Ap News: తెనాలిలో ఇద్దరూ ఇద్దరే.. పోటీ చేసేదెవరు?

by Disha Web Desk 16 |
Ap News: తెనాలిలో ఇద్దరూ ఇద్దరే..  పోటీ చేసేదెవరు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారిపోతున్నాయి. పొత్తులు, ఎత్తులపైనా చర్చ జరుగుతుంది. వైసీపీ సింగిల్‌గా పోటీ చేస్తానని ప్రకటించింది. కానీ జనసేన, టీడీపీ, బీజేపీ మాత్రం పొత్తులతోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించాయి. అయితే పొత్తులపై క్లారిటీ అనేది రాలేదు. కానీ టీడీపీ, జనసేనల మధ్య పొత్తు కన్ఫర్మ్ అయిపోయిందని పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. అయితే టికెట్ల సర్ధుబాటు ప్రక్రియ జరుగుతుందని ఇరు పార్టీలకు చెందిన నేతలు చెప్తున్నారు. జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సైతం ఇదే వ్యాఖ్యలు చేశారు. టికెట్ల సర్ధుబాటు అంశం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు నిర్ణయిస్తారని బహిరంగంగా వ్యాఖ్యలు చేయడంతో ఇక పొత్తు ఖచ్చితమనే ధీమా వచ్చేసింది. దీంతో సీట్ల సర్ధుబాటు విషయంలో అటు టీడీపీ ఇటు జనసేనల మధ్య లొల్లి మెుదలయ్యే ఛాన్స్ లేకపోలేదు. అటు జనసేన, ఇటు టీడీపీ అభ్యర్థులు ఆయా నియోజకవర్గాలలో తమ కార్యక్రమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నారు. ఇలాంటి తరుణంలో కొందరు టికెట్లు త్యాగం చేయాల్సిన పరిస్థితి రానే వచ్చింది. ఇప్పుడు తెనాలి నుంచి టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్. అదే నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తానని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించేశారు. దీంతో ఆలపాటి రాజా పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. జనసేన పార్టీలో నెంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్‌ను కాదని ఆలపాటి రాజాకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి తరుణంలో ఆలపాటి రాజా తన టికెట్ త్యాగం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

గెలుపు ఖాయమంటున్న నాదెండ్ల

తెనాలి నియోజకవర్గం నుంచి ప్రస్తుత జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ రెండు సార్లు గెలుపొందారు. అలాగే ఆయన తండ్రి నాదెండ్ల భాస్కరరావు సైతం గెలుపొందారు. ఈ నియోజకవర్గం నాదెండ్ల మనోహర్ సొంత నియోజకవర్గం. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మూడోస్థానంతో సరిపెట్టుకున్నారు. వైసీపీ వేవ్‌లోనూ 29,905 అంటే 15 శాతం ఓట్లను సాధించారు. అయితే పొత్తులో భాగంగా ఈసారి టికెట్ తనదేనని ధీమాగా ఉన్నారు. జనసేన పార్టీలో నెంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్‌కు టికెట్ ఇవ్వడం పెద్ద కష్టమేమీ కాదు. అందులోనూ చంద్రబాబు సొంత సామాజిక వర్గం కూడా కావడంతో అటు టీడీపీ సైతం ఇబ్బంది పెట్టదనే ప్రచారం కూడా ఉంది. ఇకపోతే గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన,బీజేపీ విడివిడిగా పోటీ చేశాయి. దీంతో వైసీపీ గెలుపొందింది. టీడీపీ 37శాతం ఓట్లను సాధించింది. అయితే వైసీపీ అభ్యర్థి 46శాతం ఓట్లతో గెలుపొందారు. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ,జనసేనల మద్య పొత్తు ఖచ్చితమని తేలిన నేపథ్యంలో నాదెండ్ల మనోహర్‌కు టికెట్ కన్ఫర్మ్ అనే ప్రచారం జరుగుతుంది. ఒకవేళ నాదెండ్ల మనోహర్‌కు పొత్తులో భాగంగా టికెట్ ఇస్తే గెలుపొందడం ఖాయమనే ధీమాలో ఉన్నారు.

రాజా పరిస్థితేంటి?

ఆలపాటి రాజేంద్రప్రసాద్ అలియాస్ రాజా కుటుంబానికి కంచుకోట తెనాలి నియోజకవర్గం. తెనాలి నుంచి ఆలపాటి వంశస్థులు టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్ సైతం టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొంది ఏకంగా మంత్రిగా కూడా పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే 2019 ఎన్నికల్లో 9శాతం ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌కు 94,495 ఓట్లు వస్తే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు 76,846 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. మూడో స్థానానికే జనసేన పరిమితమైంది. అయితే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా తెనాలి నుంచి పోటీ చేసి గెలుపొందాలని ఆలపాటి రాజేంద్రప్రసాద్ భావిస్తున్నారు. పార్టీ అధిష్టానం దగ్గర మంచి గుర్తింపు ఉండటం, చంద్రబాబు నాయుడుకు నమ్మిన బంటు కావడంతో ఇక తెనాలి టికెట్ తనదేననే ధీమాతో ఉన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు సైతం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు ఆలపాటి రాజా వర్గీయుల్లో ఆందోళన కలిగిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తాను తెనాలి నుంచి పోటీ చేస్తానని నాదెండ్ల మనోహర్ ప్రకటించేశారు. దీంతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రాజకీయ భవిష్యత్ ఏంటనేదానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.

ఎమ్మెల్సీ ఇస్తారంటూ ప్రచారం

తెలుగుదేశం పార్టీ హైకమాండ్, చంద్రబాబు, నారా లోకేశ్‌లకు అత్యంత దగ్గరగా ఉండే నాయకులలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఒకరు. అంతేకాదు పార్టీకి వీరవిధేయుడిగా మంచి గుర్తింపు ఉంది. అయితే జనసేన,బీజేపీలతో పొత్తు ఉంటే ఎలాంటి సాహసానికైనా తాను సిద్ధమేనని అధిష్టానం వద్ద ఆలపాటి రాజా గతంలోనే ప్రకటించారని తెలుస్తోంది. ఇందులోనే భాగంగానే ‘జనసేనతో పొత్తు ఉండేది, లేనిదీ అధిష్టానం చూసుకుంటుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎక్కడ నుంచి పోటీ చేసేది అధిష్టానం నిర్ణయిస్తుంది. తెనాలి సీటేమీ నాకు రాసి పెట్టలేదు కదా? అంటూ ఆలపాటి రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఇకపోతే తెలుగు యువత నాయకుడిగా 1989 నుంచి 1994 వరకు ఆలపాటి రాజా పనిచేశారు. 33ఏళ్లుగా పార్టీనే నమ్ముకునిఉన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా టీడీపీని వదల్లేదు. తొలుత వేమూరులో, ఆ తర్వాత తెనాలిలో పోటీ చేసి గెలుపొందారు. అయితే నాదెండ్ల మనోహర్ టికెట్ దక్కించుకుంటే రాజాకు ఎమ్మెల్సీ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. ఆలపాటి రాజాను ఒప్పించడం చంద్రబాబుకు పెద్ద కష్టమేమీ కాదని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతుంది.



Next Story

Most Viewed