CM Jagan విద్యుత్‌ శాఖపై సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

by Disha Web Desk 16 |
CM Jagan విద్యుత్‌ శాఖపై సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: వేసవిలో విద్యుత్‌ కొరత ఉండకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నతాధికారులను ఆదేశించారు. విద్యుత్ కొరత అనే పదం వినపడకూడదని ఆయన సూచించారు. విద్యుత్‌ కొరత కారణంగా కరెంటు కోతలనే సమస్య ఉత్పన్నం కాకూడదని చెప్పారు. ఈ మేరకు అధికారులు అన్ని రకాలుగా సిద్ధం కావాల్సిన అవసరం ఉందని ఆదేశించారు. వేసవిలో విద్యుత్‌ డిమాండ్, రైతులకు విద్యుత్‌ కనెక్షన్లు, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా తదితర అంశాలపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. బొగ్గు నిల్వల విషయంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. థర్మల్‌ కేంద్రాలకు బొగ్గు కొరతరాకుండా అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

పెరిగిన విద్యుత్ డిమాండ్

రాష్ట్రంలో ఫిబ్రవరి 2వ వారం నుంచే విద్యుత్‌ డిమాండ్‌ పెరిగిందని జగన్‌కు అధికారులు తెలియజేశారు. మార్చి, ఏప్రిల్‌ నెలలో సగటున రోజుకు 240 మిలియన్‌ యూనిట్లు, ఏప్రిల్‌లో 250 మిలియన్‌ యూనిట్లు ఉంటుందని అంచనా వేసినట్లు వివరించారు. ఇప్పటికే పవర్‌ ఎక్స్‌ఛేంజ్‌లో ముందస్తుగా విద్యుత్‌ను బుక్‌ చేసుకున్నామని సీఎం జగన్‌కు అధికారులు తెలియజేశారు.

వ్యవసాయ కనెక్షన్లపై కీలక ఆదేశాలు

రాష్ట్రవ్యాప్తంగా రైతులు పెట్టుకునే వ్యవసాయ కనెక్షన్లపై సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం ప్రకటించారు. ఏ నెలలో దరఖాస్తు చేసుకుంటే అదే నెలలో కనెక్షన్ మంజూరు చేయాలని సీఎం ఆదేశాలిచ్చారు. రైతులకు కనెన్షన్ల మంజూరులో ఎలాంటి జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. ఇదివరకే దరఖాస్తు చేసుకున్న వారికి 1.06లక్షల కనెక్షన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మంజూరు చేశామని అధికారులు సీఎం జగన్‌కు తెలియజేశారు. మార్చి నాటికి మరో 20వేల కనెక్షన్లుపైగా మంజూరు చేస్తున్నట్టు వివరించారు. విద్యుత్‌ సరఫరా నాణ్యతను పెంచాలన్న సీఎం ఆదేశాల మేరకు అనేక చర్యలు తీసుకున్నామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 100 విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల నిర్మాణం పూర్తవుతున్నట్టు వెల్లడించారు. మార్చి నెలాఖరు నాటికి వీటిని పూర్తిచేస్తున్నామని చెప్పుకొచ్చారు.

నిర్మాణం పూర్తి చేసుకున్న ప్రతీ ఇంటికి కనెక్షన్లు ఇవ్వాలి

అలాగే పేదలందరికీ ఇళ్లు పథకం కింద నిర్మాణాలు పూర్తి చేసుకుంటున్న వారికి వెంటనే కనెక్షన్లు మంజూరు చేయాలిని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. అయితే ఇప్పటికే పూర్తి చేసుకున్న ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.18లక్షలకుపైగా ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చామని అధికారులు వెల్లడించారు. ఇళ్లు పూర్తవుతున్నకొద్దీ.. వాటికి కనెక్షన్లు శరవేగంగా ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ సమీక్షా సమావేశానికి విద్యుత్, అటవీ పర్యావరణం, మైన్స్‌ అండ్‌ జియాలజీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ డా.కేఎస్‌ జవహర్‌రెడ్డి, ఇంధనశాఖ స్పెషల్‌ సీఎస్‌ కె విజయానంద్, పరిశ్రమలుశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, ట్రాన్స్‌కో జేఎండీలు పృధ్వీతేజ్, మల్లారెడ్డి సీపీడీసీఎల్‌ సీఎండీ పద్మా జనార్ధనరెడ్డి, ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ ఎండీ ఎస్‌.రమణారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.



Next Story

Most Viewed