూ నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలకు సైతం ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కౌంటర్ ఇచ్చారు. తాను నిర్మించుకుంటున్న ఇంటిపై లోకేశ్ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక దళిత ప్రజాప్రతినిధి ఇల్లు కట్టుకుంటే ఇంత వివక్ష ఏంటని నిలదీశారు. తాను ఇళ్లు కట్టుకుంటే ఓర్చుకోలేకపోతున్నారని మండిపడ్డారు. ఎవడో వెధవ రాసిచ్చిన కాగితం చదవడం తప్ప తన గురించి నారా లోకేశ్‌కి ఏం తెలుసునని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుక దోపిడీకి పాల్పడింది.. కోట్లాది రూపాయాలు కాజేసింది లోకేశ్ అని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే అంగన్‌వాడీ, షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు అమ్ముకున్నారని ఆరోపించారు. తన తండ్రి తనకు 12 ఎకరాలు ఇస్తే ప్రస్తుతం అందులో కేవలం ఏడు ఎకరాలు మాత్రమే మిగిలిందని చెప్పుకొచ్చారు. అదే చంద్రబాబు అయితే రెండెకరాల నుంచి వేల కోట్లాది రూపాయలు ఎలా సంపాదించారో ప్రజలకు తెలుసునని చెప్పుకొచ్చారు. అవినీతి కేసులో తన తండ్రి చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లారనే విషయాన్ని లోకేశ్ మరచిపోయి తనపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. మరోవైపు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుపై లోకేశ్ ఆరోపణలను దళిత సంఘాలు ఖండించాయి. ఎమ్మెల్యే రాపాకకు లోకేశ్ క్షమాపణలు చెప్పకపోతే అట్రాసిటీ యాక్ట్ కింద ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

Next Story

Most Viewed