‘ఏపీ హేట్స్ జగన్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన అచ్చెన్నాయుడు

by Disha Web Desk 21 |
‘ఏపీ హేట్స్ జగన్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన అచ్చెన్నాయుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో : స్వతంత్య్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక.. ఏ ముఖ్యమంత్రి చేయనంత అన్యా యం.. అరాచకం.. దోపిడీని కేవలం నాలుగేళ్లలో జగన్మోహన్ రెడ్డి చేశాడని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలోని 5 కోట్ల ప్రజలు తన ప్రభుత్వాన్ని ఛీకొట్టేలా చేసిన ఘనత కూడా ఆయనకే దక్కిందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్ రెడ్డికి, అతని దిక్కుమాలిన ప్రభుత్వానికి కర్రుకాల్చి వాతపెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం టీడీపీ నేతలతో కలిసి ఏపీ హేట్స్ జగన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. నాలుగున్నరేళ్ల జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలనకు...ప్రజల అంతరంగానికి అక్షర రూపం ‘ఏపీ హేట్స్ జగన్’ పుస్తకం అని చెప్పుకొచ్చారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో ‘ఏపీ హేట్స్ జగన్’ అని నినదిస్తున్నారు అని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇలా అన్ని వర్గాలవారు జగన్ రెడ్డి బాధితులేనన్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడకముందు, రాష్ట్ర విభజన వల్ల ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. 2019 ఎన్నికల సమయంలో ప్రజల్ని హామీలతో, మోసపు వాగ్ధానాలతో నమ్మించ డంలో జగన్మోహన్ రెడ్డి విజయం సాధించాడు అని చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రజలను వేధిస్తూ, రాష్ట్రాన్నిదోపిడీ చేస్తూనే ఉన్నాడన్నారు. తన దోపిడీ, అవినీతిని వాస్తవాల తో ప్రజల ముందు ఉంచుతున్నాడని, వారిలో చైతన్యం వస్తే తనకు, తన ప్రభుత్వానికి సమాధి కడతారని భావించే చేయని నేరానికి చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపాడు. జైల్లో ఉన్నా కూడా చంద్రబాబుపై, ఆయన కుటుంబంపై, టీడీపీపై నింద లేస్తూ ప్రజల్ని ఇంకా మోసగించే ప్రయత్నం చేస్తున్నాడు అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

బిడ్డ అంటే నమ్మిన ప్రజల్ని నట్టేట ముంచేవాడా జగన్ రెడ్డి?

నేను మీ బిడ్డను అంటూ ఈ మధ్య జగన్ కొత్త రాగం ఎత్తుకున్నాడు. బిడ్డ అంటే నమ్మిన వారిని నట్టేట ముంచేవాడా అని ముఖ్యమంత్రిని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. బిడ్డ అంటే రాష్ట్రానికి తీరని అన్యాయం.. ప్రజలకు తీవ్ర ద్రోహం చేయడమేనా జగన్ రెడ్డి? అని నిలదీశారు. ఎన్నికలకు ముందు మేనిఫెస్టో తనకు బైబిల్, భగవద్గీత, ఖురాన్ తో సమానమని చెప్పిన జగన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని నెరవేర్చకుండానే అన్నీ చేసేశానని ప్రజల్ని ఏమార్చేప్రయత్నం చేస్తున్నాడు అని మండిపడ్డారు. జగన్ గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు చాంతాడంత ఉంటే, వాటిలో అమలు చేసినవి చారెడంతేనన్నారు. 2.30లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్.. మద్యపాన నిషేధం.. సీపీఎస్ రద్దు... ప్రత్యేకహోదా.. 25లక్షల ఇళ్లనిర్మాణం..పోలవరం నిర్మాణం... అమరావతి ఆకాంక్షలు.. ఏమయ్యాయో జగన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి అని అచ్చెన్నాయుడు నిలదీశారు. అధికారంలోకి వస్తే రాజధాని అమరావతిని నిర్మిస్తానని.. రాజధానిలోనే ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పిన వ్యక్తి, చివరకు మూడు రాజధానుల నాటకమాడి రాష్ట్రానికి రాజధాని లేకుండా ఎందుకు చేశాడో ప్రజలకు సమాధానం చెప్పాలి అని నిలదీశారు.టీడీపీప్రభుత్వం అమలుచేసిన ఉచిత ఇసుక విధానాన్ని రద్దుచేసి, ఇసుక దోపిడీతో రూ.40వేల కోట్లు కొట్టేసిన జగన్ రెడ్డి నిర్వాకంతో 40 లక్షలమంది నిర్మాణరంగ కార్మికులు రోడ్డునపడ్డారన్నారు. ప్రజలు చివరకు తమ మానప్రాణాలు..స్వేచ్ఛ, హక్కుల కోసం ఎందుకు పోరాడుతున్నారో... వారికి ఆ పరిస్థితి ఎందుకు కల్పించాడో ముఖ్యమంత్రి చెప్పాలి అని అచ్చెన్నాయుడు నిలదీశారు. స్కిల్ స్కాం కేసులో 40 రోజులైనా చంద్రబాబు ఆవగింజంత అవినీతి చేశాడని కూడా జగన్ నిరూపించలేక పోయాడు అని విమర్శించారు. ఇన్ని రోజులు చంద్రబాబు జైల్లో ఉన్నా న్యాయస్థానాలు ఎందుకు వైసీపీ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధీనంలోని విచారణాసంస్థల్ని ప్రశ్నించడం లేదు? అని అచ్చెన్నాయుడు నిలదీశారు. అమరావతి నిర్మాణాలకోసం ప్రజలసొమ్ము దుర్వినియోగం చేశారన్న మంత్రి బొత్స సత్యనారాయణ నేడు రుషికొండపై జగన్ రెడ్డి నిర్మిస్తున్న రాజప్రాసాదంపై నోరు మెదపడేం? అని ప్రశ్నించారు. అమరావతిలో టీడీపీ ప్రభుత్వం నిర్మించిన నిర్మాణాలకు చదరపు అడుగుకి రూ.6 వేలు చెల్లిస్తేనే.. అవినీతి చేశారని గగ్గోలు పెట్టిన వైసీపీనేతలు.. నేడు జగన్ రెడ్డి చదరపు అడుగుకి రూ.28 వేలు చెల్లిస్తుంటే నోరు ఎత్తరేం? జగన్ రెడ్డి బాత్రూమ్ లకు.. టాయ్ లెట్ల నిర్మా ణానికి వేలకోట్ల ప్రజలసొమ్ము తగలేస్తారా? అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

విలాసవంతమైన జీవితం కోసమే విశాఖకు జగన్

ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులు.. వారిముందు తమ ఆటలు సాగుతాయన్నఆలోచనతోనే జగన్ విశాఖపట్నంలో కాపురం పెట్టబోతున్నాడు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు నాలుగున్నరేళ్లుగా తమను పట్టించుకోని జగన్ రెడ్డికి, అతని ప్రభుత్వానికి కర్రుకాల్చి వాతపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పుకొచ్చారు. కేవలం సముద్రం పక్కన విలాసవంతమైన జీవితం గడపడానికే జగన్ విశాఖ పట్నానికి వెళ్తున్నాడు అని మండిపడ్డారు. చంద్రబాబునాయుడి కంటే తాను దేనిలో మెరుగో జగన్ రెడ్డి చెప్పాలి. జగన్ రాష్ట్రానికి పట్టిన శని అని ప్రజలంతా భావిస్తున్నారు అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో టీడీపీ నేతలు నక్కా ఆనంద్ బాబు, బొండా ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, కిమిడి కళా వెంకట్రావు, కే.ఎస్.జవహర్, గద్దె రామ్మోహన్ రావు, పంచుమర్తి అనురాధ, కొమ్మారెడ్డి పట్టాభిరామ్, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు



Next Story

Most Viewed