బ్రేకింగ్: విజయనగరం రైలు ప్రమాదానికి కారణం అదే..!

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: విజయనగరం రైలు ప్రమాదానికి కారణం అదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆదివారం రాత్రి కంటకాపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో ఇప్పటికే 14 మంది మృతి చెందగా.. మరో 100 మందికి పైగా ప్రయాణికులు తీవ్ర గాయాల పాలయ్యారు. కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం ఆగి ఉన్న విశాఖపట్టణం-పలాస రైలును అదే ట్రాక్‌లో వెనక నుంచి వచ్చిన విశాఖ-రాయగఢ రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఎన్ని కుటుంబాల్లో విషాదం నింపిన ఈ దుర్ఘటనకు కారణమేమిటనేది ఇప్పటి వరకు స్పష్టంగా తెలియలేదు. అయితే, విజయనగరం జిల్లాలో జరిగిన ఈ ఘోర రైలు ప్రమాదానికి సిగ్నలింగ్ ఫెయిల్యూర్ కారణమని సమాచారం. సిగ్నల్ లోపం వల్లే విశాఖపట్టణం-పలాస, విశాఖ-రాయగఢ ఒకే ట్రాక్‌పై పరస్పరం ఢీకొన్నట్లు తెలుస్తోంది. భారత దేశ రైల్వే చరిత్రలోనే అత్యంత ఘోర ప్రమాదంగా నిలిచిన ఒడిషా బాలాసోర్ ట్రైన్ యాక్సిడెంట్ తరహాలోనే విజయనగరం ప్రమాదం సైతం జరిగినట్లు సమాచారం.

కాగా, ఈ ఏడాది జూన్ 2వ తేదీన ఓడిషాలోని బాలాసోర్ వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. సిగ్నలింగ్ లోపం వల్ల మూడు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో దాదాపు 300 మంది వరకు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇంత అప్డేటేడ్ టెక్నాలజీ ఉన్న ఈ కాలంలో దేశంలో వరుస రైలు ప్రమాదాలు చోటుచేసుకోవడం ఆందోళనకు గురి చేస్తోంది. రైలు ప్రమాదాలను నివారించేందుకు ఇండియన్ రైల్వే తీసుకొచ్చిన ‘కవచ్’ టెక్నాలజీపై విజయనగరం ఘటనతో మరోసారి అనుమానాలు తలెత్తున్నాయి. కవచ్‌ అనేది ఒక యాంటీ కొలిజన్‌ టెక్నాలజీ సిస్టమ్‌.

ఒక లోకోపైలెట్‌ రెడ్‌ సిగ్నల్‌ను పట్టించుకోకుండా అలాగే రైలును నడిపినపుడు కవచ్‌ అనే సిస్టమ్‌ అటోమేటిగ్గా ఆ రైలును అపేస్తుంది. అదేవిధంగా రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినపుడు ప్రమాదం జరగకుండా కవచ్‌ కాపాడుతుంది. అయితే, ఇండియన్ రైల్వే ఈ కవచ్ సిస్టమ్‌ను అన్ని రూట్లలో ఏర్పాటు చేయలేదు. కేవలం రద్దీగా ఉండే ప్రధాన రైల్వే మార్గాలలో మాత్రమే ఈ టెక్నాలజీని ఇన్‌స్టాల్ చేశారు. అయితే, విజయనగరం జిల్లాలో ఆదివారం ప్రమాదం జరిగిన మార్గంలో ఈ కవచ్ వ్యవస్థ ఉందో లేదో తెలియాలి.

ఇక, విజయనగరం రైలు ప్రమాద ఘటనలో మూడు రైలు బోగీలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఆదివారం రాత్రి వరకు 7 గురు మృతి చెందగా.. ఇవాళ మృతుల సంఖ్య 14కు చేరింది. మరో 100 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలంలో రెస్య్కూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.



Next Story