Somu Veerraju: వాళ్లతో కలిసి లేం.. అవినీతిపై పోరాడుతునే ఉన్నాం

by Disha Web Desk 16 |
Somu Veerraju:  వాళ్లతో కలిసి లేం..  అవినీతిపై పోరాడుతునే ఉన్నాం
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎప్పుడు బీజేపీ కలిసి లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు క్లారిటీ ఇచ్చారు. బీజేపీ మొదటి నుంచి వైసీపీ అవినీతిపై పోరాటం చేస్తూనే ఉందని చెప్పారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర హోంమత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల విశాఖ, శ్రీకాళహస్తి బహిరంగ సభల్లో వైసీపీపై చేసిన విమర్శలు, ఆరోపణలే ఆ పార్టీ పట్ల బీజేపీ వైఖరి ఏంటో తెలుస్తుందని చెప్పారు. బీజేపీ ఇప్పుడు కొత్తగా మాట్లాడటం లేదని ప్రభుత్వ వైఫల్యాలపై మొదటి నుంచీ వ్యతిరేకిస్తూనే ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌ను బీజేపీ ఎప్పుడూ సమర్ధించలేదని స్పష్టం చేశారు. ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయకపోవడంపై యువమోర్చా ఉద్యమం చేపడితే కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాగూర్‌ వచ్చి వైసీపీ మద్యం మాఫియాపై తీవ్ర విమర్శలు చేశారని గుర్తుచేశారు. జేపీ నడ్డా జూన్‌లో విజయవాడ, రాజమండ్రిలో పర్యటించి ప్రభుత్వ వైఫల్యాలపై ఘాటుగా విమర్శించారని స్పష్టం చేశారు. అలాగే ప్రకాష్‌ జవదేకర్‌ కూడా జగన్‌ అవినీతిపై స్పందించి జైలుకు వెళ్లే అవకాశం ఉందని విమర్శించిన విషయాన్ని గుర్తు చేశారు.

వైసీపీ మొదటి నుంచి మత వివక్ష కొనసాగిస్తోందని, హిందూధర్మంపై దాడులు జరిగితే ఉపేక్షించి నిందితులను వెనకేసుకొచ్చిందని సోము వీర్రాజు గుర్తు చేశారు. శ్రీకాళహస్తిలో నడ్జా, విశాఖలో అమిత్‌షా తీవ్రంగా ప్రభుత్వ దోపిడి, కుంభకోణాలపై ప్రశ్నించడంతో వైసీపీ దురుద్దేశంతో బీజేపీపై బురదజల్లాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. వైసీపీతో ఇప్పటి వరకు బీజేపీ కలసి ఉన్నట్లు, ఇక ఉండదేమో అనే అనుమానాన్ని ముఖ్యమంత్రి జగన్‌ వ్యక్తం చేయడం వ్యూహంతో కూడిన వంచనగా అభివర్ణించారు. బీజేపీ ఎప్పుడు వైసీపీతో ఉందో ముఖ్యమంత్రి జగన్‌ చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. వైసీపీకి సహకరించని కారణంగా అభ్యంతరకరమైన సంబోధనతో పవన్‌ కల్యాణ్‌ను జగన్‌ విమర్శించడంతో ఆ పార్టీతో చెలిమి చేస్తున్న పార్టీగా బీజేపీ, జగన్‌ను విమర్శిస్తోందని మండిపడ్డారు. పవన్ కల్యాణ్‌‌పై ఆ రకమైన పదప్రయోగాలు చేసే అర్హత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి లేదని చెప్పారు. కేంద్రం నుంచి అవసరమైనన్ని నిధులు తెచ్చుకుంటూ వాటిని దారి మళ్లించుకుంటూ మజా చేసే వైసీపీ, మేం విమర్శించినపుడు ఎదురు మాట్లాడక ప్రజల్ని ఏమార్చేలా జగన్‌ వ్యూహం అమలు చేస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. ఈ మైండ్‌ గేమ్‌ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, కేంద్ర సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కపనీ చేయలేదన్నారు.

తొమ్మిదేళ్ళ పాలనలో ఏపీకి కేంద్రంలోని బీజేపీ ఏం చేసిందనేదానిపై సోము వీర్రాజు బ్రోచర్ విడుదల చేశారు. ఈ నెల 20 నుంచి ఇంటింటికి వెళ్లి ఏపీకి బీజేపీ చేసిన సహాయంపై ప్రచారం చేస్తామన్నారు. 45 వేల పోలింగ్‌ బూత్‌లకు కిట్‌లు ఇస్తామన్నారు. లబ్దిదారులను వ్యక్తిగతంగా కలిసి ప్రచారం చేస్తామని సోము వీర్రాజు తెలిపారు.


Next Story

Most Viewed