ఉచిత వైద్యం రూ.25 లక్షలకు పెంపు ఎన్నికల జిమ్మిక్కే: ఎమ్మెల్యే డోలా

by Disha Web Desk 21 |
ఉచిత వైద్యం రూ.25 లక్షలకు పెంపు ఎన్నికల జిమ్మిక్కే: ఎమ్మెల్యే డోలా
X

దిశ, డైనమిక్ బ్యూరో : నాలుగున్నరేళ్లుగా ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిన జగన్ రెడ్డి ఎన్నికలు సమీపిస్తుండటంతో జిమ్మిక్కులు చేస్తున్నారు అని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి ఆరోపించారు. ఇకపై ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకూ ఉచిత వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. నెట్ వర్క్ ఆస్పత్రులకు రూ. 1000 కోట్ల బకాయిలు చెల్లించకుండా పేదలకు కార్పొరేట్ వైద్యం దూరం చేసిన జగన్ రెడ్డి ప్రచారార్భాటాలు చేసుకోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ప్రాణాపాయ స్థితిలో ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందనప్పుడు ప్యాకేజీ రూ. 25 లక్షలు పెంచితే ఏంటి ? కోటికి పెంచితే ఏంటి? అక్కరకు రాని జగన్ రెడ్డి గొప్పలు పేదల ప్రాణాలు నిలబెడతాయా? మాటలు కోటలతో ఆరోగ్య విప్లవం వచ్చేస్తుందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందక పేదలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. దొరికిన చోటల్లా డబ్బులు తీసుకుని అప్పులపాలవుతున్నారు అని ధ్వజమెత్తారు. ఇవేమీ జగన్ రెడ్డి కళ్లకు కనిపించడంలేదా? అని నిలదీశారు. తెలుగుదేశం హయాంలో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా , సీఎమ్ ఆర్ ఎఫ్ ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించాం అని గుర్తు చేశారు. పథకాలను పారదర్శకంగా అమలు చేశాం... మరి జగన్ రెడ్డి చేసిందేంటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చింది నిజం కాదా? అని నిలదీశారు. ప్రభుత్వాసుపత్రులను నరకకూపాలుగా తయారుచేసింది వాస్తవం కాదా ? అంటూ మండిపడ్డారు. ఇకనైనా జగన్ రెడ్డి బూటకపు మాటలు కట్టిపెట్టాలి. ముఖ్యమంత్రి గారికి పేద ప్రజల ప్రాణాలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలి. ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి అని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి సూచించారు.

Next Story